Skip to content
Opens in a new window

[1] రాహేలు తాను యాకోబుకు పిల్లలను కనలేదని గ్రహించి, తన అక్కను చూచి అసూయపడింది. “నన్ను సంతానవతిని చేయండి. లేకపోతే చస్తాను” అని యాకోబుతో చెప్పింది.

[2] రాహేలుమీద కోపంతో యాకోబు మండిపడి “నేనేం దేవుని స్థానంలో ఉన్నానా? ఆయన గర్భఫలం ప్రసాదించలేదు అంతే!” అన్నాడు.

[3] రాహేలు “ఇదిగో! నా దాసి బిల్హా ఉంది గదా. ఆమెతో పోండి. ఆమె నాకోసం పిల్లల్ని కంటుంది. అలా ఆమెమూలంగా నేనూ తల్లిని అనిపించుకుంటాను” అని చెప్పి,

[4] తన దాసి బిల్హాను భార్యగా అతనికిచ్చింది. యాకోబు ఆమె దగ్గరికి వెళ్ళాడు.

[5] బిల్హా గర్భవతి అయి యాకోబుకు ఒక కొడుకును కన్నది.

[6] అప్పుడు రాహేలు “దేవుడు నాపట్ల న్యాయం తీర్చాడు. నా మొర విని నాకు కొడుకును ప్రసాదించాడు” అంది. అందుచేత ఆ కొడుకుకు ‘దాను’ అనే పేరు పెట్టింది.

[7] మరోసారి రాహేలు దాసి బిల్హా గర్భవతి అయి యాకోబుకు రెండో కొడుకును కన్నది.

[8] రాహేలు “నా అక్కతో దైవసంబంధమైన పోరాటాలలో గెలిచాను” అంటూ అతనికి ‘నఫ్తాలి’ అనే పేరు పెట్టింది.

[9] లేయా తనకు కానుపులు ఉడిగాయని గ్రహించి తన దాసి జిల్పాను భార్యగా యాకోబుకు ఇచ్చింది.

[10] జిల్పా కూడా యాకోబుకు ఒక కొడుకును కన్నది.

[11] అందుకు లేయా “ఎంత భాగ్యం!” అంటూ అతనికి ‘గాదు’ అనే పేరు పెట్టింది.

[12] లేయా దాసి జిల్పా రెండో కొడుకును యాకోబుకు కన్నది.

[13] లేయా “నేను ధన్యనే! స్త్రీలు నన్ను ధన్యురాలంటారు” అంటూ అతనికి ‘ఆషేరు’ అనే పేరు పెట్టింది.

[14] గోధుమల కోత కాలంలో రూబేను వెళ్ళి పచ్చిక మైదానాలలో పుత్రదాత ఓషధి చూచి, ఆ మొక్కలు తన తల్లి లేయాకు తెచ్చి ఇచ్చాడు. అప్పుడు రాహేలు లేయాతో “దయచేసి నీ కొడుకు తెచ్చిన పుత్రదాత ఓషధులు కొన్ని నాకియ్యి” అంది.

[15] అందుకు లేయా “నువ్వు నా భర్తను తీసుకున్నావే. అది చాలదా? నా కొడుకు తెచ్చిన పుత్రదాత ఓషధి కూడా తీసుకోవాలని చూస్తున్నావా?” అంది. రాహేలు “సరే, నీ కొడుకు తెచ్చిన పుత్రదాత ఓషధి నాకిస్తే ఈ రాత్రి యాకోబు నిన్ను పొందవచ్చు” అంది.

[16] ప్రొద్దు క్రుంకే వేళ యాకోబు పచ్చిక మైదానాలనుంచి వస్తున్నప్పుడు అతణ్ణి కలుసుకోవడానికి లేయా వెళ్ళి, “మీరు నా దగ్గరికి రావాలి. నా కొడుకు తెచ్చిన పుత్రదాత ఓషధి ఇచ్చి మిమ్మల్ని బాడుగకు తీసుకున్నాను” అంది. అందుచేత అతడు ఆ రాత్రి ఆమెను పొందాడు.

[17] దేవుడు లేయా మొర విన్నాడు, గనుక ఆమె గర్భవతి అయి యాకోబుకు అయిదో కొడుకును కన్నది.

[18] లేయా “నేను నా దాసిని నా భర్తకిచ్చినందుచేత దేవుడు నాకు ప్రతిఫలం ప్రసాదించాడు” అంది. ఆ కొడుకుకు ‘ఇశ్శాకారు’ అని పేరు పెట్టింది.

[19] మరోసారి లేయా గర్భవతి అయి యాకోబుకు ఆరో కొడుకును కన్నది.

[20] అప్పుడు లేయా “దేవుడు మంచి బహుమతి నాకిచ్చాడు. నేను నా భర్తకు ఆరుగురు కొడుకులను కన్నాను, గనుక ఇకనుంచి అతడు నాతోనే కాపురం చేస్తాడు” అంటూ, అతనికి ‘జెబూలూను’ అనే పేరు పెట్టింది.

[21] ఆ తరువాత ఒక కూతురును కని ఆమెకు ‘దీనా’ అనే పేరు పెట్టింది.

[22] దేవుడు రాహేలును జ్ఞాపకముంచుకొని ఆమె మొర విని ఆమెకు సంతానాన్ని ప్రసాదించాడు.

[23] ఆమె గర్భవతి అయి కొడుకును కని “దేవుడు నా అవమానం తీసేశాడు” అంది.

[24] “యెహోవా మరో కొడుకును నాకు ప్రసాదిస్తాడు గాక!” అంటూ ఆమె అతనికి ‘యోసేపు’ అనే పేరు పెట్టింది.

