[1] దేవుడు నోవహునూ, అతని కొడుకులనూ దీవించి వారితో ఇలా అన్నాడు: “ఫలిస్తూ సంఖ్యలో అధికం కండి. భూలోకం నిండా విస్తరించండి.
[2] మీకు అన్ని అడవి మృగాలూ గాలిలో ఎగిరే పక్షులూ భూమిమీద తిరిగే ప్రతిదీ సముద్రం చేపలూ హడలిపోతాయి, భయపడతాయి. వాటన్నిటిని మీ చేతికి అప్పగించాను.
[3] చలించే ప్రతి జీవినీ మీరు తినవచ్చు. పచ్చని కూరమొక్కలను మీకిచ్చినట్టే వాటన్నిటినీ ఇస్తున్నాను.
[4] అయితే మాంసం దాని రక్తంతో మాత్రం తినకూడదు. రక్తమే దాని ప్రాణం.
[5] నేను ఇంకా మీ విషయం విధించేదేమంటే ఎవరైనా మరొకరి ప్రాణం తీస్తే వారు చావవలసిందే. అలాగే ప్రతి జంతువూ కూడా చావవలసిందే. సాటి మానవుణ్ణి చంపిన వాడికి మరణశిక్ష విధించాను.
[6] దేవుడు తన స్వరూపంలో మానవుణ్ణి చేశాడు గనుక మానవుణ్ణి చంపేవాణ్ణి మానవుడే చంపాలి.
[7] మీరైతే ఫలవంతంగా ఉండి సంతానాభివృద్ధి పొందండి. భూలోకం అంతటినీ విస్తరించి అధికం కండి.”
[8] దేవుడు నోవహుతోను, అతని కొడుకులతోను ఇంకా అన్నాడు:
[9] “ఇప్పుడు నేను మీతోను తరువాత కలిగే మీ సంతానంతోను నా ఒడంబడిక చేస్తున్నాను.
[10] మీతో పాటు సజీవమైన ప్రతిదానితోను – పక్షులతో, పశువులతో, మృగాలతో, ఓడ బయటికి వచ్చిన ప్రతిదానితో, భూమిమీద తిరిగే వాటన్నిటితోకూడా నా ఒడంబడిక చేస్తున్నాను.
[11] శరీరం ఉన్న ప్రతిదీ వరదలచేత ఇంకెన్నడూ నిర్మూలం కాదు. సర్వలోకాన్ని నాశనం చేసే జలప్రళయమే ఉండదు. మీతో నేను చేసే ఒడంబడిక ఇదే.”
[12] దేవుడు ఇంకా అన్నాడు: “నాకూ మీకూ మీతోపాటు ఉన్న సమస్త జీవరాసులకూ మధ్య తరతరాలన్నిటికీ నేను చేసే ఒడంబడిక గురుతు ఇదే.
[13] మేఘాల్లో నా రంగులవిల్లు ఉంచాను. అది నాకూ భూలోకానికీ మధ్య ఉన్న ఒడంబడికకు గురుతుగా ఉంటుంది.
[14] నేను భూమికి పైగా మేఘాలను రప్పిస్తాను. నా రంగులవిల్లు మేఘాల్లో కనబడితే నా ఒడంబడికను తలచుకొంటాను.
[15] నాకూ, మీకూ శరీరం ఉన్న జీవరాసులకూ ఉన్న ఆ ఒడంబడికను తలచుకొంటాను. నీళ్ళు వరదలుగా వచ్చి శరీరం ఉన్న ప్రతిదాన్నీ ఇక నాశనం చేయవు.
[16] ఆ విల్లు మేఘంలో ఉంటుంది. నేను దాన్ని చూచినప్పుడు దేవునికీ, భూమిమీద ఉన్న శరీరం గల సర్వజీవరాసులకూ మధ్య ఉన్న నిత్యమైన ఒడంబడిక తలచుకొంటాను.”
[17] దేవుడు నోవహుతో “నాకూ భూమిమీద శరీరం ఉన్న ప్రతిదానికీ నేను చేసే ఒడంబడిక గుర్తు ఇదే” అన్నాడు.
[18] ఓడ బయటికి వచ్చిన నోవహు కొడుకులు ఎవరంటే, షేము, హాము, యాపెతు. హాము కనానుకు తండ్రి.
[19] ఆ ముగ్గురే నోవహు కొడుకులు. వారి సంతతివారు భూలోకమంతటా చెదిరిపొయ్యారు.
[20] నోవహు కర్షకుడయ్యాడు. ఒక ద్రాక్షతోట వేశాడు.
[21] ఒకసారి ద్రాక్షమద్యం త్రాగి మత్తిల్లాడు. తన డేరాలో నగ్నంగా పడుకొన్నాడు.
[22] హాము (కనాను తండ్రి) తన తండ్రి దిగంబరత్వం చూచి వెలుపల ఉన్న తన ఇద్దరు సోదరులకు ఆ సంగతి తెలియజేశాడు.
[23] షేము, యాపెతు ఒక వస్త్రం పట్టుకొని, తమ భుజాలపై వేసికొని వెనక్కు నడిచి, తమ తండ్రి దిగంబరత్వం కప్పివేశారు. వారి ముఖాలు వేరే దిక్కుగా ఉన్నాయి. గనుక వారు తమ తండ్రి దిగంబరత్వం చూడలేదు.
[24] నోవహుకు మత్తు వదిలి, తన చిన్నకొడుకు చేసినది తెలిసికొని ఇలా అన్నాడు:
[25] “కనాను శాపగ్రస్తుడు. తన అన్నలకు దాసానుదాసుడు అవుతాడు.”
[26] అతడింకా అన్నాడు: “షేము దేవుడైన యెహోవాకు స్తుతులు కలుగు గాక! కనాను అతడి దాసుడుగా ఉండు గాక!
[27] దేవుడు, యాపెతు విస్తరించేటట్లు చేయు గాక! అతడు షేము గుడారాలలో కాపురముండు గాక! కనాను వారికి దాసుడుగా ఉండు గాక!”
[28] జలప్రళయం తరువాత నోవహు ఇంకా మూడువందల యాభై ఏళ్ళు బ్రతికాడు.
[29] నోవహు జీవించిన కాలం తొమ్మిది వందల యాభై ఏళ్ళు. అప్పుడు చనిపోయాడు.