[1] ఆ తరువాత ఈజిప్ట్ చక్రవర్తికి పానపాత్ర అందించేవాడు, వేరు వేరు రొట్టెలు, భక్ష్యాలు చేసేవాడు తమ యజమానియైన ఈజిప్ట్ చక్రవర్తిపట్ల తప్పు చేశారు.
[2] ఫరో ఆ ఇద్దరు ఉద్యోగస్థులమీద – పానపాత్ర అందించేవారిలో ముఖ్యుడిమీదా, రొట్టెలు చేసేవారిలో ముఖ్యుడిమీదా – కోప్పడ్డాడు.
[3] వారిని బందీలుగా రాజు సంరక్షక సేనాధిపతి ఇంట్లో ఉండాలని అతడికి అప్పగించాడు. యోసేపు ఖైదీగా ఉన్న స్థలం అదే.
[4] సేనాధిపతి వాళ్ళకు యోసేపును పరిచారకుడుగా నియమించాడు. గనుక అతడు వాళ్ళకు సేవ చేస్తూ ఉన్నాడు. వాళ్ళు కొంత కాలం అలా కావలిలో ఉన్నారు.
[5] ఒకరాత్రి ఆ ఇద్దరూ, అంటే, ఫరోకు గిన్నె అందించేవాడూ, రొట్టెలు చేసేవాడూ కావలిలో బందీలుగా ఉండగానే, కలలు కన్నారు. ఒకే రాత్రిలో ఒక్కొక్కడు వేరు వేరు భావాల కలలు కన్నారు.
[6] ప్రొద్దున యోసేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు విచారంగా ఉన్నట్టు గమనించాడు.
[7] కనుక అతడు తన యజమాని ఇంట తనతో బందీలుగా కావలిలో ఉన్న ఆ రాజ ఉద్యోగులను చూచి “ఈ వేళ మీరెందుకు ఏడుపు ముఖాలతో ఉన్నారు?” అని అడిగాడు.
[8] అందుకు వాళ్ళు “మాకు కలలు వచ్చాయి. వాటి భావం చెప్పగలవాడెవ్వడూ లేడు” అన్నారు. యోసేపు వాళ్ళతో “కలల భావాలు తెలియజేయడం అనేది దేవుని వశంలోనే ఉంది గదా. అయితే మీరు ఆ కలలు నాకు చెప్పండి” అన్నాడు.
[9] అప్పుడు పానపాత్ర అందించేవాడు తన కల యోసేపుకు వివరించాడు – “నా కలలో ఒక ద్రాక్షచెట్టు నా ఎదుట ఉంది.
[10] ఆ ద్రాక్ష చెట్టుకు మూడు తీగెలున్నాయి. అది అంకురించగానే దాని పువ్వులు వికసించాయి, దాని గెలలు పండి ద్రాక్షపళ్ళయ్యాయి.
[11] ఫరో గిన్నె నా చేతిలో ఉంది. నేనా ద్రాక్షపళ్ళు తీసుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి, ఆ గిన్నె ఫరో చేతికందించాను.”
[12] యోసేపు అతడితో “దాని భావం ఇదే: ఆ మూడు తీగెలు మూడు రోజులు.
[13] ఇంకా మూడు రోజుల లోపల చక్రవర్తి మిమ్మల్ని ఇక్కడనుంచి విడిపించి మీ ఉద్యోగం మీకు మళ్ళీ ఇప్పిస్తాడు. మీరు ఆయనకు పానపాత్ర అందించేవాడుగా ఉన్నప్పుడు చేసినట్టే ఫరో గిన్నె ఆయన చేతికందిస్తారు.
[14] అయితే నీకు క్షేమం కలిగేటప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొని, నామీద దయచూపి, నా విషయం ఫరోతో మాట్లాడి, నన్ను ఈ ఇంటిలోనుంచి విడిపించండి.
[15] ఎందుకంటే, నన్ను హీబ్రూవారి దేశంలోనుంచి దొంగిలించడం జరిగింది. అంతేగాక, ఈ చెరసాలలో నన్ను వేయడానికి ఇక్కడ కూడా నేనేమీ నేరం చేయలేదు” అన్నాడు.
[16] రొట్టెలు చేసేవారిలో ముఖ్యుడు ఆ కల భావం బాగుందని గ్రహించి యోసేపుతో ఇలా చెప్పాడు: “నేను కూడా కల కన్నాను. అందులో తెల్లని పిండి వంటలు గల మూడు గంపలు నా నెత్తిమీద ఉన్నాయి.
[17] పై గంపలో ఫరో కోసం అన్ని రకాల పిండివంటలు ఉన్నాయి గాని, పక్షులు నా నెత్తిమీద ఉన్న గంపలోనుంచి వాటిని తింటూ ఉన్నాయి.”
[18] యోసేపు ఇలా జవాబిచ్చాడు: “దాని భావమిదే – ఆ మూడు గంపలు మూడు రోజులు.
[19] మూడు రోజుల లోపల చక్రవర్తి నీ తలను నరికించివేసి మ్రానుమీద మిమ్మల్ని వ్రేలాడదీయిస్తాడు. పక్షులు నీ మాంసం తింటాయి.”
[20] మూడో రోజున అలాగే జరిగింది. ఆ రోజు ఫరో పుట్టిన రోజు కావడంచేత అతడు తన పరివారంలోని వాళ్ళందరికీ విందు చేయించి, వాళ్ళ సమక్షంలో పానపాత్ర అందించేవాణ్ణీ రొట్టెలు చేసేవాణ్ణీ ఖైదులోనుంచి రప్పించాడు.
[21] పానపాత్ర అందించేవారిలో ఆ ముఖ్యమైనవాడికి అతని ఉద్యోగం మళ్ళీ ఇప్పించాడు. అతడు ఫరో చేతికి గిన్నె అందించడం జరిగింది.
[22] అయితే యోసేపు వాళ్ళకు కల భావం తెలిపినట్టే, రొట్టెలు చేసేవాణ్ణి ఫరో ఉరి తీయించాడు.
[23] అయితే పానపాత్ర అందించేవాడు యోసేపును మనసులో పెట్టుకోకుండా మరిచిపొయ్యాడు.