[25] రాహేలు యోసేపును కన్న తరువాత యాకోబు లాబానుతో “నన్ను స్వదేశానికి, స్వస్థలానికి వెళ్ళనివ్వు.

[26] నా భార్యలకోసం, పిల్లలకోసం నీ దగ్గర పని చేశాను గదా! వారిని నాకప్పగించు, నేను వెళ్తాను. నేను నీకోసం చేసిన పని నీకు బాగా తెలుసు గదా!”

[27] అందుకు లాబాను “నీకు నామీదే గనుక దయ ఉంటే నేను చెప్పేది విను. నీ కారణంగా యెహోవా ఆశీస్సులు నాకు కలిగాయని శకునం చూచి తెలుసుకున్నాను” అన్నాడు.

[28] పైగా, “నీకెంత జీతం కావాలో చెప్పు. అది ఇస్తాను” అన్నాడు.

[29] అందుకు యాకోబు “నేను నీ దగ్గర ఎలా పని చేశానో, నీ మందలు నాతో ఎలా ఉన్నాయో నీకు తెలుసు.

[30] నేను రాకముందు నీకు ఉన్నది కొంచెమే. అది చాలా ఎక్కువ అవుతూ వచ్చింది. నేను కాలు పెట్టిన ప్రతి చోటా యెహోవా దీవెనలు నీకు వచ్చాయి. అయితే నేను నా ఇంటివారికోసం సమకూర్చు కొనేది ఎప్పుడు?” అని అన్నాడు.

[31] లాబాను “మరి, నేను నీకేమివ్వాలి” అని అడిగితే యాకోబు ఇలా చెప్పాడు: “నీవు నాకేమీ ఇవ్వకు గానీ, ఒకమాట – నీవీ మాట ప్రకారం నన్ను చెయ్యనిస్తే చాలు. నీ మందను మళ్ళీ మేపుతూ కాస్తూ ఉంటాను.

[32] అంటే, ఈ రోజు నీ మంద అంతట్లో తిరుగుతూ మచ్చలు గానీ పొడలు గానీ గల ప్రతి గొర్రెనూ వేరుపరుస్తాను. గొర్రెపిల్లల్లో నల్లని ప్రతిదాన్నీ, మేకల్లో పొడలు, లేక మచ్చలు గల ప్రతిదాన్నీ వేరుపరుస్తాను. అలాంటివి నా జీతం అనుకుందాం.

[33] తరువాత ఈ నా జీతాన్ని చూడడానికి నీవు వచ్చినప్పుడు, నా నిజాయితీ నీకు తెలిసిపోతుంది. నా మేకల్లో మచ్చలూ పొడలూ లేనివీ, నా గొర్రెపిల్లల్లో నలుపు లేనివీ ఏవైనా ఉంటే వాటిని నేను దొంగిలించానన్న మాటే.”

[34] లాబాను “సరే, నువ్వు చెప్పినట్టే కానియ్యి” అన్నాడు.

[35] ఆ రోజే లాబాను చారలు, మచ్చలు గల మేకపోతులనూ, పొడలు గానీ మచ్చలు గానీ గల ప్రతి ఆడమేకనూ – తెలుపు కొంచెమైనా గల ప్రతిదాన్నీ – గొర్రెపిల్లల్లో ప్రతి నల్లదాన్నీ వేరుపరచి తన కొడుకులకు అప్పగించాడు.

[36] అప్పుడు లాబాను యాకోబు దగ్గరనుంచి మూడు రోజుల ప్రయాణం చేశాడు. అతని మందలో మిగిలినవాటిని యాకోబు మేపుతూ ఉన్నాడు.

[37] అప్పుడు యాకోబు గంగరావి, బాదం, సాల అనే చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వల్లో తెల్ల చారలు కనబడేలా అక్కడక్కడ వాటి బరెడు ఒలిచాడు.

[38] ఒలిచిన చువ్వలను మందలు త్రాగడానికి వచ్చే నీళ్ళ తొట్లలో వాటి ఎదుట ఉంచాడు. ఎందుకంటే అవి నీళ్ళు త్రాగడానికి వచ్చినప్పుడు అక్కడ ఎద అయ్యేవి.

[39] అలా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి పిల్లలను ఈనినప్పుడు ఆ పిల్లలకు చారలు గానీ, పొడలు గానీ, మచ్చలు గానీ ఉండేవి.

[40] యాకోబు ఆ గొర్రెపిల్లలను ప్రత్యేకంగా ఉంచాడు. లాబానుకు చెందిన మందలోని చారలుగల వాటివైపూ నల్లనివాటివైపూ మందల్లో మిగిలినవాటి ముఖాలను త్రిప్పాడు. తరువాత తన మందలను లాబాను మందలతో ఉండనియ్యకుండా వేరుగా ఉంచాడు.

[41] మందలో బలమైనవి దాటినప్పుడెల్లా అవి ఆ చువ్వలెదుట చూలు కట్టాలని యాకోబు వాటి కళ్ళెదుట కాలువల్లో ఆ చువ్వలు ఉంచుతూ వచ్చాడు.

[42] బలహీనమైనవాటి ఎదుట మాత్రం పెట్టలేదు. అలా బలహీనమైనవి లాబానుకూ, బలమైనవి యాకోబుకూ వచ్చాయి.

[43] ఈ విధంగా యాకోబు చాలా అభివృద్ధి చెందుతూ పెద్ద పెద్ద మందలనూ దాసదాసీ జనాన్నీ ఒంటెలనూ గాడిదలనూ సంపాదించుకొన్నాడు.

ఆదికాండం (ఆరంభాలు) — Chapters