Skip to content
Opens in a new window

[1] అప్పుడు లోకమంతటా భాష ఒక్కటే, మాటలు ఒకటే.

[2] మనుషులు తూర్పు దిక్కుకు ప్రయాణమై పోయినప్పుడు షీనారు దేశంలో ఒక మైదానం చూచి ఆ స్థలంలో కాపురమేర్పరచుకొన్నారు.

[3] అప్పుడు ఒకడితో ఒకడు “మనం ఇటికలు చేసి బాగా కాల్చుదాం” అని చెప్పుకొన్నారు. వారికి రాళ్ళుగా ఇటికలూ, అడుసుకు మట్టికీలూ ఉన్నాయి.

[4] వాళ్ళు “మనం భూతలమంతటా చెదరిపోకుండేలా ఒక నగరాన్ని కట్టుకుందాం. ఆకాశన్నంటే గోపురం కట్టి మనం పేరు తెచ్చుకుందాం” అని కూడా చెప్పుకొన్నారు.

[5] మానవ సంతానం కట్టుకొంటున్న నగరాన్నీ గోపురాన్నీ చూడడానికి యెహోవా దిగివచ్చాడు.

[6] “ఇదిగో వీరు ఒకే ప్రజ. వీరందరికీ భాష ఒకటే. ఇప్పుడు వీరు ఈ పని చెయ్యడం ఆరంభించారు. ఇక వారు తలపెట్టే ఏ పనికైనా ఆటంకాలు ఉండవు.

[7] రండి దిగిపోదాం. అక్కడ ఒకరి పలుకు ఒకరికి అర్థం కాకుండేలా వారి భాషను తారుమారు చేద్దాం” అన్నాడు యెహోవా.

[8] అందుచేత యెహోవా వాళ్ళను అక్కడనుంచి భూతలమంతటా చెదరగొట్టాడు. వాళ్ళు ఆ నగరాన్ని కట్టడం మానుకొన్నారు.

[9] లోకమంతట్లో ఉండే భాషను యెహోవా అక్కడ తారుమారు చేసినందుచేత ఆ నగరానికి “బాబెలు” అనే పేరు వచ్చింది. యెహోవా వాళ్ళను అక్కడ నుంచి భూతలమంతటా చెదరగొట్టాడు.

[10] షేము సంతతివారి వంశావళి ఇది: జలప్రళయానికి రెండేళ్ళ తరువాత, షేముకు అతని నూరో ఏట అర్పక్షదు జన్మించాడు.

[11] అర్పక్షదు జన్మించిన తరువాత షేము అయిదు వందల సంవత్సరాలు బ్రతికాడు. అతనికి కొడుకులూ కూతుళ్ళూ జన్మించారు.

[12] అర్పక్షదుకు అతని ముప్ఫయి అయిదో ఏట షేలహు జన్మించాడు.

[13] షేలహు జన్మించిన తరువాత అర్పక్షదు నాలుగు వందల మూడేళ్ళు బ్రతికాడు. అతనికి ఇంకా కొడుకులూ, కూతుళ్ళూ జన్మించారు.

[14] షేలహుకు అతని ముప్ఫయ్యో ఏట ఏబెరు జన్మించాడు.

[15] ఏబెరు జన్మించిన తరువాత షేలహు నాలుగు వందల మూడేళ్ళు బ్రతికాడు. అతనికింకా కొడుకులూ, కూతుళ్ళూ జన్మించారు.

[16] ఏబెరుకు అతని ముప్ఫయి నాలుగో ఏట పెలెగు జన్మించాడు.

[17] పెలెగు జన్మించిన తరువాత ఏబెరు నాలుగు వందల ముప్ఫయ్యెళ్ళు బ్రతికాడు. అతనికి ఇంకా కొడుకులూ, కూతుళ్ళూ జన్మించారు.

[18] పెలెగుకు అతని ముప్ఫయ్యో ఏట రయూ జన్మించాడు.

[19] రయూ జన్మించిన తరువాత పెలుగు రెండు వందల తొమ్మిదేళ్ళు బ్రతికాడు. అతనికింకా కొడుకులూ, కూతుళ్ళూ జన్మించారు.

[20] రయూకు అతని ముప్ఫయి రెండో ఏట సెరూగు జన్మించాడు.

[21] సెరూగు జన్మించిన తరువాత రయూ రెండు వందల ఏడేళ్ళు బ్రతికాడు. అతనికింకా కొడుకులూ కూతుళ్ళూ జన్మించారు.

[22] సెరూగుకు అతని ముప్ఫయ్యో ఏట నాహోరు జన్మించాడు.

[23] నాహోరు జన్మించిన తరువాత సెరూగు రెండు వందల యేళ్ళు బ్రతికాడు. అతనికింకా కొడుకులూ, కూతుళ్ళూ జన్మించారు.

[24] నాహోరుకు అతని ఇరవై తొమ్మిదో ఏట తెరహు జన్మించాడు.

[25] తెరహు జన్మించిన తరువాత నాహోరు నూట పందొమ్మిదేళ్ళు బ్రతికాడు. అతనికింకా కొడుకులూ, కూతుళ్ళూ జన్మించారు.

[26] డెబ్భయి ఏళ్ళవాడయ్యాక తెరహుకు అబ్రాము, నాహోరు, హారాను జన్మించారు.

[27] తెరహు సంతతివారి వంశావళి ఇది: తెరహుకు అబ్రాము, నాహోరు, హారాను జన్మించారు. హారానుకు లోత్ జన్మించాడు.

[28] హారాను తన తండ్రి తెరహు సముఖంలో, తాను పుట్టిన దేశంలో, అంటే కల్దీయవారి దేశంలోని ఊర్ పట్టణంలో చనిపొయ్యాడు.

[29] అబ్రాము వివాహమాడాడు. అతడి భార్య పేరు శారై. నాహోరు కూడా వివాహమాడాడు. అతడి భార్య పేరు మిల్కా. ఆమె హారాను కూతురు. హారాను ఇస్కాకు కూడా తండ్రి.

[30] శారై గొడ్రాలు; ఆమెకు పిల్లలు లేరు.

[31] తెరహు తన కొడుకు అబ్రామునూ, తన మనుమడూ హారాను కొడుకూ అయిన లోత్‌నూ, తన కోడలు (తన కొడుకు అబ్రాము భార్య) శారైనీ వెంటబెట్టుకొని కనాను దేశానికి వెళ్ళడానికి కల్దీయవారి దేశంలోని ఊర్‌నుంచి బయలుదేరారు. వారు హారాను చేరి అక్కడ కాపురమున్నారు.

[32] తెరహు జీవించిన కాలం రెండు వందల అయిదేళ్ళు. తెరహు హారానులో చనిపొయ్యాడు.

ఆదికాండం (ఆరంభాలు) — Chapters