[1] యాకోబు తన దారిన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవదూతలు అతణ్ణి కలుసుకొన్నారు.
[2] వారిని చూచినప్పుడు యాకోబు “ఇది దేవుని సేన” అని చెప్పి, ఆ చోటికి ‘మహనయీం’ అనే పేరు పెట్టాడు.
[3] యాకోబు ఎదోం దేశంలో ఉన్న శేయీరు ప్రాంతంలో ఉన్న తన అన్న ఏశావు దగ్గరకు వార్తాహరులను తనకు ముందుగా పంపుతూ వారిని ఇలా ఆదేశించాడు:
[4] “మీరు నా యజమాని ఏశావుతో చెప్పవలసినదేమిటంటే, నా యజమానులైన మీకు ఇది తెలియజేయడానికి కబురు పంపుతున్నాను: ఇప్పటిదాకా నేను లాబాను దగ్గర ఉన్నాను.
[5] నాకు పశువులూ గాడిదలూ మందలూ ఉన్నాయి. దాసదాసీలు ఉన్నారు. మీరు నన్ను దయ చూడాలని కోరుతున్నాను అని మీ సేవకుడైన యాకోబు అంటున్నాడు.”
[6] తరువాత ఆ వార్తాహరులు యాకోబు దగ్గరికి తిరిగి వచ్చి, “మీ అన్న ఏశావు దగ్గరికి చేరాం. అతడు నాలుగు వందలమందిని వెంటబెట్టుకొని మిమ్మల్ని ఎదుర్కోవడానికి వస్తున్నాడు” అన్నారు.
[7] అందుకు యాకోబు చాలా భయపడ్డాడు, కలవరపడ్డాడు. తనతో ఉన్నవారినీ, మందలనూ, పశువులనూ ఒంటెలనూ రెండు గుంపులుగా విభాగించాడు.
[8] ఎందుకంటే అతడు “ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాన్ని కొట్టాడంటే, మిగిలిన గుంపు తప్పుకొని పారిపోవచ్చు” అనుకొన్నాడు.
[9] అప్పుడు యాకోబు ఇలా ప్రార్థించాడు: “నా తాత అయిన అబ్రాహాముకు, నా తండ్రి అయిన ఇస్సాకుకు తోడైన దేవా! యెహోవా! నీవు నాతో, ‘నీ స్వదేశానికి, నీ బంధువుల దగ్గరికి తిరిగి వెళ్ళు; నీకు మేలు చేస్తాను’ అన్నావు.
[10] నీవు నీ దాసుడైన నాపట్ల నమ్మకంగా ఉండి ఎంతో వాత్సల్యత చూపించావు. దానికి నేను యోగ్యుణ్ణి కాను. నేనీ యొర్దాను నది దాటి వచ్చినప్పుడు నాకు ఉన్నది నా చేతికర్ర మాత్రమే. ఇప్పుడైతే నేను రెండు గుంపులయ్యాను.
[11] దయ చూపి నా అన్న ఏశావు చేతినుంచి నన్ను రక్షించు. అతడు వచ్చి నన్నూ పిల్లల్తోపాటు తల్లులనూ చంపుతాడేమో అని అతని విషయం నాకు భయం ఉంది.
[12] నీవు నాతో అన్నావు గదా! ‘నేను నీకు మేలు చేసి తీరుతాను; సముద్రం ఇసుక రేణువులలాగా మనుషులు లెక్కించలేనంతగా నీ సంతానాన్ని వృద్ధి చేస్తాను’ అని.”
[13] ఆ రాత్రి అతడక్కడ గడిపిన తరువాత తాను తెచ్చినదానిలో తన అన్న ఏశావుకోసం ఒక కానుకను ఏర్పరచాడు.
[14] ఆ కానుక రెండు వందల మేకలూ, ఇరవై మేకపోతులూ, రెండు వందల గొర్రెలూ, ఇరవై పొట్టేళ్ళూ,
[15] ముప్ఫయి పాడి ఒంటెలూ వాటి పిల్లలతోపాటు, నలభై ఆవులూ, పది ఆబోతులూ, ఇరవై ఆడ గాడిదలు, పది గాడిద పిల్లలూనూ.
