Skip to content
Opens in a new window

[1] యోసేపు తన తండ్రి మీద వాలి అతని ముఖం ముద్దుపెట్టుకొని కన్నీళ్ళు విడిచాడు.

[2] తరువాత యోసేపు సుగంధ ద్రవ్యాలతో తన తండ్రి మృతదేహాన్ని సిద్ధపరచాలని తన సేవలో ఉన్న వైద్యులకు ఆదేశించాడు. ఆ వైద్యులు ఇస్రాయేల్ మృతదేహాన్ని అలా చేశారు.

[3] ఆ పని పూర్తి చేయడానికి నలభై రోజులు పట్టింది. సుగంధ ద్రవ్యాలతో ఒక మృతదేహాన్ని స్థిరపరచడంలో అంత కాలం పడుతుంది. అతని విషయం ఈజిప్ట్‌వాళ్ళు డెభ్భై రోజులు విలపించారు.

[4] అతని విషయం విలపించే రోజులు గడిచాక యోసేపు ఫరో ఇంటివారిని చూచి, “మీరు నన్ను దయ చూస్తూవుంటే నా పక్షంగా చక్రవర్తితో ఇలా మాట్లాడండి:

[5] ‘నా తండ్రి నా చేత శపథం చేయిస్తూ చెప్పినదేమిటంటే, నేను చనిపోతున్నాను, కనానుదేశంలో నేను నా కోసం తవ్వించుకొన్న సమాధిలో నీవు నన్ను పాతిపెట్టాలి. కనుక దయచేసి నా తండ్రిని సమాధి చేయడానికి నన్ను వెళ్ళనివ్వండి. ఆ తరువాత నేను తిరిగి వస్తాను’ అని చెప్పండి” అన్నాడు.

[6] ఫరో “నీ తండ్రి నీచేత చేయించిన శపథం ప్రకారమే వెళ్ళి, నీ తండ్రిని సమాధి చెయ్యి” అన్నాడు.

[7] యోసేపు తన తండ్రిని పాతిపెట్టడానికి వెళ్ళాడు. అతడే కాదు, ఫరో పరివారమంతా, ఫరో ఇంటి పెద్దలంతా, ఈజిప్ట్ నాయకులంతా,

[8] యోసేపు ఇంటివారంతా, తన అన్నదమ్ములూ, తన తండ్రి ఇంటివారంతా అతనితోపాటు వెళ్ళారు. అయితే తమ చిన్నవాళ్ళనూ మందలనూ పశువులనూ మాత్రమే గోషెన్ ప్రదేశంలో విడిచిపెట్టారు.

[9] రథాలు, రౌతులు కూడా అతనితోపాటు వెళ్ళారు. ఆ సమూహం చాలా పెద్దది.

[10] వారు యొర్దాను నదికి పడమటగా ఉన్న ఆతదు అనే అతడి కళ్ళం దగ్గరికి చేరి, అక్కడ చాలా బిగ్గరగా తీవ్రంగా విలపించారు. యోసేపు తన తండ్రి విషయం ఏడు రోజులు సంతాప దినాలుగా పాటించాడు.

[11] ఆ దేశవాసులైన కనానువాళ్ళు ఆతదు కళ్ళందగ్గర జరుగుతున్న ఆ విలాపాన్ని చూచి, “ఈజిప్ట్ వాళ్ళకు ఇది తీవ్రమైన విలాపమే” అన్నారు. అందుచేత ఆ స్థలానికి “ఆబేల్ మిస్రాయిం” అనే పేరు వచ్చింది. అది యొర్దాను నదికి పడమటగా ఉండేది.

[12] యాకోబు వారికి ఆజ్ఞ ఇచ్చినట్టే అతని కొడుకులు అతని విషయం చేశారు.

[13] కనానుదేశానికి అతని మృతదేహాన్ని తీసుకువెళ్ళారు. అబ్రాహాము తనకు శ్మశాన భూమిగా మమ్రే ఎదుట హిత్తివాడైన ఎఫ్రోను దగ్గర కొనుక్కొన్న మక్పేలా మైదానంలోని గుహలో పాతిపెట్టారు.

