Skip to content
Opens in a new window

[1] యెహోవా అబ్రాముతో ఇలా అన్నాడు: “నీవు నీ దేశంనుంచీ, నీ బంధువుల దగ్గరనుంచీ, నీ తండ్రి ఇంటినుంచీ బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు.

[2] నేను నిన్ను ఒక గొప్ప ప్రజగా చేసి నిన్ను దీవించి, నీ పేరు గొప్ప చేస్తాను. నీవు దీవెనగా ఉంటావు.

[3] నిన్ను దీవించేవారిని నేను దీవిస్తాను. నిన్ను శపించేవారిని శపిస్తాను. నీమూలంగా లోకంలోని అన్ని వంశాలు ధన్యం అవుతాయి.”

[4] యెహోవా తనతో చెప్పిన మాట ప్రకారం అబ్రాము బయలుదేరాడు. అతనితో కూడా లోత్ వెళ్ళాడు. అబ్రాము హారాను నుంచి బయలుదేరినప్పుడు అతడు డెబ్భయి అయిదేళ్ళ వాడు.

[5] అబ్రాము తన భార్య శారైనీ, తన తమ్ముని కొడుకు లోత్‌నూ, హారానులో వారంతా గడించిన సంపదనూ, సంపాదించుకొన్న వ్యక్తులనూ తీసుకొని కనాను దేశానికి బయలుదేరి అక్కడికి చేరాడు.

[6] అబ్రాము ఆ దేశంమీదుగా దాటిపోతూ షెకెంకూ, మోరేలో ఉన్న సిందూర వృక్షందగ్గరికీ వచ్చాడు. అప్పటికే కనానువాళ్ళు ఆ దేశంలో ఉన్నారు.

[7] అక్కడ యెహోవా అబ్రాముకు ప్రత్యక్షమై “నేనీ దేశం నీ సంతానానికి ప్రసాదిస్తాను” అన్నాడు. తనకు ప్రత్యక్షమైన యెహోవాకు అబ్రాము ఒక బలిపీఠం కట్టాడు.

[8] అతడక్కడ నుంచి బేతేల్‌కు తూర్పున ఉన్న పర్వతం దగ్గరికి వెళ్ళి తన గుడారం వేసుకొన్నాడు. దానికి పడమట బేతేల్, తూర్పున హాయీ ఉన్నాయి. అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా పేర ప్రార్థించాడు.

[9] అబ్రాము ఇంకా నెగెవ్ వైపుకు ప్రయాణాలు చేస్తూ ఉన్నాడు.

[10] ఆ దేశంలో కరవు వచ్చింది. అది తీవ్రతరం కావడం చేత అబ్రాము ఈజిప్ట్‌దేశంలో కొంతకాలం ఉండడానికి అక్కడికి వెళ్ళాడు.

[11] ఈజిప్ట్ సరిహద్దుల దగ్గరికి వచ్చినప్పుడు అబ్రాము తన భార్య శారైతో ఇలా అన్నాడు: “ఇదిగో విను, నీవు చక్కనిదానివని నాకు తెలుసు.

[12] ఈజిప్ట్‌వారు నిన్ను చూచి, ‘ఈమె అతడి భార్య’ అని చెప్పి, నన్ను చంపి నిన్ను బ్రతకనిస్తారు.

[13] కనుక నిన్ను బట్టి నేను క్షేమంగా ఉండేందుకూ, నీకారణంగా నేను చావకుండా ఉండేందుకూ నీవు నా చెల్లెలివని వారికి చెప్పు.”

[14] ఆమె చాలా అందకత్తె. అబ్రాము ఈజిప్ట్‌కు వచ్చిన తరువాత ఈజిప్ట్‌వారు ఇది చూశారు.

[15] ఫరో అధిపతులు ఆమెను చూచి చక్రవర్తి ఎదుట శ్లాఘించారు. గనుక చక్రవర్తి భవనానికి ఆమెను తీసుకుపోవడం జరిగింది.

[16] ఆమెనుబట్టి చక్రవర్తి అబ్రాముకు మేలు చేశాడు. అతనికి గొర్రెలూ, ఎడ్లూ, గాడిదలూ, పనివాళ్ళూ, పనికత్తెలూ, ఒంటెలూ లభించాయి.

[17] అబ్రాము భార్య శారై కారణంగా యెహోవా చక్రవర్తినీ, అతడి ఇంటివాళ్ళనూ ఘోరమైన రోగాలతో బాధించాడు.

[18] అందుచేత చక్రవర్తి అబ్రామును పిలిపించి అతనితో ఇలా అన్నాడు: “నీవు నాకు చేసినదేమిటి? ఆమె నీ భార్య అని నాకు ఎందుకు చెప్పలేదూ?

[19] నీవు ‘ఆమె నా చెల్లెల’ని చెప్పావేం? ఆమెను నా భార్యగా స్వీకరించేందుకు ఆమెను తీసుకొన్నాను. ఇదిగో నీ భార్య. ఇప్పుడు నీవు ఆమెను తీసుకుని వెళ్ళిపో.”

[20] అప్పుడు చక్రవర్తి అతణ్ణి గురించి తన మనుషులకు ఆజ్ఞాపించాడు. వాళ్ళు అతనికున్నంతటినీ తీసుకుపోనిచ్చారు. అతణ్ణీ, అతని భార్యనూ పంపించివేశారు.

ఆదికాండం (ఆరంభాలు) — Chapters