[1] ఏశావు సంతతి వాళ్ళ వంశవృక్షం ఇది: ఏశావు అంటే ఎదోం.
[2] ఏశావు ఈ కనాను స్త్రీలను పెళ్ళాడాడు: హేతుజాతివాడైన ఏలోను కూతురు ఆదా, హివ్విజాతివాడైన సిబ్యోను మనుమరాలు అహోలీబామా (ఆమె తల్లి అనా).
[3] అతడు ఇష్మాయేలు కూతురు బాశెమతును కూడా పెళ్ళాడాడు (ఆమె నెబాయోతు సోదరి).
[4] ఏశావుకు ఆదా ఎలీఫజును కన్నది. బాశెమతు రగూయేలును కన్నది.
[5] అహోలీబామా యూషునూ యాలాంనూ కోరాహునూ కన్నది. కనానుదేశంలో ఏశావుకు జన్మించిన కొడుకులు వీరే.
[6] ఏశావు తన తమ్ముడు యాకోబు దగ్గరనుంచి వేరే దేశానికి వెళ్ళిపొయ్యాడు. తన భార్యలనూ కొడుకులనూ కూతుళ్ళనూ తన ఇంట్లో ఉండేవాళ్ళందరినీ తన మందలనూ తన పశువులన్నిటినీ కనానుదేశంలో తనకు కలిగినదంతా తీసుకువెళ్ళాడు.
[7] ఎందుకంటే ఏశావూ యాకోబు ఇద్దరూ కలిసి ఒకే స్థలంలో నివాసం చేయడానికి వీలులేనంత గొప్ప ఆస్తి వారికి ఉండేది. వారికి చాలా పశువులున్నాయి గనుక, వారు పరదేశులుగా నివసించే భూమి వారికి చాలలేదు.
[8] ఏశావు వెళ్ళి శేయీరు కొండసీమలో కాపురమేర్పరచుకొన్నాడు. ఏశావు అంటే ఎదోం.
[9] శేయీరు కొండసీమలో ఉన్న ఎదోంవాళ్ళ ఆదిపురుషుడు ఏశావు. ఆ సంతతివాళ్ళ వంశవృక్షం ఇది:
[10] ఏశావు కొడుకులెవరంటే, ఎలీఫజు (ఏశావు భార్య ఆదా కన్నవాడు). రగూయేలు (ఏశావు భార్య బాశెమతు కన్నవాడు).
[11] ఎలీఫజు కొడుకులు తేమాను, ఓమారు, సెపో, గాతాం, కనజు.
[12] తిమ్నా అనే ఆమె ఏశావు కొడుకు ఎలీఫజుకు ఉంపుడుకత్తె. ఆమె ఎలీఫజుకు అమాలేకును కన్నది. ఏశావు భార్య ఆదా మనుమలు వీరే.
[13] రగూయేలు కొడుకులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జ. ఏశావు భార్య బాశెమతు మనుమలు వీరే.
[14] ఏశావు భార్య అహోలీబామా (ఆమె అనా కూతురు, అనా సిబ్యోను కూతురు) ఏశావుకు కన్న కొడుకులెవరంటే యూషు, యాలాం, కోరహు.
[15] ఏశావు కొడుకుల్లో నాయకుల జాబితా ఇది: ఏశావు పెద్ద కొడుకైన ఎలీఫజు కొడుకులు – తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సెపో నాయకుడు, కనజు నాయకుడు,
[16] కోరహు నాయకుడు, గాతాం నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఎదోం దేశంలో ఎలీఫజు సంతానం. వీరు ఆదా మనుమలు.
[17] ఏశావు కొడుకైన రగూయేలు కొడుకులెవరంటే, నహతు నాయకుడు, జెరహు నాయకుడు, షమ్మా నాయకుడు, మిజ్జ నాయకుడు. ఈ నాయకులు ఎదోం దేశంలో రగూయేలు సంతానం.
[18] వీరు ఏశావు భార్య అహోలీబామా కొడుకులు యూషు నాయకుడు, యాలాం నాయకుడు, కోరహు నాయకుడు. ఈ నాయకులు ఏశావు భార్య అహోలీబామా (అనా కూతురు) సంతానం.
