[1] ఆ తరువాత యోబు నోరు తెరచి తన జన్మదినాన్ని శపించాడు.
[2] యోబు ఇలా అన్నాడు:
[3] “నేను పుట్టిన రోజు లేకుండా ఉంటే బావుండేది. మగ శిశువు పుట్టాడు అని చెప్పుకున్న రాత్రి అంటూ లేకుండా ఉంటే బాగుండేది. నా తల్లి గర్భాన్ని అది మూసింది కాదు, నా కండ్లకు బాధను మరుగు చెయ్యకపోయింది.
[4] గనుక ఆ రోజు చీకటిగా మారాలి! పైగా ఉన్న దేవుడు దానిని తలచుకోకూడదు. దానిమీద వెలుగు ప్రసరించకూడదు.
[5] చీకటి, చావునీడ దాన్ని తమలోకి చేర్చుకోవాలి! దానిని మబ్బు ఆవరించాలి! పగటివేళ చీకటి కమ్మినట్లు దానికి భయాందోళన పుట్టించాలి!
[6] చీకటే ఆ రాత్రిని పట్టుకోవాలి! సంవత్సరం రోజులలో ఆ రోజు లేకుండా పోవాలి! ఏ నెలలోనూ అది ఒక భాగం కాకూడదు.
[7] ఆ రాత్రి ఎవడూ పుట్టకపోతే ఎంత బావుండేది! అప్పుడు ఎవడూ సంతోషధ్వనులు చెయ్యకపోతే ఎంత బావుండేది!
[8] రోజులను శాపనార్థాలు పెట్టేవాళ్ళు ఆ రోజును శపించాలి! లివయాటాన్‌ను రెచ్చగొట్టేవారు దానిని శపిస్తారు గాక!
[9] సందెవేళలో ప్రకాశించే నక్షత్రాలను చీకటి కమ్మాలి! ఆ రాత్రివేళ వెలుగుకోసం ఎదురు చూచివుంటే వెలుగు లభ్యం కాకుండా ఉండాలి!
[10] ఉదయించే సూర్యకిరణాలు కనబడకుండా ఉండాలి!
[11] పుట్టగానే నేనెందుకు చచ్చాను కాను? తల్లి గర్భంనుంచి రాగానే నా ప్రాణం ఎందుకు పోలేదు?
[12] నన్ను మోకాళ్ళమీద ఎందుకు ఉంచారు? నేనెందుకు స్తన్యపానం చేసినట్టు?
[13] లేకపోతే నేను ఈ పాటికి పడుకొని, ప్రశాంతంగా ఉండిపొయ్యేవాణ్ణి గదా! కన్నుమూసి ఉండేవాణ్ణి. నాకు విశ్రాంతి లభించివుండేది.
[14] శిథిలమైపోయిన భవనాలు మళ్ళీ కట్టించుకునే భూరాజులలాగా మంత్రులలాగా నేనూ చనిపోయి ప్రశాంతంగా ఉండిపొయ్యేవాణ్ణి.
[15] బంగారం సంపాదించుకొని, తమ ఇండ్లనిండా వెండి కూడబెట్టుకున్న అధికారుల్లాగా కన్నుమూసి ఉండేవాణ్ణి.
[16] భూమిలో పాతిపెట్టబడ్డ పిండంలాగా, వెలుగు చూడని శిశువులాగా నాకిప్పుడు ఈ లోకంలో ఉనికే ఉండేది కాదు.
[17] అక్కడ దుర్మార్గులు అల్లరి చేయడం మానుకుంటారు, అలసినవారికి అక్కడ విశ్రాంతి.
[18] అక్కడ బందీలు కలిసి విశ్రమిస్తారు. వారిచేత ఊడిగం చేయించేవాళ్ళ మాటలు వారికి వినపడవు.
[19] పేదవారూ, గొప్పవారూ అక్కడ ఉన్నారు. దాసులు తమ యజమానుల స్వాధీనం నుంచి విడుదల అయ్యారు.
[20] దుర్దశతో ఉన్నవారికి వెలుగు ఎందుకు? దుఃఖాక్రాంతులకు బ్రతుకు ఎందుకు?
[21] వారు మృతిని కోరుకుంటారు. మరుగైవున్న ధనం కోసం లోతుగా తవ్వినట్టు దానికోసం వెదుకుతారు. అది వారికి ప్రాప్తం కాలేదు.
[22] సమాధికి చేరడం వల్ల ఆనందమయులవుతారు, చాలా సంబరపడిపోతారు.
[23] మార్గం చూడలేనివాడికి, చుట్టూ దేవుడు కంచె వేసినవాడికి బ్రతుకు ఎందుకు?
[24] భోజనం చేయడానికి బదులు నేను నిట్టూర్పులు విడుస్తూనేవున్నాను. నీటిబుగ్గలాగా నా మూలుగులు పెల్లుబికి వస్తూవున్నాయి.
[25] నేను భయపడినదే నాకు సంభవించింది. నన్ను భయపెట్టినదే నా మీదికి ముంచుకువచ్చింది.
[26] నాకు శాంతి లేదు. సుఖం లేదు. విశ్రాంతి లేదు. నేను అనుభవిస్తున్నది ఆందోళనే.