[14] యోసేపు తన తండ్రిని సమాధి చేశాక, అతడూ, అతని అన్నదమ్ములూ, అతని తండ్రిని సమాధి చేయడానికి వెళ్ళిన వారంతా తిరిగి ఈజిప్ట్‌కు వచ్చారు.

[15] తమ తండ్రి చనిపోయిన తరువాత యోసేపు అన్నలు, “ఒకవేళ యోసేపు మనల్ని విరోధభావంతో చూచి, మనం అతనికి చేసిన కీడుకు ప్రతీకారం చేసి తీరుతాడేమో” అని చెప్పుకొన్నారు.

[16] కనుక వారు యోసేపుకు ఇలా కబురు పంపారు: “మీ తండ్రి చనిపోయేముందు మాకో ఆజ్ఞ ఇచ్చాడు.

[17] ఏమంటే, ‘మీరు యోసేపుతో ఈ విధంగా చెప్పాలి: నీ అన్నలు నీకు కీడు చేశారు నిజమే గానీ ఇప్పుడు వారి అపరాధాన్నీ పాపాన్నీ క్షమించు’. అందుచేత దయచేసి మీ తండ్రియొక్క దేవుని దాసులమైన మా అపరాధాన్ని క్షమించండి.” వారు చెప్పిన మాటలకు యోసేపు ఏడ్చాడు.

[18] తరువాత అతని అన్నదమ్ములు వచ్చి, అతని ఎదుట సాష్టాంగపడి “మేము మీ దాసులం” అన్నారు.

[19] యోసేపు వారితో “మీకు భయం ఉండకూడదు. నేను దేవుని స్థానంలో లేను గదా.

[20] మీరు నాకు కీడు చేయడానికి ఉద్దేశించారు గాని, ఆ కీడును మేలుకే దేవుడు ఉద్దేశించాడు. అంటే, చాలామందిని సజీవంగా కాపాడడం దేవుని ఉద్దేశం. ఇది ప్రస్తుతం కూడా జరుగుతూ ఉంది గదా!

[21] కనుక మీరు భయం మానండి. నేను మిమ్ములనూ మీ పిల్లలనూ పోషిస్తాను” అన్నాడు. వారిని ఆదరించాడు, వారితో దయగా మాట్లాడాడు.

[22] యోసేపు, అతని తండ్రి కుటుంబంవారూ ఈజిప్ట్‌లోనే ఉండిపొయ్యారు. యోసేపు నూట పదేళ్ళు బ్రతికి,

[23] ఎఫ్రాయిం సంతానాన్ని మూడో తరంవరకు చూడగలిగాడు. మనష్షే కొడుకు మాకీరుకు సంతానం కలిగినప్పుడు వారిని యోసేపు ఒడిలో ఉంచారు.

[24] యోసేపు తన అన్నదమ్ములతో “నేను చనిపోతున్నాను. అయితే దేవుడు మిమ్ములను తప్పక ప్రత్యేకంగా సందర్శించి, ఈ దేశంనుంచి తాను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో శపథపూర్వకంగా ఇస్తానన్న దేశానికి తీసుకువెళ్తాడు” అన్నాడు.

[25] యోసేపు “దేవుడు మిమ్ములను తప్పక ప్రత్యేకంగా సందర్శిస్తాడు. మీరు నా ఎముకలను ఇక్కడనుంచి తీసుకువెళ్ళాలి” అంటూ ఇస్రాయేల్ సంతానంచేత ఒక శపథం చేయించుకొన్నాడు.

[26] యోసేపు నూట పదేళ్ళు బ్రతికి చనిపొయ్యాడు. వారు సుగంధ ద్రవ్యాలతో అతని మృతదేహాన్ని సిద్ధపరచి, ఈజిప్ట్‌దేశంలో ఒక శవపేటికలో ఉంచారు.

ఆదికాండం (ఆరంభాలు) — Chapters