Skip to content
Opens in a new window

[1] యోసేపు తన పరివారం ఎదుట తనను ఇంకా తమాయించుకోలేక వారితో “మీరంతా నా దగ్గరనుంచి వెళ్ళిపోవాలి” అని గట్టిగా చెప్పాడు. యోసేపు తన అన్నదమ్ములకు తనను తెలియజేసు కొన్నప్పుడు ఇంకెవరూ లేరు.

[2] అయితే అతడు బిగ్గరగా ఏడ్చాడు, గనుక ఈజిప్ట్‌వాళ్ళకూ చక్రవర్తి ఇంటివాళ్ళకూ అది వినిపించింది.

[3] యోసేపు తన అన్నదమ్ములతో “నేను యోసేపును. మన తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా?” అన్నాడు. అయితే అతని సమక్షంలో అతని అన్నదమ్ములు కంగారుపడి నోట మాట రాక ఏ జవాబూ చెప్పలేకపొయ్యారు.

[4] అప్పుడు యోసేపు తన అన్నదమ్ములతో “దగ్గరికి రండి” అన్నాడు. వారు దగ్గరికి వచ్చాక అతడు, “ఈజిప్ట్ దేశానికి వెళ్ళేట్టు మీరు అమ్మివేసిన యోసేపును నేనే. మీ తోడబుట్టినవాణ్ణి.

[5] ఇక్కడికి చేరేలా మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకండి, మిమ్మల్ని నిందించుకోకండి. ఎందుకంటారా? దేవుడు అనేకమంది ప్రాణాలు దక్కించడానికి నన్ను మీకు ముందుగా పంపించాడు.

[6] “రెండేళ్ళనుంచి కరువు ఈ దేశంలో ఉంది. ఈ వచ్చే అయిదేళ్ళలో కూడా భూమి దున్నడం, కోత కోయడం ఉండవు.

[7] అయితే లోకంలో మీ సంతానం నిలిచివుండేలా చేయడానికీ, మిమ్మల్ని ఆశ్చర్యంగా అపాయం నుంచి కాపాడడానికి దేవుడు నన్ను మీకు ముందుగా పంపించాడు.

[8] కనుక నన్ను ఇక్కడికి పంపించినది మీరు కాదు గానీ దేవుడే. అంతేగాక ఆయన నన్ను ఫరోకు ప్రధానమంత్రిగానూ, అతని భవనంలో అన్ని విషయాలకూ యజమానిగానూ ఈజిప్ట్ దేశం అంతటిమీద పరిపాలకుడిగానూ చేశాడు.

[9] ఇప్పుడు మీరు మన నాన్నగారి దగ్గరికి త్వరగా వెళ్ళి ఆయనతో ఇలా చెప్పండి: ‘నీ కొడుకు యోసేపు చెప్పేదేమిటంటే, దేవుడు నన్ను ఈజిప్ట్ దేశం అంతటి మీద అధిపతిగా చేశాడు. నా దగ్గరకు రండి. ఆలస్యం చేయకండి.

[10] నువ్వు గోషెన్ ప్రదేశంలో కాపురం చేస్తూ నా దగ్గర ఉంటావు. నీవూ నీ సంతానమూ నీ మనుమలూ నీ గొర్రెల, మేకల, పశువుల మందలూ నీ ఆస్తిపాస్తులన్నీ గోషెన్‌లో ఉంచుకోవచ్చు.

[11] నీకు ఉన్నదానంతటికీ, నీకూ, నీ ఇంటివారికీ పేదరికం రాకుండా నిన్ను ఈ స్థలంలో పోషిస్తాను. ఈ కరవు ఇంకా అయిదేళ్ళు ఉంటుంది’ అని మన నాన్న గారితో చెప్పండి.

[12] “ఇదిగో మీతో మాట్టాడుతున్నది నేనే అని మీరూ నా తమ్ముడు బెన్యామీనూ కండ్లారా చూస్తున్నారు గదా!

[13] ఈజిప్ట్‌లో నాకున్న వైభవాన్నీ, మీరు చూచిన సర్వాన్నీ మన నాన్నగారికి తెలియజేయండి. ఆయనను త్వరలో ఇక్కడికి తీసుకురండి.”

