Skip to content
Opens in a new window

[1] మరొకప్పుడు అబ్రాహాముకు మమ్రే సిందూర వృక్షాల దగ్గర యెహోవా ప్రత్యక్షమయ్యాడు. అబ్రాహాము ఎండవేళ తన డేరా ద్వారంలో కూర్చుని ఉన్నప్పుడు,

[2] తలెత్తి ఎదురుగా నిలుచున్న ముగ్గురు మనుషులను చూచి, వారిని కలుసుకోవడానికి డేరా ద్వారం నుంచి పరుగెత్తి నేలవరకు వంగి ఇలా అన్నాడు:

[3] “నా ప్రభూ, నన్ను దయతో చూస్తే మీ దాసుడైన నన్ను దర్శించకుండా వెళ్ళిపోకండి.

[4] నేను కొంచెం నీళ్ళు తెప్పిస్తాను. కాళ్ళు కడుక్కొని ఈ చెట్టుక్రింద విశ్రాంతి తీసుకోండి.

[5] మీ దాసుడైన నా దగ్గరికి వచ్చారు గదా! మీరు సేద దీర్చుకొనేలా కొంచెం ఆహారం తెస్తాను. ఆ తరువాత మీరు వెళ్ళవచ్చు.” వారు “నీవు చెప్పినట్టే చెయ్యి” అన్నారు.

[6] అబ్రాహాము డేరాలో ఉన్న శారా దగ్గరికి తొందరగా వెళ్ళి “మూడు మానికల మెత్తని పిండి పిసికి, త్వరగా రొట్టెలు చెయ్యి” అన్నాడు.

[7] అబ్రాహాము మందకు పరుగెత్తి వెళ్ళి ఒక మంచి లేత కోడెదూడను తెచ్చి, పనివాడి చేతికప్పగించాడు. ఆ పనివాడు దాన్ని త్వరగా వండాడు.

[8] అప్పుడు అబ్రాహాము పెరుగు, పాలు, తాను వండించిన వంటకం తీసుకుపోయి, ఆ మనుషుల ఎదుట పెట్టాడు. వారు భోజనం చేస్తూ ఉంటే, అతడు వారిదగ్గర ఆ చెట్టుక్రింద నిలుచున్నాడు.

[9] వారు “నీ భార్య శారా ఎక్కడ ఉంది?” అని అతణ్ణి అడిగారు. “అదుగో, డేరాలో ఉంది” అన్నాడు.

[10] ఆయన “వచ్చే సంవత్సరం ఇదే కాలంలో నీ దగ్గరకు తప్పకుండా తిరిగి వస్తాను. అప్పుడు నీ భార్య శారాకు కుమారుడు కలుగుతాడు” అన్నాడు. ఆయనకు వెనుక ఉన్న డేరా ద్వారంలో శారా ఆ మాటలు వింటూ ఉంది.

[11] అబ్రాహాము, శారా ఇద్దరూ వయసు మళ్ళిన వృద్ధులు. శారాకు కాన్పులు ఉడిగిపోయాయి.

[12] అందుచేత శారా తనలో నవ్వుకొంటూ “నేను నీరసించిపోయాక, నా యజమాని ముసలివాడయ్యాక నాకు మరి అలాంటి సంతోషం కలుగుతుందా?” అనుకొంది.

[13] అప్పుడు యెహోవా అబ్రాహాముతో “శారా ఎందుకు నవ్వింది? ‘ముసలిదాననైన నాకు నిజంగా సంతానం కలుగుతుందా?’ అని ఎందుకు అన్నది?

[14] యెహోవా చేయలేనిది ఏదైనా ఉన్నదా? వచ్చే సంవత్సరం నేను నియమించిన ఈ కాలంలో నీ దగ్గరికి తిరిగి వస్తాను. శారా కుమారుణ్ణి కంటుంది” అన్నాడు.

[15] శారాకు భయం వేసి “నేను నవ్వలేద”ని బొంకింది. యెహోవా “అలా అనకు, నీవు నవ్వావు” అన్నాడు.

[16] ఆ పైన ఆ మనుషులు అక్కడనుంచి బయలుదేరి సొదొమవైపు చూస్తూ ఉన్నారు. అబ్రాహాము వారిని సాగనంపడానికి వెళ్ళాడు.

[17] అప్పుడు యెహోవా ఇలా అనుకొన్నాడు: “నేను చేస్తున్నది అబ్రాహాముకు తెలుపకుండా ఉంటానా?

[18] అబ్రాహాము బలమైన గొప్ప ప్రజకు తండ్రి అవుతాడు గదా! అతనిమూలంగా లోకంలో అన్ని జనాలకు దీవెనలు వస్తాయి గదా!