[19] ఏశావు కొడుకులు వీరే, ఏదోంవాళ్ళ నాయకులు వీరే. ఏశావు అంటే ఎదోం.
[20] హోరీజాతివాడైన శేయీరు కొడుకులు కూడా ఆ దేశంలో కాపురముండేవాళ్ళు. వాళ్ళెవరంటే లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దీషాను.
[21] వీరు హోరీవాళ్ళ నాయకులు, ఎదోందేశంలోని శేయీరు సంతానం.
[22] లోతాను కొడుకులు హారీ, హేమీం. లోతాను సోదరి తిమ్నా.
[23] శోబాలు కొడుకులు అల్వాను, మానహదు, ఏబాలు, షపో, ఓనాం.
[24] సిబ్యోను గాడిదలను మేపుతూ అరణ్యంలో వేడి ఊటలు కనుక్కొన్నవాడు.
[25] అనా కొడుకు దిషోను, కూతురు అహోలీబామా.
[26] దిషోను కొడుకులు హెమదాను ఎషబాను, ఇత్రాను, కెరాను.
[27] ఏసెరు కొడుకులు బిలహాను, జవాను, ఆకాను,
[28] దిషోను కొడుకులు ఊజు, అరాను.
[29] హోరీ సంతతివాళ్ళలో నాయకులెవరంటే, లోతాను నాయకుడు, శోబాలు నాయకుడు, సిబ్యోను నాయకుడు, అనా నాయకుడు,
[30] దిషోను నాయకుడు, ఏసెరు నాయకుడు, దీషాను నాయకుడు, వీరు వాళ్ళ వంశాలప్రకారం శేయీరుదేశంలోని హోరీ వాళ్ళ నాయకులు.
[31] ఇస్రాయేల్ ప్రజలమీద ఏ రాజూ పరిపాలించకముందే ఎదోందేశంలో పరిపాలించే రాజులున్నారు. వారెవరంటే,
[32] బెయారు కొడుకు బెల ఎదోంలో పరిపాలించాడు. అతడి ఊరి పేరు దిన్‌హాబా.
[33] బెల చనిపొయ్యాక బొస్రావాడైన జెరహు కొడుకు యోబాబు అతడి స్థానంలో పరిపాలించాడు.
[34] యోబాబు చనిపొయ్యాక తేమవాళ్ళ దేశస్థుడు హుషాం అతడి స్థానంలో పరిపాలించాడు.
[35] హుషాం చనిపొయ్యాక బదదు కొడుకు హదదు అతడి స్థానంలో పరిపాలించాడు. అతడు మోయాబు మైదానాల్లో మిద్యాను జాతివాళ్ళను కొట్టినవాడు. అతడి ఊరి పేరు అవీతు.
[36] హదదు చనిపొయ్యాక మశ్రేకావాడు శమ్లా అతడి స్థానంలో పరిపాలించాడు.
[37] శమ్లా చనిపొయ్యాక యూఫ్రటీస్ నది దగ్గర ఉన్న రెహబోతువాడు షావూలు అతడి స్థానములో పరిపాలించాడు.
[38] షావూలు చనిపొయ్యాక అక్బోరు కొడుకు బయల్‌హానాను అతడి స్థానంలో పరిపాలించాడు.
[39] అక్బోరు కొడుకు బయల్‌హానాను చనిపొయ్యాక హదరు అతడి స్థానంలో పరిపాలించాడు. అతడి ఊరిపేరు పాయు. అతడి భార్య పేరు మహేతబేలు. ఆమె మత్రేదు కూతురు; మత్రేదు మేజహాబు కూతురు.
[40] ఏశావు సంతతివాళ్ళలోని నాయకులు, వాళ్ళ వంశాలు, స్థలాలు, పేర్ల ప్రకారం ఎవరంటే, తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతీతు నాయకుడు,
[41] అహోలీబామా నాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు,
[42] కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు,
[43] మగ్దీయెల్ నాయకుడు, ఈరాం నాయకుడు. వీరు తమకు స్వాధీనమైన దేశంలో తమ తమ నివాస స్థలాల ప్రకారం ఎదోం నాయకులు. ఏశావు ఎదోంవాళ్ళకు ఆదిపురుషుడు.