Skip to content
Opens in a new window

[1] యోబు ఇంకా కావ్యరూపంలో ఇలా చెప్పుకు పోయాడు:

[2] “నా హక్కులను తొలగించివేసిన దేవుని జీవం మీద నేను ప్రమాణం చేసి చెపుతున్నాను, నన్ను దుఃఖానికి గురిచేసిన అమిత శక్తివంతుని మీద ప్రమాణం చేసి చెపుతున్నాను–

[3] నాకు ప్రాణం ఉన్నంతవరకూ, దేవుడిచ్చే ఊపిరి నా ముక్కుపుటాలలో ఉన్నంతవరకూ

[4] నా పెదవులు అబద్ధం చెప్పవు, నా నాలుక మోసం పలకదు.

[5] మీరు చెపుతున్నది న్యాయసమ్మతమని నేను అసలు ఒప్పుకోను, చచ్చేదాకా నా నిజాయితీని కాదనను,

[6] నా నిర్దోషత్వాన్ని బలంగా అంటిపెట్టుకుంటాను. దానిని ఎన్నడూ వదిలిపెట్టను. నేను బ్రతికినన్నాళ్ళూ నా అంతర్వాణి నన్ను తూలనాడదు.

[7] నా పగవాళ్ళు దుర్మార్గులుగా కనబడుతారు గాక! నా మీదికి ఎగబడేవాళ్ళు అన్యాయస్థులుగా కనిపిస్తారు గాక!

[8] దైవభక్తి లోపించినవాడికి అతడు అంతరించి పోతూవుంటే, దేవుడు అతడి ప్రాణం తీసివేస్తూవుంటే, ఆశాభావం ఇంకెక్కడిది?

[9] అతడిమీదికి విపత్తు వస్తే దేవుడు అతడి మొర ఆలకిస్తాడా?

[10] అతడికి అమిత శక్తిమంతుని మూలంగా ఆనందం కలుగుతుందా? అన్ని వేళలా అతడు దేవునికి ప్రార్థన చేస్తాడా?

[11] దేవుని హస్తాన్ని గురించి నేను మీకు ఉపదేశం చేస్తాను. అమిత శక్తిమంతుని విధానాన్ని నేను చెప్పకుండా దాచిపెట్టను.

[12] మీరంతా అది చూశారు. వెర్రి ఊహలు ఎందుకు పెట్టుకొంటారు?

[13] దుర్మార్గులకు దేవుడు నియమించిన భాగం ఏమిటంటే, దౌర్జన్యపరులు అమిత శక్తిమంతుని దగ్గరనుంచి పుచ్చుకోవలసినది ఇది –

[14] వాళ్ళ సంతానం సంఖ్యలో అధికం అవుతూ ఉన్నారంటే, కత్తివాతకు గురి కావడానికే! వాళ్ళ సంతానానికి చాలేటంత భోజనం దొరకదు.

[15] వాళ్ళ తరువాత బ్రతికి ఉన్నవాళ్ళు ఘోరవ్యాధివల్ల సమాధిపాలవుతారు. వాళ్ళు వితంతువులు కూడా ఏడవరు.

[16] వాళ్ళు వెండిని దుమ్ము పోగు చేసినట్టు సమకూర్చుకొన్నా, బంకమట్టి కుప్పలాగా బట్టలను పోగు చేసుకున్నా,

[17] పోగు చేసినది వీళ్ళన్న మాటే గాని, వాటిని కట్టుకొనేది న్యాయవంతులు మాత్రమే! నిర్దోషులు ఆ వెండిని తమలో తామే పంచుకొంటారు.

[18] కీటకం కట్టుకొన్నట్టు వాళ్ళు ఇల్లు కట్టుకొంటారు. కావలివాడి గుడిసెలాగా వాళ్ళు గృహం నిర్మించుకొంటారు.

[19] వాళ్ళు ధనికులై, ఒక సారి పడుకొంటారు. మళ్ళీ వాళ్ళు లేవరు. కళ్ళు తెరిచేలోపుగానే వాళ్ళు అంతరించిపోతారు.

[20] భయం వరదల్లాగా కమ్ముకొంటుంది. రాత్రి పూట తుఫానులో వాళ్ళు కొట్టుకుపోతారు.

[21] తూర్పు గాలులు వాళ్ళను తీసుకుపోతాయి. వాళ్ళు లేకుండా పోతారు. అవి వాళ్ళు ఉన్న చోటనుంచి వాళ్ళను తుడిచి పెట్టివేస్తుంది.

[22] నిర్దాక్షిణ్యంగా దేవుడు వాళ్ళ మీద బాణాలు వేస్తాడు. ఆయన చేతినుంచి తప్పించుకు పారిపోవడానికి తీవ్ర ప్రయత్నం చేస్తారు.

[23] మనుషులు వాళ్ళను చూచి ఎగతాళిగా చప్పట్లు కొడతారు. వాళ్ళు తమ స్థానంనుంచి ‘ఛీ’కొట్టి వాళ్ళను వెళ్ళగొట్టివేస్తారు.

యోబు — Chapters