[1] ఇది యోబు ఇచ్చిన జవాబు:
[2] “నా శోకం సరిగా తూగుతుంది. గాక! నా విపత్తంతా త్రాసులో పెట్టడం జరుగుతుంది గాక!
[3] అవి సముద్రం ఇసుకకంటే బరువు. అందుకనే నేను ఆలోచించకుండా మాట్లాడాను.
[4] అమిత శక్తిగలవాని బాణాలు నాలో గుచ్చుకు పొయ్యాయి. వాటి విషం నా ఆత్మలో వ్యాపిస్తూవుంది. దేవుని భయంకరమైన చర్యలు సైన్యంలాగా నాకు వ్యతిరేకంగా బారులు తీరి నిలిచాయి.
[5] అడవి గాడిదకు గడ్డి ఉన్నప్పుడు అరుస్తుందా? ఎద్దుకు మేత దొరికితే, రంకె వేస్తుందా?
[6] చప్పటి పదార్థం ఉప్పు లేకుండా ఎవరైనా తింటారా? గుడ్డులోని తెలుపుకు రుచి ఉందా?
[7] అలాంటివాటిని ముట్టుకోవడానికి కూడా నాకు ఇష్టం లేదు. అవి తినాలంటే, నాకు అసహ్యం అనిపిస్తుంది.
[8] నా కోరిక తీరుతుంది గాక! నా ఆశాభావం దేవుడు నెరవేరుస్తాడు గాక!
[9] ఎలాగంటే నన్ను చితగొట్టడం దేవునికి ఇష్టమవుతుంది గాక! దేవుడు చెయ్యి చాపి, నన్ను లేకుండా చేస్తాడు గాక!
[10] అలాంటప్పుడు నాకు ఆదరణ ఇంకా ఉంటుంది, నన్ను వదలని వేదనలో సంతోషం ఉంటుంది. ఎందుకంటే, పవిత్రుడైన దేవుని మాటలు నేను కాదనలేదు.
[11] నా బలమెంత? నేనెందుకు ఆశాభావంతో కనిపెట్టుకోవాలి? నా అంతిమ స్థితి ఏపాటిది? నేనెందుకు ఓర్చుకోవాలి?
[12] నాకేమైన రాయికున్నంత గట్టితనం ఉందా? నాదేమైన కంచు శరీరమా?
[13] నాలో నాకు సహాయం అంటూ ఏమీ లేదు. బలాభివృద్ధి నన్ను పూర్తిగా వదిలిపెట్టిపోయింది.
[14] అమిత శక్తి గల వాని పట్ల భయభక్తులు విడిచిపెట్టినా సరే, నిరాశ చెందినవాడి మీద స్నేహితుడు దయ చూపాలి గదా?
[15] నా సోదరులు వానకాలంలో మాత్రమే పారే వాగులాగా, కనబడకుండా పొయ్యే ప్రవాహంలాగా నమ్మరాని వారయ్యారు.
[16] అలాంటి ప్రవాహాలు కరిగిపోయిన మంచుగడ్డలతో, హిమంతో నల్లబడి పారుతాయి.
[17] ఎండాకాలంలో అవి కనబడవు. వేడిమి కలగగానే అవి తమ చోటునుంచి పూర్తిగా ఆర్చుకుపోతాయి.
[18] అవి అటూ ఇటూ తిరుగుతాయి. తరువాత ఏమీ లేకుండా నీళ్ళు ఇంకిపోతాయి.
[19] తేమానుంచి ప్రయాణమైన వర్తకులు ఆ ప్రవాహాలకోసం వెదకుతారు. షేబ బాటసారులు వాటి మీద ఆశ పెట్టుకొంటారు.
[20] వారికి నమ్మకం ఉన్నా ఆశాభంగం కలుగుతుంది. ఆ చోటికి వచ్చి సిగ్గుపడుతారు.
[21] మీరు ఆ ప్రవాహాలలాగే అయ్యారు. నా భయంకరమైన స్థితిని చూచి మీరు హడలిపోతున్నారు.
[22] నాకేమైనా తెచ్చి ఇవ్వండని అడిగానా? మీ కలిమిలోనుంచి నాకేదైనా ఇచ్చిపోండని ప్రాధేయపడ్డానా?
[23] శత్రువు బారినుంచి నన్ను తప్పించండి అని గానీ, నన్ను బాధపెట్టేవారి చేతిలో నుంచి కాపాడండి అని గానీ అన్నానా?
[24] నాకు మీరు ఉపదేశం చేయండి. మౌనం వహిస్తాను. నేనెక్కడ తప్పిపోయానో నాకు చూపండి.
[25] యథార్థ వాక్కులు చాలా ప్రభావం గలవి. కాని, మీ వివాదాలు నిష్ ప్రయోజనమైనవి.
[26] నా మాటలను బట్టి నన్ను మందలిద్దామనుకున్నారా? నిరుత్సాహంతో క్రుంగిపోయినవాడి మాటలు గాలికే పోతాయి గదా?
[27] అనాథ శిశువులను బానిసలుగా కొనేందుకు చీట్లు వేసేవాళ్ళలాగా ఉన్నారు మీరు, మీ స్నేహితుణ్ణి లాభానికి అమ్మజూపేటంతటివాళ్ళు మీరు.
[28] ఇప్పుడు నా ముఖంలోకి చూడండి. మీ ముఖాలు చూచి అబద్ధమాడుతానా? చెప్పండి.
[29] మళ్ళీ ఆలోచించండి. మీరు చెప్పేదాంట్లో అన్యాయం ఉండకూడదు. మళ్ళీ ఆలోచించండి. ఇందులో నేను నిర్దోషిని.
[30] అన్యాయమనేది నా నాలుకమీద ఉంటుందా? అపనింద విషయాలేవో నా నోరు పసికట్టలేదా?