[1] “కొండలమీద తిరుగాడే అడవి మేకలు ఎప్పుడు ఈనుతాయో నీకు తెలుసా? లేళ్ళు పిల్లలను ఈనేదెప్పుడో నీవు గుర్తించగలవా?
[2] అవి ఎన్ని నెలలు మోస్తాయో లెక్కించగలవా? అవి ఈనేదెప్పుడో నీకు తెలుసా?
[3] అవి వంగి ఈనుతాయి. అప్పుడే వాటికి నొప్పులు పోతాయి.
[4] వాటి పిల్లలు బలిసిపోతూ అరణ్యంలో పెరుగుతాయి. తల్లులను విడిచిపోతాయి. మళ్ళీ రావు.
[5] అడవిగాడిదకు స్వేచ్ఛ ఇచ్చినవాడు ఎవడు? అడవి గార్దభం కట్లు విప్పినదెవరు?
[6] నేను అరణ్యాన్ని దానికి ఇల్లుగా చేశాను. ఉప్పునేలలు దాని ఉనికిపట్టుగా చేశాను.
[7] దానికి పట్టణంలోని సందడి లెక్కేలేదు. తోలేవాడు పెట్టే కేకలు దానికి వినిపించవు.
[8] కొండలలో తిరుగాడుతూ పచ్చిక మేస్తుంది. అది పచ్చగడ్డి ఎక్కడ ఉందా అని వెదుకుతూ ఉంటుంది.
[9] గురుపోతు దానంతట అదే నీకు లోబడుతుందా? రాత్రులు అది నీ కొట్టంలో నిలుస్తుందా?
[10] గురుపోతును పగ్గంతో బంధించి, నాగటి చాలులో నడిపించగలవా? నీవు దాన్ని తోలి, దానితో లోయలను చదును చేయగలవా?
[11] దాని బలం గొప్పదని దాన్ని నీవు నమ్మగలవా? నీ పని దానికి అప్పగిస్తావా?
[12] నీ ధాన్యం ఇంటికి తెస్తుందనీ, ధాన్యాన్ని కళ్ళంలో సమకూరుస్తుందనీ దాని మీద నమ్మకం ఉంచుతావా?
[13] నిప్పుకోడి సంతోషంతో రెక్కలు ఆడిస్తుంది. దానికి మంచి రెక్కలు, ఈకలు ఉన్నాయి. అయినా దానిది మృదు స్వభావమా?
[14] కాదు. అది నేల మీద గుడ్లు పెట్టి వాటిని వదిలివేస్తుంది. ఇసుక వాటికి వేడి కలిగిస్తుంది.
[15] దేని పాదమైనా వాటిని తొక్కవచ్చు. అడవిమృగం ఏదైనా వాటిని చితకదొక్కవచ్చు. ఈ సంగతి అది ఇట్టే మరిచిపోతుంది.
[16] తన పిల్లలు తనవి కానట్టే వాటి పట్ల ఎంతో కాఠిన్యం వహిస్తుంది. దాని కష్టమంతా వృధా అయిపోయినా, దానికి ఫరవాలేదు.
[17] దేవుడు దానిని తెలివితేటలు లేనిదిగా చేశాడు. దానికి దేవుడు బుద్ధి ఇవ్వలేదు.
[18] అయినా అది లేచీ లేవగానే, గుర్రాన్నీ, రౌతునూ ధిక్కరిస్తుంది.
[19] గుర్రానికి బలం ఇచ్చినది నీవేనా? దాని మెడను జూలుతో కప్పినది నీవేనా?
[20] మిడతలాగా అది గంతులు వేస్తుంది. దాన్నలా చేసినది నీవా? దాని ముక్కుపుటాలలో నుంచి వెలువడే సకిలింత భయంకరం!
[21] అది లోయలో కాలు దువ్వుతూ, తన బలాన్ని బట్టి సంతోషిస్తూ, ఆయుధాలను కూడా ఎదుర్కొనేందుకు పోతుంది.
[22] భయం అంటే దానికి ఎగతాళి. దానికి నదురు బెదురూ లేదు. ఖడ్గాన్ని చూచినా అది వెనక్కు తిరగదు.
[23] అంబులపొది, తళుక్కుమంటూ ఈటెలూ బల్లేలూ దానిప్రక్కన గల గల ధ్వని చేస్తూ ఉంటే,
[24] తీవ్ర ఉద్రేకంతో రెచ్చిపోయి, నేలపై వేగంగా పరుగులెత్తుతుంది. బాకా నాదానికి అదేమీ నిశ్చేష్టం కాదు.
[25] బాకా నాదం విన్నప్పుడెల్లా ‘ఆహా, ఆహా’ అంటుంది. దూరంనుంచే యుద్ధం వాసన పసిగట్టగలదు. సేనా నాయకుల కేకలు, యుద్ధ ఘోష వింటుంది.
[26] డేగ రెక్కలు చాచి, దక్షిణంవైపు పైకి ఎగురుతుందంటే అది నీ జ్ఞానంవల్లనా?
[27] గరుడపక్షి నీవు ఆజ్ఞాపిస్తేనే పైకి ఎగిరిపోయి ఎత్తయిన చోట గూడు కట్టుకొంటుందా?
[28] అది కొండ చరియలలో నివాసముంటుంది. కొండపేటున, ఎవరూ దగ్గరికి చేరలేని చోట గూడు కట్టుకొంటుంది.
[29] అక్కడనుంచి తన ఎరకోసం వెదుకుతుంది. దాని కన్నులు దూరంనుంచే దాన్ని చూస్తాయి.
[30] దాని పసిపిల్లలు రక్తం పీలుస్తాయి. హతమైనవారు ఉన్న చోటే అది కూడా ఉంటుంది.