Skip to content
Opens in a new window

[1] ఇదంతా జరిగాక దేవుడు అబ్రాహామును పరిశోధించాడు. అతణ్ణి “అబ్రాహామూ” అని పిలవగా అతడు “చిత్తం, ప్రభూ” అన్నాడు.

[2] అప్పుడు దేవుడు అన్నాడు, “నీ ఒకే ఒక కొడుకును – నీ ప్రేమ చూరగొన్న కొడుకైన ఇస్సాకును తీసుకొని మోరీయా ప్రదేశానికి వెళ్ళు. అక్కడ నేను నీకు చెప్పబోయే పర్వతం మీద అతణ్ణి హోమబలిగా అర్పించు.”

[3] తెల్లవారగానే అబ్రాహాము లేచి తన గాడిదకు జీను కట్టి పనివాళ్ళలో ఇద్దరినీ, తన కొడుకు ఇస్సాకునూ వెంటబెట్టుకొని, హోమబలికోసం కట్టెలు కొట్టి, బయలుదేరి తనతో దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళాడు.

[4] మూడో రోజున అబ్రాహాము తలెత్తి, దూరంగా ఉన్న ఆ స్థలాన్ని చూచి, పని వాళ్ళతో ఇలా అన్నాడు:

[5] “మీరిక్కడ గాడిదతో ఉండండి. నేనూ, అబ్బాయీ అక్కడికి వెళ్తాం. దేవుణ్ణి ఆరాధించి మీ దగ్గరికి తిరిగి వస్తాం.”

[6] అప్పుడు అబ్రాహాము హోమబలికోసం ఆ కట్టెలు తన కొడుకు ఇస్సాకు మీద ఉంచి. తానే స్వయంగా నిప్పూ, కత్తీ చేతపట్టుకొన్నాడు. వారిద్దరూ కలిసి సాగిపోతూ ఉంటే,

[7] ఇస్సాకు తన తండ్రి అబ్రాహామును ఉద్దేశించి “నాన్నా” అన్నాడు. అబ్రాహాము “ఏం బాబు?” అన్నాడు. “ఇవిగో నిప్పూ కత్తీ ఉన్నాయి గానీ, హోమబలికోసం గొర్రెపిల్ల ఎక్కడ?” అని అడిగాడు ఇస్సాకు.

[8] “దేవుడే హోమబలికోసం గొర్రెపిల్లను చూచుకొంటాడు, బాబూ” అని అబ్రాహాము జవాబిచ్చాడు. అలా వారిద్దరూ కలిసి ముందుకు నడిచారు.

[9] దేవుడు చెప్పిన స్థలానికి వారు చేరుకొన్నప్పుడు అబ్రాహాము అక్కడ ఒక బలిపీఠం కట్టి దానిమీద కట్టెలు చక్కగా పేర్చాడు. తన కొడుకైన ఇస్సాకును బంధించాడు, ఆ పీఠంమీద ఉన్న కట్టెలమీద పెట్టాడు.

[10] అప్పుడు అబ్రాహాము తన కొడుకును వధించడానికి చెయ్యి చాపి కత్తి పట్టుకొన్నాడు.

[11] అప్పుడు అతణ్ణి ఆకాశంనుంచి యెహోవా దూత పిలిచాడు – “అబ్రాహామూ! అబ్రాహామూ!” అతడు “చిత్తం, ప్రభూ” అన్నాడు.

[12] “అబ్బాయి మీద చెయ్యి వేయకు. అతణ్ణేమీ చేయకు. దేవుడంటే నీకు భయభక్తులు ఉన్నాయని ఇప్పుడు నాకు తెలిసిపోయింది. ఎందుకంటే నీ ఒకే ఒక కొడుకును నాకివ్వడానికి వెనక్కు తీయలేదు” అన్నాడా దేవదూత.

[13] అప్పుడు అబ్రాహాము తలెత్తి చూడగా వెనుక దిక్కున పొదలో కొమ్ములు చిక్కుకొన్న ఒక పొట్టేలు కనిపించింది. అబ్రాహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని, తన కొడుకు స్థానంలో హోమబలిగా సమర్పించాడు.

[14] అబ్రాహాము ఆ స్థలానికి “యెహోవా యీరే” అని పేరు పెట్టాడు. ఈనాటి వరకు “యెహోవా పర్వతంమీద చూచుకుంటాడు” అని చెప్తారు.

[15] యెహోవా దూత ఆకాశంనుంచి రెండోసారి అబ్రాహామును పిలిచి ఇలా అన్నాడు:

[16] “నీవిలా చేసి నీ ఒకే ఒక కొడుకును ఇవ్వడానికి వెనక్కు తీయలేదు.

[17] గనుక నేను నిన్ను తప్పనిసారిగా దీవిస్తాను. నీ సంతానాన్ని తప్పక వృద్ధి చేసి, లెక్కకు ఆకాశ నక్షత్రాల్లాగా, సముద్రతీరం ఇసుక రేణువులలాగా చేస్తాను. నీ సంతతివారు శత్రువుల ద్వారాలను స్వాధీనం చేసుకొంటారు.

[18] నీ సంతానం మూలంగా లోకంలోని జనాలన్నీ ధన్యమవుతాయి అని నాతోడని ప్రమాణం చేశాను. ఎందుకంటే, నీవు నా మాట విన్నావు.”

[19] ఆ తరువాత అబ్రాహాము తన పనివాళ్ళ దగ్గరికి తిరిగి వచ్చాడు. వారంతా కలిసి బయలుదేరి బేర్‌షెబా చేరారు. అబ్రాహాము బేర్‌షెబాలో కాపురమున్నాడు.

[20] ఆ విషయాలు జరిగిన తరువాత అబ్రాహాముకు చేరిన వార్త ఏమంటే “నీ తోబుట్టువు నాహోరుకు అతని భార్య మిల్కా పిల్లలను కన్నది.

[21] వారెవరంటే, మొదట పుట్టినవాడు ఊజు, ఇతడి తమ్ముడు బూజ్, అరామ్ తండ్రి కెమూయేల్,

[22] కెసెదు, హజో, పిల్దాషు, యిద్లాపు, బెతూయేలు.”

[23] బెతూయేలుకు రిబ్కా పుట్టింది. ఈ ఎనిమిదిమందిని అబ్రాహాము తోబుట్టువు నాహోరుకు మిల్కా కన్నది.

[24] నాహోరు ఉంపుడుకత్తె కూడా కొడుకులను కన్నది. (ఆమె పేరు రయూమా.) వారు తెబహు, గహము, తహషు, మయకా.

ఆదికాండం (ఆరంభాలు) — Chapters