Skip to content
Opens in a new window

[1] ఎలీహు ఇంకా అన్నాడు,

[2] “జ్ఞానులారా! నా మాటలు ఆలకించండి! అనుభవజ్ఞులారా! నేను చెప్పేది వినిపించుకోండి!

[3] నోరు ఆహారాన్ని రుచి చూస్తుంది. చెవి మాటలను పరిశీలిస్తుంది.

[4] న్యాయమైనదేదో విచారిద్దాం పట్టండి. మేలైనది ఏదో తెలుసుకుందాం రండి.

[5] యోబు ఇలా అంటున్నాడు గదా: ‘నేను నిర్దోషిని. నాకు న్యాయం జరగకుండా దేవుడు చేశాడు.

[6] అన్యాయంగా నన్ను అబద్ధికుడుగా ఎంచడం జరుగుతూ ఉంది. నేనేమీ ఎదురు తిరగలేదు. అయినా నాకు మానని గాయం కలిగింది.’

[7] యోబుకు ఎవరు సాటి? మంచి నీళ్ళు త్రాగినట్టే తిరస్కార వాక్కులు మ్రింగేసేవాడు.

[8] దుష్టత్వం చేసేవాళ్ళకు అతడు సావాసగాడు. దుర్మార్గులతో అతడు తిరుగుతున్నాడు.

[9] యోబు చెపుతున్నదేమిటంటే, ‘మనిషి దేవునితో సహవాసం చేస్తే అతడికేమీ ప్రయోజనం లేదు’.

[10] వివేకులారా! నేను చెప్పేది వినండి. దేవుడు దుర్మార్గం చెయ్యడం ఎన్నటికీ జరగదు. అమిత శక్తిమంతుడు అన్యాయం చెయ్యడమనేది ఎన్నడూ ఉండదు.

[11] మనిషి క్రియలకు తగిన ప్రతిఫలం ఆయన ముట్ట చెపుతాడు. ప్రతి ఒక్కరి నడతను బట్టి అతడికి ఫలితం కలిగేలా చేస్తాడాయన.

[12] దేవుడు ఎన్నటికీ దుర్మార్గం చెయ్యడు. అమిత శక్తిమంతుడు న్యాయాన్ని తారుమారు చెయ్యడు. ఇది ఖాయం.

[13] ఈ భూమి మీద అధికారం ఆయనకు ఎవరు ఇచ్చారు? ఈ లోకమంతటినీ ఆయనకు ఎవరు అధీనం చేశారు?

[14] ఒకవేళ ఆయన హృదయం తన మీదే లగ్నం అయితే ఆయన తన ఆత్మను తన ఊపిరిని తీసివేసే పక్షంలో,

[15] మనుషులంతా ఒక్క పెట్టున నాశనమవుతారు. మనిషి తిరిగి దుమ్ములో కలిసిపోతాడు.

[16] మీకే గనుక తెలివి ఉంటే, ఇది వినండి. నా మాటలు ఆలకించండి.

[17] న్యాయమంటే గిట్టనివాడు పరిపాలిస్తున్నాడా? న్యాయవంతుడు, శక్తిమంతుడు అయిన దేవుని మీద నేరం మోపుతారా?

[18] ఆయన రాజును చూచి ‘నీవు పనికిమాలిన వాడివి’ అంటాడు. ప్రధానులతో ‘మీరు దుర్మార్గులు’ అంటాడు.

[19] ఆయనకు అధికారులంటే పక్షపాతం లేదు. బీదలకంటే ధనవంతులను ఎక్కువ అప్యాయంగా చూడడు. వీరంతా ఆయన సృజించిన వారే! అలాంటివానితో ఈ విధంగా పలకవచ్చా?

[20] వారు నిమిషంలో చనిపోతారు. మధ్య రాత్రి ప్రజల్లో అలజడి బయలుదేరుతుంది. వారు గతించిపోతారు. బలిష్ఠులమీద ఎవరి చేయీ పడకపోయినా వారిని తొలగించడం జరుగుతుంది.