[14] అప్పుడతడు తన తమ్ముడు బెన్యామీన్ను కావలించుకొని కన్నీళ్ళు విడిచాడు. బెన్యామీను అతని మెడమీద పడి కన్నీళ్ళు విడిచాడు.

[15] యోసేపు తన అన్నలందరినీ ముద్దు పెట్టుకొని, కావలించుకొని కన్నీళ్ళు విడిచాడు. ఆ తరువాత అతని అన్నదమ్ములు అతనితో మాట్లాడారు.

[16] యోసేపు అన్నదమ్ములు వచ్చిన సంగతి చక్రవర్తి భవనంలో వినిపించింది. వారు రావడం ఫరోకూ అతని పరివారానికీ నచ్చింది.

[17] యోసేపుతో ఫరో “నీ అన్నదమ్ములతో ఇలా చెప్పు – ‘మీరు చేయవలసినదేమంటే, మీ గాడిదలమీద సామాను కట్టి కనానుదేశానికి వెళ్ళి,

[18] మీ తండ్రినీ మీ ఇంటివాళ్ళనూ వెంటబెట్టుకొని నా దగ్గరికి రావాలి. ఈజిప్ట్ దేశంలోని విలువైనవాటిని మీకిస్తాను. మీరు ఈ భూసారాన్ని అనుభవిస్తారు’.

[19] నీవు వాళ్ళతో ఇంకా ఇలా చెప్పాలి: మీ పిల్లలకోసం మీ భార్యలకోసం ఈజిప్ట్ నుంచి పెద్ద పెద్ద బండ్లను తీసుకుపోయి, మీ తండ్రిని వెంటబెట్టుకురండి.

[20] ఈజిప్ట్‌దేశంలో ఉన్న విలువైనవి మీవే అవుతాయి, గనుక విడవవలసిన ఆస్తి విషయంలో చింతపడకండి.”

[21] ఇస్రాయేల్ కొడుకులు అలాగే చేశారు. ఫరో మాట ప్రకారం యోసేపు వారికి పెద్ద పెద్ద బండ్లనూ, ప్రయాణానికి భోజన పదార్థాలనూ ఇప్పించాడు.

[22] వారిలో ఒక్కొక్కరికి దుస్తులు ఇచ్చాడు. గాని, బెన్యామీనుకు మూడు వందల వెండి నాణేలూ, అయిదంతలుగా దుస్తులిచ్చాడు.

[23] అతడు తన తండ్రి దగ్గరికి కూడా వస్తువులు పంపించాడు. ఈజిప్ట్‌లో ఉన్న శ్రేష్ఠమైనవాటిని మోస్తున్న పది గాడిదలనూ, ప్రయాణానికి తన తండ్రికోసం ధాన్యం, భోజన పదార్థాలు, వేరు వేరు తినుబండారాలు మోస్తున్న పది ఆడ గాడిదలనూ పంపించాడు.

[24] అతడు తన అన్నదమ్ములను సాగనంపాడు. వారు బయలుదేరుతుండగా అతడు “ప్రయాణంలో మీరు వివాదాలు పెట్టుకోకండి సుమా” అన్నాడు.

[25] వారు ఈజిప్ట్ నుండి తరలివెళ్ళి కనానుదేశానికి, తమ తండ్రి యాకోబు దగ్గరికి చేరుకున్నారు.

[26] “యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు, ఈజిప్ట్ దేశం అంతటిమీదా పరిపాలకుడుగా ఉన్నాడు” అంటూ అతనికి తెలియజేశారు. యాకోబు వారి మాట నమ్మలేక స్తంభించిపొయ్యాడు.

[27] అయితే తమతో యోసేపు చెప్పిన మాటలన్నీ వారతనికి తెలిపారు. అతడు తనను తీసుకువెళ్ళడానికి యోసేపు పంపించిన ఆ పెద్ద బండ్లను చూచినప్పుడు వారి తండ్రి యాకోబుకు ప్రాణం లేచి వచ్చింది.

[28] “ఇక చాలు. నా కొడుకు యోసేపు బ్రతికే ఉన్నాడు. నేను చనిపోవడానికి ముందు అతణ్ణి చూడడానికి వెళ్తాను” అన్నాడు ఇస్రాయేల్.

ఆదికాండం (ఆరంభాలు) — Chapters