Skip to content
Opens in a new window

[1] లోకంలో జనాభా విస్తరించడం ఆరంభించిన రోజుల్లో వారికి కూతుళ్ళు పుట్టినప్పుడు

[2] మనుషుల కూతుళ్ళు అందకత్తెలని దైవకుమారులు చూచి తమకు ఇష్టం వచ్చిన స్త్రీలను చేపట్టారు.

[3] అప్పుడు యెహోవా “నా ఆత్మ సదాకాలం మనుషుల మధ్యలో ఉండడు. ఎందుకంటే వారు శరీర స్వభావులు. గనుక ఇక వారి కాలం నూట ఇరవై ఏళ్ళు అవుతుంది.”

[4] ఆ రోజుల్లో బ్రహ్మాండమైన మనుషులు లోకంలో ఉన్నారు. ఆ తరువాత కూడా ఉన్నారు. దైవకుమారులు మానవ కుమార్తెల దగ్గరికి వచ్చినప్పుడు వారివల్ల పిల్లలను కన్నారు. పూర్వకాలంలో పేరు పొందిన బలాఢ్యులు వీళ్ళే.

[5] మనుషుల చెడుతనం లోకంలో అధికం కావడం, వాళ్ళ అంతరంగంలోని తలంపుల ఉద్దేశమంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డగా ఉండడం యెహోవా చూశాడు.

[6] తాను మానవుణ్ణి లోకంలో చేసినందుచేత యెహోవాకు పరితాపమూ హృదయంలో దుఃఖమూ కలిగాయి.

[7] యెహోవా “నేను సృజించిన మనుషులను లోకంలో ఉండకుండా నాశనం చేస్తాను. మానవులతోపాటు పశువులనూ, ప్రాకే జంతువులనూ, గాలిలో ఎగిరే పక్షులనూ కూడా నాశనం చేస్తాను. వాళ్ళను చేసినందుకు నాకు పరితాపం కలిగింది” అన్నాడు.

[8] అయితే నోవహును యెహోవా దయగా చూశాడు.

[9] ఇది నోవహు చరిత్ర: నోవహు తన తరంవారిలో న్యాయవంతుడూ, నిందారహితుడూ. నోవహు దేవుని సహవాసంలో నడిచాడు.

[10] నోవహుకు ముగ్గురు కొడుకులు జన్మించారు – షేము, హాము, యాపెతు.

[11] దేవుని దృష్టిలో లోకం భ్రష్టమైపోయి దౌర్జన్యంతో నిండి ఉంది.

[12] మనుషులంతా తమ జీవిత విధానాన్ని పాడు చేసుకొన్నందుకు లోకం భ్రష్టమైన స్థితిలో ఉంది. అది దేవుడు చూశాడు.

[13] దేవుడు నోవహుతో ఇలా అన్నాడు: “మనుషులవల్ల లోకం దౌర్జన్యంతో నిండి ఉంది. గనుక నా సముఖంనుంచి ప్రతి శరీరి నిర్మూలమైపోవాలి. నేను మానవాళిని భూమితోపాటు నాశనం చేస్తాను.

[14] నీవైతే తమాల మ్రానుతో ఒక ఓడను నీకోసం చేసుకో. గదులు గదులుగా ఆ ఓడను చేసి లోపలా బయటా దానికి కీలు పూయాలి.

[15] నీవు దాన్ని చేయవలసిన విధమిదే: ఆ ఓడ పొడుగు మూడు వందల మూరలు. దాని వెడల్పు యాభై మూరలు. దాని ఎత్తు ముప్ఫయి మూరలు ఉండాలి.

[16] ఓడలో వెలుగు కోసం ఒక కిటికీ చేయాలి. దాన్ని పైకప్పు నుంచి మూరెడు క్రిందికి పెట్టాలి. ఓడకు ఒక ప్రక్క తలుపు పెట్టాలి. ఓడను మూడంతస్తులుగా కట్టాలి.

[17] నేను భూలోకం మీదికి జలప్రళయాన్ని రప్పిస్తున్నాను. అవును, నేనే ప్రతి శరీరినీ, ఊపిరి ఉన్న ప్రతిదానిని ఆకాశం క్రింద ఉండకుండా నిర్మూలం చేస్తాను. లోకంలో ఉన్నదంతా నాశనం అవుతుంది.

[18] “అయితే నేను నీతో నా ఒడంబడిక చేస్తాను. నీవూ, నీతోపాటు నీ కొడుకులూ, నీ భార్యా, నీ కోడళ్ళూ ఓడలోకి చేరుకోవాలి.

[19] అంతేకాక, జంతుజాలంలో ప్రతి జాతిలోనివి రెండు రెండు నీతోకూడా బ్రతికేలా వాటిని ఓడలోకి తేవాలి. ప్రతి జాతిలో మగది, ఆడది ఉండాలి.

[20] వాటి వాటి జాతులప్రకారం అన్ని విధాల పక్షుల్లో, పశువుల్లో, భూమిమీద తిరిగే ప్రతి దానిలో రెండు రెండు బ్రతికేలా నీదగ్గరికి వస్తాయి.

[21] నీ కోసం, వాటి కోసం ప్రతివిధమైన మేతనూ భోజన పదార్థాలనూ కూర్చుకొని నీ దగ్గర ఉంచుకో. దాన్ని అవీ మీరూ తింటారు.”

[22] నోవహు అలా చేశాడు. దేవుడు అతనికాజ్ఞాపించినట్టే అంతా సాధించాడు.

ఆదికాండం (ఆరంభాలు) — Chapters