Skip to content
Opens in a new window

[1] యెహోవాదేవుడు చేసిన అన్ని భూజంతువుల్లో పాము యుక్తి గలది. అది ఆ స్త్రీతో ఇలా అంది: “తోటలో ఉన్న ఏ చెట్టు పండైనా మీరు తినకూడదన్న మాట దేవుడు నిజంగా చెప్పాడా?”

[2] ఆ స్త్రీ పాముతో “తోటలో ఉన్న చెట్ల పళ్ళు మేము తినవచ్చు.

[3] కాని, తోటమధ్యలో ఉన్న ఆ చెట్టు ఫలాన్ని గురించి దేవుడు ఇలా అన్నాడు – ‘మీరు చావకుండేలా దాన్ని తినకూడదు; దాన్ని తాకకూడదు, సుమా’” అని చెప్పింది.

[4] పాము ఆ స్త్రీతో, “మీరు చావనే చావరు.

[5] కానీ మీరు దాన్ని తినే రోజున మీ మనోనేత్రాలు తెరుచుకుంటాయి. మీరు మేలు కీడు తెలిసి దేవుడిలాగా అవుతారని దేవుడికి తెలుసు” అంది.

[6] ఆ చెట్టు ఫలం తినడానికి మంచిదనీ, చూడడానికి రమ్యంగా ఉందనీ, జ్ఞానంకోసం కోరతగ్గదనీ ఆ స్త్రీకి కనబడడంతో దాని ఫలం తీసికొని తిన్నది. తనతోపాటు తన భర్తకు కొంత ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు.

[7] వారిద్దరికి మనోనేత్రాలు తెరుచుకున్నాయి. తాము నగ్నంగా ఉన్నామని తమకు తెలిసిపోయింది. వాళ్ళు అంజూరు ఆకులను కుట్టి మొలకు చుట్టుకున్నారు.

[8] సాయంకాలం యెహోవాదేవుడు తోటలో నడుస్తూ ఉన్న చప్పుడు వారికి వినిపించింది. ఆ మానవుడు, అతని భార్య యెహోవాదేవునికి కనిపించకుండేలా తోట చెట్లలో దాక్కొన్నారు.

[9] యెహోవాదేవుడు ఆ మానవుణ్ణి పిలిచి “నీవెక్కడ ఉన్నావు”? అని అడిగాడు.

[10] మానవుడు “తోటలో నీ శబ్దం నాకు వినిపించినప్పుడు భయం వేసింది. ఎందుకంటే నేను నగ్నంగా ఉన్నాను. గనుక నేను దాక్కున్నాను” అన్నాడు.

[11] దేవుడు “నీవు నగ్నంగా ఉన్న సంగతి నీకు తెలియజేసినదెవరు? నేను నీకు ఆజ్ఞాపించి తినవద్దన్న చెట్టు ఫలాన్ని నీవు తిన్నావా?” అన్నాడు.

[12] మానవుడు ఇలా జవాబిచ్చాడు, “నాతోపాటు ఉండడానికి నీవు ఇచ్చిన స్త్రీ ఆ చెట్టు ఫలాన్ని నాకిచ్చింది. నేను తిన్నాను.”

[13] యెహోవాదేవుడు ఆ స్త్రీతో “నీవు చేసినదేమిటి?” అన్నాడు. ఆ స్త్రీ “ఆ పాము నన్ను తప్పుదారి పట్టించింది. గనుక తిన్నాను” అంది.

[14] యెహోవాదేవుడు ఆ పాముతో అన్నాడు, “నీవు ఇలా చేసినందుకు పశువులన్నిటిలో, భూజంతువులన్నిటిలో నీకు ఎక్కువ శాపం తగిలింది. నీ బ్రతుకంతా నోట్లో ధూళిపడి కడుపుతో పాకుతూ ఉంటావు.

[15] అంతేగాక, నీకూ స్త్రీకీ, నీ సంతానానికీ ఆమె సంతానానికీ విరోధభావాన్ని కలిగిస్తాను. ఆయన నీ తలమీద దెబ్బతీస్తాడు. నీవు ఆయన కాలి మడమమీద దెబ్బతీస్తావు.”

[16] ఆ స్త్రీతో దేవుడన్నాడు, “నీ ప్రసవ వేదనను నేను తప్పక అధికం చేస్తాను. నీవు బాధతో పిల్లలను కంటావు. నీ భర్తపట్ల నీకు వాంఛ కలుగుతుంది. అతనికి నీపై అధికారం ఉంటుంది.”

[17] ఆ మనిషితో దేవుడు అన్నాడు: “నీవు నీ భార్య మాట విని, నేను నీకాజ్ఞాపించి ‘తినవద్ద’న్న చెట్టు ఫలాన్ని తిన్నావు, గనుక నీకోసం భూమి శాపానికి గురి అయింది. నీవు బ్రతికే కాలమంతా కష్టించి దాని ఫలం తింటావు.

[18] భూమి ముళ్ళతుప్పలనూ, గచ్చపొదలనూ నీకు మొలిపిస్తుంది. నీవు పొలం పంటను తింటావు.

[19] నీ ముఖాన చెమటోడ్చితే నీకు ఆహారం దొరుకుతుంది. నిన్ను నేలనుంచి తీయడం జరిగింది గనుక నీవు నేలకు మళ్ళీ చేరే వరకూ ఇలాగే ఉంటుంది. నీవు మట్టివి; మట్టికి తిరిగి పోతావు.”

[20] ఆదాము తన భార్యకు “హవ” అని పేరు పెట్టాడు. ఎందుకంటే ఆమె మానవ జాతికంతటికీ తల్లి.

[21] యెహోవాదేవుడు ఆ మనిషికోసం, అతడి భార్యకోసం తోలు బట్టలను చేసి వారికి తొడిగించాడు.

[22] యెహోవాదేవుడు ఇలా అన్నాడు: “ఇదిగో, ఈ మానవుడు మేలు కీడులు తెలుసుకోవడంలో మనవంటివాడయ్యాడు. ఇప్పుడతడు తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలాన్ని తీసుకొని, తిని శాశ్వతంగా బ్రతకకూడదు.”

[23] అందుచేత యెహోవాదేవుడు అతణ్ణి ఏదెను తోటనుంచి పంపివేసి అతడు ఏ నేలనుంచి తీయబడ్డాడో దాన్ని సాగు చేయడానికి విధించాడు.

[24] ఆయన ఆ మనిషిని బయటికి పంపించివేశాడు. జీవవృక్షం దగ్గరికి వెళ్ళే మార్గానికి కావలిగా ఉండడానికి కెరూబులనూ అన్ని దిక్కులకూ తిరిగే మంటలాంటి ఖడ్గాన్నీ ఏదెను తోటకు తూర్పుదిక్కున ఉంచాడు.

ఆదికాండం (ఆరంభాలు) — Chapters