Skip to content
Opens in a new window

[1] అప్పుడు యెహోవా యోబుతో ఇలా అన్నాడు:

[2] “అమిత శక్తిమంతునితో వాదించేవాడు ఆయనకు బుద్ధి చెప్పవచ్చా? దేవునితో తర్కించేవాడు ఆయనకిప్పుడు జవాబివ్వాలి.”

[3] అప్పుడు యోబు ఈ విధంగా జవాబిచ్చాడు:

[4] “ఇదిగో, నేను అల్పుణ్ణి, నేను నీకేమి జవాబు చెప్పగలను? నా నోటిమీద చెయ్యి ఉంచుకొంటాను.

[5] ఒక సారి మాట్లాడాను. మళ్ళీ నోరెత్తను. రెండు సార్లు మాట్లాడాను గాని ఇంకేమీ చెప్పను.

[6] అప్పుడు యెహోవా గాలివానలో నుంచి యోబుతో మాట్లాడాడు,

[7] “ధైర్యం తెచ్చుకొని లేచి నడుము కట్టుకో! నేను నిన్ను అడుగుతాను, నీవు జవాబు చెప్పు.

[8] నేను న్యాయవంతుణ్ణి కాదంటావా? నీవు నిర్దోషివి అనిపించుకోవడానికి నా మీద నేరం మోపుతావా?

[9] దేవుని భుజ బలంలాంటిది నీకు ఉందా? ఆయనలాగా నీవు ఉరుము కంఠంతో గర్జించగలవా?

[10] అలాగైతే వైభవంతో, ఘనతతో నిన్ను నీవు అలంకరించుకో! మహాత్మ్యం, మహిమ ధరించుకో!

[11] నీ కోప ప్రవాహాన్ని కుమ్మరించు! గర్విష్ఠులందరినీ చూచి, వారికి గర్వభంగం చేయి!

[12] గర్వించినవారందరినీ చూచి అణగద్రొక్కు! దుర్మార్గులు నిలిచిన చోట వారిని క్రిందికి త్రొక్కివేయి!

[13] వారందరినీ దుమ్ములో పూడ్చిపెట్టు! భూమిలో వారిని బంధించు!

[14] అలా చేస్తే నీ కుడి చెయ్యి నిన్ను రక్షించగలదని అప్పుడు నీ విషయం నేను ఒప్పుకొంటాను!

[15] బహేమోత్‌ను గురించి ఆలోచించు. దానిని– నిన్ను కూడా– కలగజేసినది నేనే. అది ఎద్దులాగా గడ్డి మేస్తుంది.

[16] దాని నడుములో ఎంత బలం ఉంది! దాని కడుపు కండరాలలో ఎంత శక్తి ఉంది!

[17] దేవదారు చెట్టుకొమ్మ వంగినట్టు అది తన తోకను వంచుతుంది. దాని తొడల్లోని నరాలు గట్టిగా కలపబడివున్నాయి.

[18] దాని ఎముకలు కంచు గొట్టాలవంటివి. దాని అవయవాలు ఇనుప కడ్డీలలాగా ఉన్నాయి.

[19] దేవుని సృష్టి విధానం దృష్ట్యా అది అగ్రగణ్యం. దాని సృష్టికర్త దాన్ని ఖడ్గంతో సమీపించ గలడు.

[20] కొండలు దానికి మేత సరఫరా చేయిస్తాయి. అడవి మృగాలన్నీ దాని దగ్గర ఆడుకొంటాయి.

[21] కలువ మొక్కల క్రింద అది పడుకొంటుంది. దానికి దాగే స్థలం జమ్ముగడ్డిలో, చిత్తడి ప్రదేశాలలో ఉంది.

[22] కలువ చెట్ల నీడ దానికి కప్పుగా ఉంటుంది. కాలువలో నిరవంజి చెట్లు దాన్ని ఆవరించి ఉంటాయి.

[23] ఏరు పొంగిపొర్లితే, దానికేమీ భయం అనిపించదు. యొర్దాను నది పొంగి, దాని నోటి దాకా వచ్చినా, దాని ధైర్యం చెడిపోదు.

[24] అది చూస్తూవుంటే, దాన్నెవరైనా పట్టుకోగలరా? ఎవరైనా దాని ముక్కుకు గాలం వేయగలరా?

యోబు — Chapters