[19] అబ్రాహాము తరువాత అతని సంతతివారూ, ఇంటివారూ నీతి న్యాయాలతో బ్రతుకుతూ యెహోవా మార్గాన్ని అనుసరించేలా అతడు వారికి ఆజ్ఞాపించాలి, అందుకే నేను అతణ్ణి ఎరిగి ఎన్నుకొన్నాను. ఈ విధంగా తాను అబ్రాహామును గురించి చెప్పినది యెహోవా అతని విషయంలో నెరవేరుస్తాడు.”

[20] అప్పుడు యెహోవా అన్నాడు: “సొదొమ, గొమొర్రాలను గురించిన మొర గొప్పదే. వాటి పాపం చాలా ఘోరమైంది.

[21] నేను ఇక్కడనుంచి దిగిపోయి నా దగ్గరకు వచ్చిన ఆ మొరప్రకారం వారు పూర్తిగా చేశారో లేదో చూడాలి. చేయకపోతే తెలుసుకొంటాను.”

[22] ఆ మనుషులు అక్కడనుంచి మళ్ళుకొని సొదొమవైపు వెళ్ళారు. అయితే అబ్రాహాము యెహోవా ఎదుట ఇంకా నిలుచున్నాడు.

[23] అబ్రాహాము యెహోవాను సమీపించి ఇలా అన్నాడు: “నీవు దుర్మార్గులతోపాటు న్యాయవంతులను నిజంగా నాశనం చేస్తావా?

[24] ఒకవేళ ఆ పట్టణంలో యాభైమంది న్యాయవంతులున్నారేమో, అందులో ఉన్న ఆ యాభైమంది న్యాయవంతులకోసం ఆ స్థలాన్ని నాశనం చేయకుండా క్షమించవా?

[25] “న్యాయవంతులను దుర్మార్గులతోపాటు చంపడం నీకు దూరం కావాలి. దుర్మార్గుల పట్ల ఎలాగో న్యాయవంతులపట్ల అలాగే వ్యవహరించడం నీకు దూరం అవుతుంది గాక. లోకమంతటికీ న్యాయమూర్తి న్యాయంగా తీర్పు తీర్చడా?”

[26] యెహోవా “సొదొమలో యాభైమంది న్యాయవంతులు కనబడితే వారికోసం ఆ స్థలాన్నంతా క్షమిస్తాను” అన్నాడు.

[27] దానికి అబ్రాహాము “ఇదిగో, నేను ధూళి, బూడిదలాంటివాణ్ణి. అయినా యెహోవాతో మాట్లాడడానికి పూనుకున్నాను.

[28] “ఒకవేళ ఆ యాభైమంది న్యాయవంతుల లెక్కలో అయిదుగురు తక్కువ అవుతారనుకో. అయిదుగురు తక్కువ కావడం చేత ఆ పట్టణమంతా నాశనం చేస్తావా?” అని ప్రత్యుత్తరమిచ్చాడు. “అక్కడ నలభై అయిదుగురు న్యాయవంతులను నేను చూస్తే దాన్ని నాశనం చెయ్యను” అన్నాడు యెహోవా.

[29] మరోసారి అబ్రాహాము ఆయనతో “అక్కడ నలభైమంది మాత్రం కనబడతారేమో” అన్నాడు. “నలభైమంది ఉంటే, వారినిబట్టి దాన్ని నాశనం చేయను” అన్నాడాయన.

[30] “ప్రభువుకు కోపం రాకపోతే నేనింకా మాట్లాడతాను, ఒకవేళ ముప్ఫయిమంది అక్కడ కనిపించవచ్చు” అని అబ్రాహాము అన్నాడు. ఆయన “అక్కడ నేను ముప్ఫయి మందిని చూస్తే దాన్ని నాశనం చేయను” అన్నాడు.

[31] అబ్రాహాము “ఇదిగో, ప్రభువుతో మాట్లాడడానికి పూనుకున్నాను. ఒకవేళ అక్కడ ఇరవైమంది మాత్రం కనబడతారు” అన్నాడు. ఆయన “ఇరవైమంది ఉంటే వారినిబట్టి దాన్ని నాశనం చేయను” అన్నాడు.

[32] అతడిలా అన్నాడు: “ప్రభువుకు కోపం రాకపోతే ఇంకోసారి మాత్రమే మాట్లాడుతాను. ఒకవేళ పదిమంది మాత్రమే అక్కడ కనిపిస్తే?” ఆయన “పదిమంది ఉంటే వారినిబట్టి దాన్ని నాశనం చేయను” అన్నాడు.

[33] అబ్రాహాముతో మాట్లాడడం మానుకొని యెహోవా వెళ్ళిపోయాడు. అబ్రాహాము తన స్థలానికి తిరిగి వెళ్ళాడు.

ఆదికాండం (ఆరంభాలు) — Chapters