Skip to content
Opens in a new window

[1] ఆదాము తన భార్యయైన హవతో ఏకమైనప్పుడు ఆమె గర్భవతి అయి, కయీను అనేవాణ్ణి కన్నది. అప్పుడామె, “యెహోవా దయచేత నాకు కొడుకు కలిగాడు” అంది.

[2] తరువాత ఆమె అతని తమ్ముడు హేబెలును కన్నది. హేబెలు గొర్రెల కాపరి అయ్యాడు. కయీను సేద్యగాడయ్యాడు.

[3] కొంత కాలానికి కయీను పొలం పంటలో కొంత యెహోవాకు నైవేద్యంగా తెచ్చాడు.

[4] హేబెలు కూడా తన మందలో మొదట పుట్టిన వాటిలో నుంచి మంచివాటిని తెచ్చాడు. యెహోవా హేబెలునూ అతని అర్పణనూ అంగీకరించాడు.

[5] గాని, కయీన్నూ అతని నైవేద్యాన్నీ లక్ష్య పెట్టలేదు. అందుచేత కయీనుకు చాలా కోపం వచ్చింది. ముఖం చిన్నబోయింది.

[6] యెహోవా కయీనుతో ఇలా అన్నాడు: “నీకు కోపం ఎందుకు? నీ ముఖం చిన్నబోవడం దేనికి?

[7] నీవు మంచిని చేస్తే తలెత్తుకోవా? మంచిని చేయకపోతే వాకిట పాపం పొంచి ఉంటుంది. నిన్ను మింగివేయాలని దానికి నీమీద ఆశ ఉంది. కాని, నీవు దాన్ని లోబరుచుకోవాలి.”

[8] కయీను తన తమ్ముడు హేబెలుతో ఆ విషయం చెప్పాడు. ఆ తరువాత వారిద్దరూ పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడు హేబెలు పైబడి అతణ్ణి చంపివేశాడు.

[9] యెహోవా కయీనుతో “నీ తమ్ముడు హేబెలు ఎక్కడున్నాడు?” అని అడిగాడు. కయీను “నాకు తెలీదు. నా తమ్ముడికి నేను కావాలివాడినా?” అన్నాడు.

[10] యెహోవా ఇలా అన్నాడు, “నీవు చేసినదేమిటి? నీ తమ్ముని రక్తం స్వరమెత్తి నేలనుంచి నాకు మొరపెట్టుకొంటూ ఉంది.

[11] కనుక నీవు చేతులారా ఒలికించిన నీ తమ్మున్ని రక్తాన్ని తాగడానికి నోరు తెరిచిన ఈ భూభాగంమీద ఉండకుండ ఇప్పుడు నీవు శాపగ్రస్థుడవుతావు.

[12] ఇకనుంచి నీవు భూమిని సాగు చేసేటప్పుడు అది దాని సారం నీకివ్వదు. నీవు లోకంలో దేశదిమ్మరివి అవుతావు.”

[13] కయీను యెహోవాకు ఇలా జవాబిచ్చాడు: “నా శిక్ష నేను సహించలేనంత గొప్పది.

[14] ఇదిగో ఇప్పుడు నీవు నన్ను ఈ ప్రాంతంనుంచి వెళ్ళగొట్టేస్తున్నావు. ఇక నీ ముఖదర్శనం నాకు దొరకదు కూడా. నేను లోకంలో దేశదిమ్మరిని అవుతాను. నేను ఎవరికైనా చిక్కితే నన్ను చంపేస్తారు.”

[15] అయితే యెహోవా అతనితో “కయీన్నూ ఎవరైనా చంపితే ఏడంతలు ప్రతీకారం తప్పదు” అన్నాడు. ఎవ్వరూ కయీనును చూచి అతణ్ణి చంపకుండేలా యెహోవా అతనికి ఒక గుర్తు వేశాడు.

[16] కయీను యెహోవా సముఖంనుంచి ప్రయాణమై పోయి నోదు అనే ప్రాంతంలో నివసించాడు. అది ఏదెనుకు తూర్పు దిక్కున ఉంది.

[17] కయీను తన భార్యతో ఏకం అయినప్పుడు ఆమె గర్భవతి అయి, హనోకును కన్నది. అప్పుడు కయీను ఒక ఊరు నిర్మిస్తూ ఉన్నాడు. దానికి తన కొడుకు పేరునుబట్టి “హనోకు” అనే పేరు పెట్టాడు.

[18] హనోకుకు ఈరాదు జన్మించాడు. ఈరాదుకు మహూయాయేలు జన్మించాడు. మహూయాయేలుకు మతూషాయేలు జన్మించాడు. మతూషాయేలుకు లెమెకు జన్మించాడు.

[19] లెమెకు ఇద్దరు స్త్రీలను పెళ్ళాడాడు. వాళ్ళలో ఒకామె పేరు ఆదా, ఇంకొకామె పేరు సిల్లా.

[20] ఆదా యాబాలును కన్నది. పశువులు కలిగి గుడారాల్లో కాపురమున్న వారికి యాబాలు ఆదిపురుషుడు.

[21] అతని తమ్ముడు యూబాలు. అతడు వేణువు, తంతి వాద్యాలు వాయించేవారికి ఆదిపురుషుడు.

[22] సిల్లాకు కూడా సంతానం కలిగింది – తూబాలుకయీను. అతడు అన్ని విధాల పదునుగల ఇత్తడి, ఇనుప పనిముట్లు చేసేవాడు. తూబాలుకయీను తోబుట్టువు నయామా.

[23] లెమెకు తన భార్యలతో ఇలా అన్నాడు: “ఆదా! సిల్లా! నేను చెప్పేది వినండి. నా భార్యలారా! నా మాటను ఆలకించండి. నన్ను గాయపరచినందుకు ఓ మనిషిని చంపాను. అవును, నన్ను దెబ్బకొట్టినందుకు ఆ యువకుణ్ణి హతమార్చాను.

[24] కయీను విషయంలో ప్రతీకారం ఏడంతలుగా కలిగితే, లెమెకు విషయం డెబ్భై ఏడంతలుగా కలుగుతుంది.”

[25] ఆదాముకు తన భార్యవల్ల మరో కొడుకు జన్మించాడు. ఆమె, “కయీను హేబెలును చంపినందుచేత దేవుడు అతనికి బదులుగా నాకు మరో సంతానాన్ని ప్రసాదించాడు” అనుకొని అతనికి షేతు అనే పేరు పెట్టింది.

[26] షేతుకు కూడా ఒక కొడుకు జన్మించాడు. అతనికి ఎనోషు అనే పేరు పెట్టాడు. అప్పుడు మనుషులు యెహోవా పేరట ప్రార్థించడం మొదలు పెట్టారు.

ఆదికాండం (ఆరంభాలు) — Chapters