[1] అప్పుడు తేమానువాడైన ఎలీఫజు ఈ విధంగా జవాబిచ్చాడు:
[2] “మనిషివల్ల దేవునికి ఏమైన ప్రయోజనం ఉంటుందా! తెలివి గల మనిషికే దానివల్ల ప్రయోజనం ఉంటుంది.
[3] నీవు న్యాయంగా ప్రవర్తించేవాడివైతే, అది అమిత శక్తిమంతుడికి విలువైందా? నీ విధానాలు నిర్దోషం కావడం వల్ల ఆయనకేమైన లాభం కలుగుతుందా?
[4] ఆయన పట్ల భయభక్తులున్నాయని ఆయన నిన్ను ఖండిస్తాడా? నిన్ను తీర్పులోకి తెస్తాడా?
[5] నీ చెడుగు గొప్పది కాదా? నీ అక్రమాలు అపారమైనవి కావా?
[6] ఏమీ ఇవ్వకుండానే నీ సాటి మానవుల దగ్గర నీవు తాకట్టు తీసుకొన్నావు. బట్టలు అసలే లేనివాళ్ళ దగ్గరనుంచి బట్టలు లాక్కున్నావు.
[7] అలసిపోయిన వాళ్ళకు నీళ్ళిచ్చావు కావు. ఆకలిగా ఉన్నవాళ్ళకు ఆహారం పెట్టలేదు.
[8] ‘బలవంతుడిదే భూమి, ఘనత వహించినవాడే అందులో ఉండాలి’ అనుకున్నావు.
[9] వితంతువులను వట్టి చేతులతో పంపివేశావు. తండ్రి లేని పిల్లలను అణగద్రొక్కావు.
[10] అందుచేతే నీ చుట్టూ ఉరులు ఒడ్డివున్నాయి. హఠాత్తుగా భయం నీకు పట్టుకుంది.
[11] అందుచేతే దేన్నీ చూడలేనంత చీకట్లు నిన్ను కమ్ముకొన్నాయి. నిన్ను ముంచివేసే వరదలు నీ మీదుగా పొర్లిపారాయి.
[12] దేవుడు ఆకాశమంత ఎత్తున ఉన్నాడు గదా! నక్షత్రాలు ఎంత ఎత్తున ఉన్నాయో చూడు. అవి ఎంతో పైన ఉన్నాయి!
[13] అయినా, ‘దేవునికేం తెలుసు? కటిక చీకటి గుండా చూచి, తీర్పు చెప్పగలడా?’ అనుకుంటున్నావు నీవు.
[14] ‘దట్టమైన మేఘాలు ఆయన చుట్టూ ఉన్నాయి. ఆయన చూడడు. ఆకాశం అంచుల్లో ఆయన తిరుగుతున్నాడు. ఇది నీ తలంపు!’
[15] దుర్మార్గులు నడిచిన పాత మార్గం నీవు అవలంబిస్తావా?
[16] వాళ్ళు తమ గడువు తీరకముందే నాశనమైపొయ్యారు. వాళ్ళ పునాదులు వరదల్లో కొట్టుకుపొయ్యాయి!
[17] దేవుడు వాళ్ళ నివాసాలు మంచివాటితో నింపినా ‘మా దగ్గర నుంచి వెళ్ళిపో! అమిత శక్తిమంతుడు మమ్మలనేమీ చెయ్యడు లే’ అని వాళ్ళు దేవునితో అంటారు.
[18] దుర్మార్గుల ఆలోచనలే నాకు దూరమైపోతాయి గాక!
[19] న్యాయవంతులు వాళ్ళ కోసం చూచి ఆనందిస్తారు; అమాయకులు వాళ్ళను చూచి ఎగతాళి చేస్తారు.
[20] ‘మన పగవాళ్ళు తప్పనిసరిగా నాశనమైపొయ్యారు. వాళ్ళసిరి సంపదలు నిప్పుతో తగలబడిపొయ్యాయి’ అని చెప్పుకొంటారు.
[21] దేవునితో సహవాసం చేసి చూడు. నీకు శాంతి కలుగుతుంది. ఆ విధంగా నీకు మేలు కలుగుతుంది.
[22] ఆయన నోటినుంచి వెలువడే ఉపదేశం స్వీకరించు. నీ మనసులో ఆయన వాక్కులు ఉంచుకో.
[23] అమిత శక్తిమంతునివైపు నీవు తిరిగితే, నీవు మళ్ళీ అభివృద్ధి పొంది సుస్థిరం అవుతావు. నీ నివాసంలో అన్యాయాన్ని దూరంగా తొలగించాలి.
[24] నీ బంగారాన్ని మట్టిలో పడెయ్యి! ఓఫీర్ కనకాన్ని ఏటిలో ఉన్న రాళ్ళ కింద పారెయ్యి!
[25] అప్పుడు అమిత శక్తిమంతుడు తానే నీకు బంగారం అవుతాడు. నీకు అంతు లేనంత వెండి అవుతాడు.
[26] అప్పుడు అమిత శక్తిమంతుని మూలంగా నీకు ఆనందం కలుగుతుంది. నీవు దేవునివైపు ముఖం ఎత్తగలుగుతావు.
[27] అప్పుడు నీవు ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. నీ మ్రొక్కుబళ్ళను నీవు చెల్లిస్తావు.
[28] నీ నిర్ణయాలు నెరవేరుతాయి. నీ దారిమీద వెలుగు ప్రకాశిస్తుంది.
[29] నిన్ను పడద్రోయడం జరిగితే ‘లేస్తాను!’ అంటావు. వినయం గలవారిని దేవుడు రక్షిస్తాడు.
[30] నిరపరాధి కాని వ్యక్తిని కూడా ఆయన విముక్తుణ్ణి చేస్తాడు. అలాంటి వ్యక్తికి నీ నిర్దోషత్వం కారణంగా విడుదల చేకూరుతుంది.