[16] వాటిని మంద మందగా చేసి, తన దాసుల చేతికప్పగించి, “మీరు మంద మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోవాలి” అన్నాడు.
[17] వారిలో మొదటివాడితో “నా అన్న ఏశావు నీకు ఎదురై ‘నువ్వు ఎవరివాడివి? ఎక్కడికి వెళుతున్నావు? నీ ముందర ఉన్నవి ఎవరివి?’ అని అడిగినప్పుడు,
[18] నీవు ఇలా అనాలి – ‘ఇవి మీ సేవకుడైన యాకోబువి. ఇదంతా మా యజమానులైన ఏశావుకు కానుక. ఆయన మా వెనుక ఇప్పుడే వస్తున్నాడు’” అంటూ ఆజ్ఞాపించాడు యాకోబు.
[19] రెండోవాడికీ మూడోవాడికీ మందల వెంట వెళ్ళిన వారందరికీ అలా ఆజ్ఞాపిస్తూ, “మీరు ఏశావును చూచినప్పుడు అలాగే అతనితో చెప్పాలి.
[20] ‘మీ సేవకుడు యాకోబు మా వెనుక ఇప్పుడే వస్తున్నాడ’ని కూడా చెప్పాలి” అన్నాడు. ఎందుకంటే “నేను ముందుగా పంపుతున్న కానుక వల్ల అతణ్ణి శాంతపరుస్తాను. ఆ తరువాత ముఖాముఖిగా కలుసుకొన్నప్పుడు ఒకవేళ అతడు నన్ను దయతో స్వీకరిస్తాడు” అనుకొన్నాడు.
[21] కానుకను తనకు ముందుగా పంపించి, తాను ఆ శిబిరంలో ఆ రాత్రి గడిపాడు.
[22] రాత్రివేళ అతడు లేచి తన ఇద్దరు భార్యలనూ ఇద్దరు దాసీలనూ పదకొండుమంది పిల్లలనూ వెంటబెట్టుకొని యబ్బోకు రేవు దాటిపొయ్యాడు.
[23] వారినీ, తనకున్నదాన్నంతా ఆ వాగు దాటించాడు.
[24] యాకోబు ఒంటరిగా ఉండిపొయ్యాడు. తెల్లవారేవరకు ఒక వ్యక్తి అతనితో పెనుగులాడుతూ ఉన్నాడు.
[25] ఆ వ్యక్తి తాను గెలవకపోవడం చూచి యాకోబు తొడగూటిమీద కొట్టాడు. అలా అతడు ఆ వ్యక్తితో పెనుగులాడుతూ ఉన్నప్పుడు యాకోబు తొడగూడు తప్పింది.
[26] ఆ వ్యక్తి “తెల్లవారుతున్నది, గనుక నన్ను వెళ్ళనియ్యి” అన్నాడు. అతడు “నీవు నన్ను దీవిస్తేనే తప్ప నిన్ను వెళ్ళనియ్యను” అని బదులు చెప్పాడు.
[27] ఆ వ్యక్తి “నీ పేరేమిటి?” అని అడిగాడు. అతడు “యాకోబు” అన్నాడు.
[28] ఆయన “ఇక మీదట నీ పేరు యాకోబు కాదు. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు గనుక నీ పేరు ఇస్రాయేల్” అన్నాడు.
[29] యాకోబు “దయచేసి నీ పేరు నాకు చెప్పు” అన్నాడు. అందుకాయన “నా పేరేమని నీవు ఎందుకు అడుగుతున్నావు?” అని చెప్పి అక్కడ అతణ్ణి దీవించాడు.
[30] యాకోబు ఆ స్థలానికి ‘పెనూయేల్’ అనే పేరు పెట్టాడు. ఎందుకంటే “నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచినా చావలేదు” అని చెప్పాడు.
[31] అతడు పెనూయేల్ నుంచి సాగిపోవడంతో ప్రొద్దు పొడిచింది. అతడు కుంటుతూ నడుస్తున్నాడు.
[32] ఆ వ్యక్తి యాకోబు తొడగూటిమీది తుంటినరాన్ని కొట్టినందుచేత నేటివరకు ఇస్రాయేల్ ప్రజలు దేని తొడగూటిమీద ఉన్న తుంటి నరమూ తినరు.