Skip to content
Opens in a new window

[1] ఆ తరువాత అబ్రాహాము మరో ఆమెను వివాహమాడాడు. ఆమె పేరు కెతూరా.

[2] ఆమె అతనికి కన్న సంతానం జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు.

[3] యొక్తానుకు షేబ, దదాను జన్మించారు. దదాను కొడుకులు అష్షూరిం, లెతుషిం, లెయుమిం.

[4] మిద్యాను కొడుకులు ఏయిఫా, ఎఫెరు, హానోకు, అబీదా, ఎల్దాయా. వీరంతా కెతూరా సంతతివారు.

[5] అయితే అబ్రాహాము తనకు కలిగినదంతా ఇస్సాకుకే ఇచ్చాడు.

[6] అబ్రాహాము తన ఉంపుడుకత్తెల కొడుకులకు బహుమతులిచ్చి తానింకా బ్రతికి ఉన్నప్పుడే తన కొడుకు ఇస్సాకు దగ్గరనుంచి తూర్పు దిక్కుకు తూర్పు ప్రదేశానికి వాళ్ళను పంపివేశాడు.

[7] అబ్రాహాము బ్రతికిన సంవత్సరాలు మొత్తం నూట డెబ్భై అయిదు.

[8] అబ్రాహాము సుదీర్ఘ జీవితం గడిపి నిండు ముసలితనంలో ప్రాణం విడిచి తన పూర్వీకుల దగ్గరికి చేరాడు.

[9] అతని కొడుకులు ఇస్సాకు, ఇష్మాయేలు మకపేలా గుహలో అతణ్ణి పాతిపెట్టారు. అది హేతువాడైన సోహరు కొడుకు ఎఫ్రోనుకు చెందిన మైదానంలో, మమ్రేకి ఎదురుగానే ఉంది.

[10] అబ్రాహాము హేతు సంతతివాళ్ళ దగ్గర కొనుక్కొన్న ఆ మైదానంలోనే అబ్రాహామునూ, అతని భార్య శారానూ పాతిపెట్టడం జరిగింది.

[11] అబ్రాహాము చనిపోయిన తరువాత అతని కొడుకు ఇస్సాకును దేవుడు దీవించాడు. అప్పుడు ఇస్సాకు బేర్‌లహాయిరోయి దగ్గర కాపురం ఉన్నాడు.

[12] అబ్రాహాము కొడుకు ఇష్మాయేలు సంతతివాళ్ళ వంశవృక్షం: అతణ్ణి అబ్రాహాముకు శారా దాసీ, ఈజిప్ట్ స్త్రీ అయిన హాగరు కన్నది.

[13] ఇష్మాయేలు కొడుకుల పేర్లు వాళ్ళ తరాలప్రకారం ఇవే: ఇష్మాయేలుకు మొదట పుట్టినవాడైన నెబాయోతు, కేదారు, అద్బయేలు, మిబ్షాం,

[14] మిష్మా, దూమా, మశ్శా,

[15] హదరు, తేమా, యెతూరు, నాఫీషు, కెదమా.

[16] ఇష్మాయేలు కొడుకులు వీరే. వారి వారి గ్రామాల ప్రకారమూ కోటల ప్రకారమూ వారి పేర్లు ఇవే. వారు తమ తమ వంశాలకు పన్నెండుగురు నాయకులు.

[17] ఇష్మాయేలు జీవితకాలం నూట ముప్ఫయి ఏడేళ్ళు. అప్పుడతడు ప్రాణం విడిచి తన పూర్వీకుల దగ్గరికి చేరాడు.

[18] అతడి సంతానం హవీలానుంచి షూరువరకు తమ బంధువులను లెక్కచెయ్యకుండా తమ కాపురమేర్పరచుకొన్నారు. షూరు ఈజిప్ట్‌దేశానికి తూర్పుగా అష్షూరుకు వెళ్ళే త్రోవలో ఉంది.

[19] అబ్రాహాము కొడుకు ఇస్సాకు చరిత్ర ఇదే: ఇస్సాకు అబ్రాహాముకు జన్మించినవాడు.

