[1] అప్పుడు నయమాతువాడైన జోఫరు ఈ విధంగా మాట్లాడాడు:
[2] “ఈ విస్తారమైన మాటలకు జవాబు చెప్పకపోతే ఎలా? వదరుబోతును నిర్దోషి అని ఎంచడం జరుగుతుందా?
[3] నీవు నీ వృథా ప్రలాపాలతో మనుషుల నోళ్ళు మూయగలవా? నీవు ఇలా ఎగతాళి చేస్తే నిన్ను ఎవరూ మందలించకూడదా?
[4] నీవు దేవునితో అంటున్నావు గదా, ‘నా సిద్ధాంతంలో ఏ తప్పూ లేదు. నీ దృష్టిలో నేను పవిత్రుణ్ణి’ అని.
[5] దేవుడే నీతో మాట్లాడితే ఎంత బావుండేది!
[6] ఆయనే జ్ఞాన రహస్యాలు నీకు తెలియజేయవలసిందే! అప్పుడు జ్ఞానం నీ ఆలోచనకంటే ఎంతో ఎక్కువనీ, నీ దోషాలలో కొన్నిటిని దేవుడు తలచుకోవడం లేదనీ గ్రహించి ఉండేవాడివి.
[7] దేవుని రహస్య సత్యాలను పరిశీలించి తెలుసుకోగలవా? అమిత శక్తిగలవాని పరిపూర్ణతను పరిశోధించి అర్థం చేసుకోగలవా?
[8] అది ఆకాశాలంత ఎత్తయినది. ఏం చేయగలవు? మృత్యులోకం కంటే లోతు. నీవేం తెలుసుకోగలవు?
[9] దాని కొలత భూమి పొడవుకంటే ఎక్కువ, సముద్రం కంటే విశాలం.
[10] ఆయన పక్కగా వెళ్ళిపోతూ ఎవరినైనా బంధిస్తాడనుకో, ఆయన తీర్పు విచారణ జరిగిస్తాడనుకో – ఆయనకు ఎదురు చెప్పగలవాడెవడు?
[11] పనికిమాలిన వాళ్ళెవరో ఆయనకు తెలుసు. చెడుగును తేరి చూడకుండానే ఆయన పసిగట్టగలడు.
[12] ఒకవేళ అడవి గాడిద పిల్ల మనిషిగా పుట్టగలిగితే తెలివి తక్కువవాడికి తెలివి రావచ్చు!
[13] నీ హృదయాన్ని నువ్వు సరిచేసుకో! దేవుని వైపు నీ చేతులు చాపు.
[14] నీ చేతిలో చెడుగు ఉంటే, దాన్ని దూరంగా పారెయ్యి! నీ నివాసంలో అన్యాయాన్ని ఉండనియ్యకు!
[15] ఈ విధంగా చేస్తే, తప్పకుండా నిష్కళంకుడివై నిర్భయంగా స్థిరంగా ఉండగలుగుతావు.
[16] తప్పకుండా నీ దుర్దశ నీవు మరిచిపోగలుగుతావు. దాటిపోయిన పారు నీళ్ళను జ్ఞాపకం చేసుకొన్నట్లు మాత్రమే నీవు దాన్ని జ్ఞాపకం చేసుకుంటావు.
[17] అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నం ఎండకంటే ప్రకాశమానమవుతుంది. చీకటి కమ్మినా అది ఉదయంలాగే కనిపిస్తుంది.
[18] నీకప్పుడు ఆశాభావం కలిగి, ధైర్యం పుంజుకుంటావు. నీ ఇంట్లో కలయ చూచి సురక్షితంగా విశ్రమిస్తావు.
[19] నీవు పడుకునేటప్పుడు ఎవరి భయం నీకుండదు. అనేకులు నీ చెక్కిళ్ళ నిమురుతారు.
[20] దుర్మార్గుల కనుచూపు మందగిస్తుంది. ఆశ్రయమంటూ వాళ్ళకు లేకపోతుంది. వాళ్ళ ఆశాభావం పోతున్న ప్రాణంలాంటిది.