Skip to content
Opens in a new window

[1] “భూమి మీద మనిషి జీవితం యుద్ధంలాంటిది గదా? మనిషి బతికినన్నాళ్ళూ కూలికి వచ్చినవాడిలా ఉన్నాడు గదా?

[2] దాస్యంలో ఉన్నవాడు నిలవడానికి నీడకోసం తహతహలాడుతాడు. కూలి మనిషి జీతంకోసం పడిగాపులు పడుతాడు.

[3] అదేవిధంగా నేనూ నెలలు తరబడి ఆశాభంగం చెందవలసి వచ్చింది. రాత్రులకు రాత్రులే నేను ఆయాసంతో పడివుండాలని నియామకమైంది.

[4] నేను పడుకున్నప్పుడెల్లా ‘నేనెప్పుడు లేస్తాను? రాత్రి ఎప్పుడు గడిచిపోతుంది?’ అనుకుంటాను. ఉదయందాకా ఆయాసంతో అటూ ఇటూ పొర్లాడుతూ ఉంటాను.

[5] నా శరీరం నిండా పురుగులే! నా ఒళ్ళంతా మంటిపెల్లలే! నా చర్మం బాగైనట్టే అయి, మళ్ళీ చీము పోస్తుంది.

[6] నేతగాడి నాడెలాగా నా రోజులు త్వరితంగా గడిచిపోతున్నాయి. ఆశాభావం లేకుండా అంతరించి పోతున్నాయి.

[7] దేవా! నా జీవం ఊపిరిలాంటిదే అని తలచుకో! నా కంటికి క్షేమం ఇంకెన్నడూ కనిపించదు.

[8] నన్ను చూచినవారి కండ్లకు నేను ఇకమీదట కనబడను. నీ కండ్లు నా వైపు చూచినా నేను ఉండను.

[9] మేఘాలు అంతరిస్తాయి, అంతర్థానమవుతాయి. అలాగే మృత్యులోకానికి దిగిపోయినవాడు పైకి రాబోడు.

[10] అతడు తన స్వగృహానికేమీ తిరిగి రాడు. అతడి స్వస్థలానికే అతడు అపరిచితుడవుతాడు.

[11] అంచేత నేనేమీ నోరు మూసుకోను. నా ఆత్మలో వేదన ఉంది. నేను మాట్లాడి తీరుతాను. నా మనసు దుఃఖమయమయింది. నేను విలపిస్తాను.

[12] నేనేమైనా సముద్రాన్నా? సముద్రంలోని ఏదో బ్రహ్మాండమైన జీవినా? నీవెందుకు నన్నిలా కాపలా కాస్తున్నావు?

[13] నా పడక నాకు ఆధారం చేకూరుస్తుందని, నా పరుపు నా బాధను కొంత నివారణ చేస్తుందని నేననుకొంటే,

[14] నా కలలే నన్ను భయపడేలా చేస్తున్నాయి. నీవు స్వప్నాలద్వారా నాకు బీతి కలిగిస్తావు.

[15] నా ప్రాణానికి ఊపిరాడక చస్తే బావుండేది అనిపిస్తుంది. ఈ నా అస్తిపంజరాన్ని చూచుకునేకంటే చావునయం.

[16] బ్రతుకు అంటేనే నాకు అసహ్యం వేస్తుంది. ఎల్లకాలం బ్రతకడం నాకిష్టం లేదు. నా జోలికి రావద్దు. నా రోజులు ఆవిరిలాగా ఉన్నాయి.

[17] “మనిషి ఎంతటివాడు? నీవు అతణ్ణి ఎందుకింత గొప్పగా ఎంచుకోవడం? నీ మనసు అతడి మీద ఉంచడం ఎందుకు?

[18] ప్రతి ఉదయమూ నీవు అతణ్ణి సందర్శిస్తావెందుకు? క్షణక్షణమూ అతణ్ణి పరీక్షకు గురి చేస్తావెందుకు?

[19] ఎంతకాలమని ఇలా ఎడతెగకుండా నావైపే చూస్తూవుంటావు? నా ఉమ్మి నేను మింగేదాకా కూడా నన్ను విడిచిపెట్టవా?

[20] మనుషులను కనిపెట్టి చూచేవాడా! ఒకవేళ నేను అపరాధం చేసినా అది నీకేమి చేయగలదు? నీ దృష్టికి నన్నెందుకిలా గురి చేస్తున్నావు? నాకు నేనే భారంగా ఉన్నాను.

[21] నా అతిక్రమాలు నీవెందుకు క్షమించవు? నా పాపాలు నీవెందుకు తుడిచివెయ్యవు? నేనిప్పుడు మట్టి పాలవుతాను. నీవు నాకోసం వెదికినా, నేను ఉండను.”

యోబు — Chapters