[1] అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు:
[2] “నేను చెప్పేది శ్రద్ధతో వినండి. మీరు నన్ను ఓదార్చడానికి బదులు ఇలా వింటే చాలు!
[3] నేను మాట్లాడుతాను. ఓర్చుకోండి. నేను మాట్లాడిన తరువాత నన్ను వేళాకోళం చేస్తే చెయ్యండి.
[4] నేను మనుషుల మీద ఫిర్యాదు చేయడం లేదు. నేనెందుకు ఆతురపడకూడదు?
[5] నావైపు చూచి ఆశ్చర్యపడండి. నోటిమీద చెయ్యి పెట్టుకోండి.
[6] ఈ విషయాన్ని గురించి తలంచుకొంటేనే నేను హడలిపోతాను. నా శరీరం వణకుతుంది.
[7] దుర్మార్గులు ఇంకా బ్రతుకుతూ ఉంటారెందుకని? ముసలివాళ్ళయి బలప్రభావాల అభివృద్ధి చెందుతారెందుకు?
[8] వాళ్ళ ఎదుటనే, వాళ్ళ చుట్టూ వాళ్ళ సంతానం సుస్థిరమవుతుంది. వాళ్ళు చూస్తుండగానే వాళ్ళ వంశాన్ని స్థాపించడం జరుగుతుంది.
[9] వాళ్ళ కుటుంబాలు నిర్భయంగా, సురక్షితంగా ఉన్నాయి. దేవుని శిక్షాదండం వాళ్ళ మీదికి రావడం లేదు.
[10] వాళ్ళ పశువులు దాటితే తప్పనిసరిగా చూలు కలుగుతుంది. ఈసుకుపోకుండా ఆవులు సులభంగా ఈనుతాయి.
[11] వాళ్ళ పిల్లలు గుంపులు గుంపులుగా బయలుదేరుతారు. వాళ్ళ చిన్నవారు ఎగిరి కుప్పి గంతులు వేస్తారు.
[12] వాళ్ళు కంజరి, తంతి వాద్యం వాయిస్తూ స్వరమెత్తి పాడతారు. పిల్లనగ్రోవి మోగిస్తూ ఆనందిస్తారు.
[13] వాళ్ళ రోజులు సుఖంగా గడుపుతారు. ఒక్క క్షణంలోనే మృత్యులోకంలోకి దిగిపోతారు.
[14] అయినా వాళ్ళు దేవునితో ‘మా దగ్గరనుంచి వెళ్ళిపో! నీ విధానాల గురించి తెలుసుకోవడానికి మాకు ఆశ లేదు’ అంటారు.
[15] ‘మనం సేవ చేయడానికి అమిత శక్తిమంతుడు ఏపాటివాడు? ఆయనను వేడుకుంటే మాకేమి లాభం చేకూరుతుంది?’ అంటారు.
[16] కాని, వాళ్ళ అభివృధ్ధి వాళ్ళ చేతిలో లేదు. దుర్మార్గుల ఆలోచనలే నాకు దూరమవుతాయి గాక!
[17] దుర్మార్గుల దీపం ఆరిపోవడం తరచుగా జరుగుతుందా? వాళ్ళకు విపత్తులు రావడం, కోపకారణంగా దేవుడు వేదనలు కలిగించడం తరచుగా జరుగుతుందా?
[18] గాలికి వాళ్ళు గడ్డి పరకలు కావడం, తుఫానులకు చెత్తలాగా వాళ్ళు కొట్టుకుపోవడం అరుదు గదా? ఆగ్రహంతో దేవుడు వాళ్ళను వేదనపాలు చేయడమూ అరుదు.
[19] మనిషికి రావలసిన దోష శిక్షను దేవుడు అతడి పిల్లల మీద రప్పిస్తాడు అంటారు. కాని, చేసినవారు అది అనుభవించేలా దేవుడు ఆ మనిషికే ప్రతిఫలమివ్వాలి.
[20] అతడి నాశనాన్ని అతడే స్వయంగా చూడాలి. అమిత శక్తిమంతుని ప్రచండ కోపాన్ని అతడే పానం చేయాలి.
[21] తన జీవితంలో మాసాల సంఖ్య ముగిసిన తరువాత తన ఇంటి విషయం అతడికి ఏం శ్రద్ధ ఉంటుంది?
[22] ఎవడైనా దేవునికి జ్ఞానోపదేశం చేయగలడా? ఆయన మహనీయులకు తీర్పరి గదా?
[23] ఒక వ్యక్తి బాగా బలిష్ఠుడై ఉండి క్షేమంగా ఉంటూ, చీకూ, చింతా లేకుండా బ్రతుకుతూ చనిపోతాడు.
[24] అతడి కుండనిండా పాలు ఉంటాయి. అతడి ఎముకల్లో సత్తువ బాగా ఉంటుంది.
[25] ఇంకో మనిషి మంచిది ఏదీ ఎప్పుడూ అనుభవించకుండా మనోవేదనతో చస్తాడు.
[26] ఇద్దరూ ఒకే పంక్తిలో మట్టిలో పడుకొంటారు. ఇద్దరినీ పురుగులు ఆవరిస్తాయి.
[27] మీ తలంపులు నాకు తెలుసు, నాకు వ్యతిరేకంగా మీరు పన్నే దురాలోచనలూ తెలుసు.
[28] ‘ఉన్నత వంశీయుల గృహం ఎక్కడుంది? దుర్మార్గులు నివసించిన గుడారాలు ఎక్కడున్నాయి?’ అని మీరు అడుగుతున్నారు గదూ?
[29] అయితే ప్రయాణాలు చేసేవారిని మీరు అడగకపొయ్యారా? వారు చెప్పే సంగతులు మీకు అర్థం కాలేదా?
[30] ఏమిటంటే, విపత్తు వచ్చిన రోజు దుర్మార్గులు తప్పించుకొంటారు. ఆగ్రహ దినాన వాళ్ళు దాని నుంచి తీసుకుపోబడతారు.
[31] వాళ్ళ ముఖంమీదే వాళ్ళ విధానాన్ని ఎవరు ఖండిస్తారు? వాళ్ళు చేసిన దానికి ఎవరు ప్రతీకారం చేస్తారు?
[32] వాళ్ళను సమాధికి తెస్తారు. సమాధి మీద జాగ్రత్తగా కావలి కాస్తారు కూడా.
[33] పల్లంలోని మంటి గెడ్డలు వాళ్ళకు సుఖంగా ఉంటాయి. మనుషులంతా వాళ్ళ వెంటబడిపోతారు. అసంఖ్యాకులు వాళ్ళకు ముందుగా అలాగే పొయ్యారు.
[34] కాబట్టి, మీరు చెప్పే జవాబులు నమ్మతగ్గవి కావు. నన్ను గాలి మాటలతో ఏ విధంగా ఓదార్చగలరు?