[20] ఇస్సాకు రిబ్కాను పెళ్ళి చేసుకొన్నప్పుడు నలభై ఏళ్ళవాడు. రిబ్కా పద్దన్అరాంలో నివసించే సిరియావాడైన బెతూయేలు కూతురు, సిరియావాడైన లాబాను సోదరి.

[21] తన భార్య గొడ్రాలై ఉండడం చేత ఆమెనిమిత్తం ఇస్సాకు యెహోవాను ప్రార్థించాడు. యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. గనుక రిబ్కా గర్భవతి అయింది.

[22] ఆమె గర్భంలో శిశువులిద్దరు దెబ్బలాడుకొంటూ ఉన్నారు. గనుక ఆమె “ఇలా ఉంటే నేను బ్రతకడం ఎందుకు?” అని చెప్పి యెహోవా ఉద్దేశం తెలుసుకుందామని వెళ్ళింది.

[23] యెహోవా ఆమెకు చెప్పినదేమిటంటే, “నీ గర్భంలో రెండు జనాలు ఉన్నాయి. నీలోనుంచి ఇద్దరు గోత్రకర్తలు వస్తారు. పుట్టుకనుంచే ఒకడంటే రెండోవాడికి గిట్టదు. ఒక గోత్రంకంటే మరో గోత్రం బలంగా ఉంటుంది. పెద్దవాడు చిన్నవాడికి సేవ చేస్తాడు.”

[24] ప్రసవ దినం వచ్చింది. ఆమె గర్భంలో కవల పిల్లలున్నారు.

[25] మొదటివాడు ఎర్రని వాడుగా ఒళ్ళంతటికీ రోమ వస్త్రం చుట్టి ఉన్నట్టు బయటికి వచ్చాడు గనుక అతడికి ఏశావు అనే పేరు పెట్టారు.

[26] తరువాత ఏశావు మడమను పట్టుకొని అతడి తమ్ముడు బయటికి వచ్చాడు గనుక అతడికి యాకోబు అనే పేరు పెట్టారు. ఆమె వారిని కన్నప్పుడు, ఇస్సాకు అరవై ఏళ్ళవాడు.

[27] ఆ పిల్లవారిద్దరూ పెరిగి పెద్దవారయ్యారు. ఏశావు నేర్పుగల వేటగాడై మైదానాల్లో తిరుగుతూ ఉండేవాడు. యాకోబైతే నెమ్మదిపరుడు, డేరాలదగ్గర ఎప్పుడూ ఉండేవాడు.

[28] ఏశావు తెచ్చే మాంసం ఇస్సాకు తినేవాడు, గనుక అతనికి ఏశావు అంటే ప్రేమ. అయితే రిబ్కాకు యాకోబంటే ప్రేమ.

[29] ఒకరోజు యాకోబు ఏదో వంటకం వండాడు. అప్పుడే ఏశావు చాలా అలసిపోయి మైదానం నుంచి వచ్చాడు.

[30] యాకోబుతో “అబ్బ, నేను చాలా అలసిపొయ్యాను. ఆ ఎర్ర ఎర్రగా ఉన్నదాంట్లో కొద్దిగా బావుకోనియ్యి” అన్నాడు ఏశావు. అందుచేత అతడికి ఎదోం అనే పేరు వచ్చింది.

[31] యాకోబు అన్నాడు “మొదట నీ జన్మహక్కు నాకు అమ్మివేయి.”

[32] ఏశావు “ఇప్పుడే చచ్చిపోయేలా ఉన్నాను. జన్మహక్కు నాకెందుకూ?” అన్నాడు.

[33] “మొదట నాకు శపథం చెయ్యి” అన్నాడు యాకోబు. ఏశావు యాకోబుకు శపథం చేసి తన జన్మహక్కు అతనికి అమ్మివేశాడు.

[34] అప్పుడు యాకోబు ఏశావుకు రొట్టె, సిద్ధం చేసిన వంటకం పెట్టాడు. ఏశావు తిని త్రాగి లేచి తన దారిన వెళ్ళాడు. ఈ విధంగా ఏశావు తన జన్మహక్కును కాలదన్ను కొన్నాడు.

ఆదికాండం (ఆరంభాలు) — Chapters