[21] మానవుడి నడతల మీద దేవుని దృష్టి ఉంది. మనిషి అడుగులన్నిటినీ ఆయన చూస్తూనే ఉన్నాడు.

[22] చెడుగు చేసేవాళ్ళు దాక్కునేందుకు చీకటి స్థలం ఉండదు, చావునీడ ఉండదు.

[23] మనిషి దేవుని విచారణలోకి రాకుండా, అతడి విషయం దేవుడు పసికట్టడానికి ఎంతో కాలం పట్టదు.

[24] విచారణ దినాన్ని నియమించకుండానే బలిష్ఠులను ఆయన తునాతునకలు చేస్తాడు. వారి స్థానంలో ఇతరులను ఉంచుతాడు.

[25] వారి పనులు ఎలాంటివో ఆయనకు తెలుసు. రాత్రిపూట ఆయన వాళ్ళను తల్లక్రిందులు చేస్తాడు. వాళ్ళను ముక్కలు చేస్తాడు.

[26] నలుగురు చూస్తూవుంటే, వాళ్ళ దుర్మార్గాన్ని బట్టి ఆయన వాళ్ళను దండిస్తాడు.

[27] ఎందుకంటే ఆయన దగ్గర నుంచి వాళ్ళు వైదొలగిపోయారు, ఆయన విధానాలను వాళ్ళు లక్ష్యం చేయలేదు.

[28] బీదలు మొరపెట్టడానికి కారకులయ్యారు. ఆ మొర దేవుని దగ్గరికి చేరింది. దీన దశలో ఉన్నవారి మొర ఆయన విన్నాడు.

[29] ఆయన విశ్రాంతి ప్రసాదిస్తాడు. ఆయన మీద నేరం మోపగలవాడెవడు? కాని, ఆయన ముఖాన్ని చాటు చేసుకొంటే ఆయనను చూడగల వాడెవడు? జాతిపరంగా గానీ, వ్యక్తిపరంగా గానీ ఆయన విధానం ఒకటే –

[30] భక్తి లేనివాళ్ళు పరిపాలించకుండా, ప్రజలు వాళ్ళ వలలో చిక్కుకోకుండా ఆయన కాపాడుతాడు.

[31] ఎవడైనా దేవునితో ఇలా అంటాడనుకోండి: ‘నేను ఇక మీదట దౌర్జన్యం చెయ్యను. శిక్ష అనుభవించాను.

[32] నేను చూడలేనిదేదో నాకు నేర్పు. నేనేదైనా అన్యాయం చేసివుంటే, అలాంటిది ఇప్పటినుంచి చెయ్యను.’

[33] కాని, మీరు అలా చేయడం తిరస్కరించినా, మీ ఇష్టాయిష్టాలు అనుసరించి దేవుడు ప్రతిఫలమివ్వాలా? నేను కాదు, మీరే నిశ్చయించుకోవాలి. మీకు తెలిసినదేదో చెప్పండి.

[34] నేను చెప్పేది వినే జ్ఞానులు, వివేకులంతా నాతో ఇలా అంటారు:

[35] ‘యోబు జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు. అతని మాటల్లో అవగాహనం అంటూ లేదు.’

[36] యోబు దుర్మార్గుల్లాగా జవాబులు చెప్పాడు. అందుచేత ఇతడు ఆసాంతం విషమ పరీక్షకు గురి కావలసిందే అని నా ఆశ!

[37] ఇతడు అపరాధం చేయడం మాత్రమే గాక తిరుగుబాటు చేస్తున్నాడు. మన మధ్య ఈయన తిరస్కారంగా చప్పట్లు కొట్టి దేవునికి విరుద్ధంగా బోలెడన్ని మాటలు వదురుతూ ఉన్నాడు.

యోబు — Chapters