[1] “యోబు! దయ ఉంచి నా మాటలు వినండి. నేను చెప్పే విషయాలన్నీ ఆలకించండి.
[2] ఇటు చూడండి. నేను నోరు తెరుస్తున్నాను. నా నాలుక మాట్లాడడానికి సిద్ధంగా ఉంది.
[3] నా మాటలు నా హృదయంలోని నిజాయితీని వెల్లడి చేస్తాయి. నా పెదవులనుంచి తెలివితేటలు ఉట్టిపడుతున్నాయి.
[4] దేవుని ఆత్మ నన్ను సృజించాడు. అమిత శక్తిమంతుని శ్వాస నాకు జీవమిచ్చింది.
[5] మీరు నాకు జవాబు చెప్పగలిగితే చెప్పండి, నా ముందు సిద్ధపడి వాదించండి.
[6] చూడండి! దేవుని దృష్టిలో నేను మీలాంటి మనిషినే. నేనూ బంకమట్టితో చేయబడ్డవాణ్ణే.
[7] నా భయం మిమ్మలనేమి బెదిరించదు. నా హస్తం మీ మీద బరువుగా పడదు.
[8] నిజంగా మీరు మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను. ఈ మాటలు నా చెవిని పడ్డాయి:
[9] ‘నేను శుద్ధుణ్ణి, నిరపరాధిని, నిష్కళంకుణ్ణి – నాలో అక్రమమేమీ లేదు.
[10] అయినా, దేవుడు నాలో తప్పులు చిక్కించుకోవాలని చూస్తున్నాడు. నన్ను శత్రువు క్రింద లెక్క కట్టాడు.
[11] నా కాళ్ళకు బొండవేసి బిగించాడు. ఆయన నా ప్రవర్తన అంతా బాగా చూస్తున్నాడు.’
[12] ఈ విషయంలో మీదే అన్యాయం! నేను మీకు జవాబు చెప్తాను చూడండి! దేవుడు మనిషికంటే గొప్పవాడు.
[13] ఆయన విషయాలను గురించి ఆయన జవాబేమీ చెప్పకపోయినందుచేత ఆయనతో మీకెందుకు ఈ పోట్లాట?
[14] దేవుడు ఒక సారి మాట్లాడతాడు! రెండు సార్లు మాట్లాడతాడు. అయితే, మనుషులు ఇది గుర్తించకపోవచ్చు.
[15] కలలో, రాత్రివేళ కనిపించే దర్శనంలో మనుషులకు గాఢనిద్ర పట్టినప్పుడు, పడకమీద మనుషులకు మంచి నిద్ర పట్టినప్పుడు,
[16] ఆయన వారి చెవులు తెరుస్తాడు. వారికి ఉపదేశం చేస్తాడు.
[17] అందులో దేవుని ఆశయమేమిటంటే, మనిషి తన విధానాల నుంచి తొలగిపోవాలి. మనిషి గర్వం అతడికి దూరం కావాలి.
[18] అతడి ప్రాణాన్ని నాశనం నుంచి తప్పించాలి. అతణ్ణి కత్తివాతకు గురి కాకుండా కాపాడాలి.
[19] అతడు మంచం పట్టి బాధాకరమైన శిక్ష అనుభవించవచ్చు. అతడి ఎముకలకు తీవ్రమైన నొప్పులు ఎడతెగకుండా ఉంటాయి.
[20] ఆహారం అంటే అతడికి వెగటు. రుచిగల భోజనం అంటే అతడికి సహించదు.
[21] అతడి శరీరం కృశించిపోతుంది. వికారం అవుతుంది. లోపలి ఎముకలు బయటికి పొడుచుకు వస్తాయి.
[22] అతడు సమాధికి సమీపంగా వస్తాడు. అతడి ప్రాణం మృత్యుదూతలకు చిక్కబోతుంది.
[23] ఒకవేళ వేలకొలది దూతలలో ఒకడెవడైనా మనిషికి సరైనదేదో అది తెలియజేయడానికి అతడికి మధ్యవర్తిగా ఉంటే,
[24] ఆయన అతడి మీద దయ చూపి ఈ విధంగా అంటాడు: ‘అతణ్ణి నాశనానికి వెళ్ళనియ్యకండి. అతణ్ణి తప్పించండి. విడుదల కలిగించే వెల నా దగ్గర ఉంది.’
[25] అప్పుడు అతడి శరీరం పిల్లల శరీరంలాగా పూర్తిగా నయం అవుతుంది. చిన్నప్పటి రోజుల్లోలాగా అతడు ఆరోగ్యంగా ఉంటాడు.
[26] అప్పుడతడు దేవుణ్ణి ప్రార్థిస్తాడు. దేవుడు అతణ్ణి దయతో స్వీకరిస్తాడు. అతడు దేవుని ముఖం చూచి ఆనందిస్తాడు. ఈ విధంగా అతడు మళ్ళీ నిర్దోషి అయ్యేలా దేవుడు చేస్తాడు.
[27] అప్పుడతను సంతోషంగా మనుషుల ఎదుట ఇలా సాక్ష్యం చెపుతాడు, ‘నేను తప్పుదారి పట్టాను. న్యాయాన్ని తారుమారు చేశాను. అయినా తగిన శిక్ష నా మీద పడలేదు.
[28] దేవుడు నా ప్రాణాన్ని నాశనానికి పోకుండా విడిపించాడు. నా బ్రతుకులో వెలుగు ప్రసరిస్తున్నది’.
[29] ఇదిగో వినండి. దేవుడు ఇదంతా మనిషి పట్ల రెండు మూడు సార్లు జరిగిస్తాడు.
[30] అతడి ప్రాణాన్ని నాశనం నుంచి తప్పించాలనీ, అతడిమీద జీవజ్యోతి ప్రకాశించాలనీ ఇందులో దేవుని ఆశయం.
[31] యోబు! బాగా వినండి! నేను చెప్పేది ఆలకించండి. మీరు మౌనంగా ఉంటే నేను మాట్లాడతాను.
[32] మీరు ఏదైనా చెప్పాలనుకొంటే నాతో చెప్పండి. మాట్లాడండి. మీరు నిర్దోషుల లెక్కలోకి రావాలని కోరుతున్నాను.
[33] మీరు చెప్పేదేమీ లేదంటారా, వినండి! నిశ్శబ్దంగా ఉండండి. నేను మీకు జ్ఞానోపదేశం చేస్తాను.