Skip to content
Opens in a new window

[1] అప్పుడు షూహియావాడైన బిల్దదు ఇలా అన్నాడు:

[2] “ఎంతసేపు నీవిలా మాట్లాడుతావు? నీ నోటి మాటలు బలంగా వీచే గాలిలా ఉన్నాయి.

[3] దేవుడు న్యాయాన్ని తారుమారు చేస్తాడా? అమిత శక్తిగల వాడు ధర్మాన్ని పెడదోవ పట్టిస్తాడా?

[4] నీ కొడుకులు దేవునికి విరోధంగా దోషం చేసి ఉండవచ్చు. దేవుడు వాళ్ళ తిరుగుబాటుకు తగ్గ శిక్షకు వాళ్ళను అప్పగించాడేమో!

[5] నీవు దేవుని వైపు చూస్తే, దయ చూపమని అమిత శక్తిగల వాణ్ణి ప్రాధేయపడితే,

[6] నువ్వు శుద్ధుడివై నిజాయితీ పరుడివైతే ఆయన తప్పకుండా నీ విషయం శ్రద్ధ తీసుకుంటాడు. నీ నిర్దోషత్వానికి తగినట్టుగా ఆయన నిన్ను పూర్వమున్న క్షేమస్థితికి తెస్తాడు.

[7] నీ స్థితి ఆరంభంలో కొంచెమైనా అది చివరికి గొప్పదే అవుతుంది.

[8] గత తరాల సంగతులు విచారించు. వాళ్ళ పూర్వీకులు పరిశోధించి నేర్చుకొన్న వాటిని తరచిచూడు.

[9] మనం నిన్నటి మనుషులం, మనకు ఏమీ తెలియదు. ఈ భూమిమీద మన రోజులు నీడలాంటివి.

[10] వాళ్ళు నీకు ఉపదేశం చేయరా? నీతో మాట్లాడరా? వాళ్ళ మాటలు హృదయంలోనుంచి వచ్చినవి కావా?

[11] బురద లేకుండా జమ్ము గడ్డి పెరుగుతుందా? నీళ్ళు లేకుండా రెల్లు మొలుస్తుందా?

[12] అది ఇంకా పెరుగుతూ ఉండగానే, దానిని కోసేముందే, అన్ని మొక్కలకంటే ఇది త్వరగా ఎండిపోతుంది.

[13] దేవుణ్ణి విస్మరించే వాళ్ళందరి గతి ఇంతే. భక్తి లేనివాడి ఆశ అడుగంటిపోతుంది.

[14] అతడికి ఆశాభంగం కలుగుతుంది. అతడు దేనిమీద నమ్మకం ఉంచాడో అది సాలెగూడులాంటిది.

[15] సాలెపురుగు తన ఇంటిమీద ఆధారపడుతుంది గాని, దానిని గట్టిగా పట్టుకొన్నా అది నిలవదు.

[16] భక్తిలేనివాడు ఎండకు పచ్చగా ఉన్న మొక్కలాంటివాడు. దాని తీగెలు తోటమీదుగా అల్లుకుంటాయి.

[17] దాని వేరులు గుట్టచుట్టూ ఆవరిస్తాయి. అది రాళ్ళ మధ్య ఉనికి పట్టుకోసం చూస్తుంది.

[18] దేవుడు దాని స్థలంనుంచి దాన్ని తొలగిస్తే ఆ స్థలమే దానితో ‘నిన్నెరగను పో! నిన్ను ఎన్నడూ చూడలేదు!’ అంటుంది.

[19] దాని ఆనందమయమైన స్థితికి అదే అంతం. అది ఉన్న మట్టిలో నుంచి వేరే మొక్కలు పుట్టుకు వస్తాయి.

[20] ఇదిగో విను. దేవుడు నిర్దోషిని విసర్జించడు. దుర్మార్గులను చేయి పట్టుకొని పైకి ఎత్తడు.

[21] నువ్వు నోటినిండా నవ్వేలా చేస్తాడాయన. నీ పెదవులనిండా ఆనంద ధ్వనులు ఉండేలా చేస్తాడు.

[22] నీ పగవాళ్ళను అవమానం ఆవరిస్తుంది. దుర్మార్గుల డేరా ఇక నిలవదు.

యోబు — Chapters