Skip to content
Opens in a new window

[1] అప్పుడు ఇస్రాయేల్ తనకున్నదంతా తీసుకొని ప్రయాణమై బేర్‌షెబాకు చేరుకొన్నాడు. అక్కడ తన తండ్రి ఇస్సాకు యొక్క దేవునికి బలులు సమర్పించాడు.

[2] దేవుడు రాత్రిపూట దర్శనంలో ఇస్రాయేల్‌తో “యాకోబూ! యాకోబూ!” అని పిలిచాడు. అతడు “చిత్తగించు, ప్రభూ” అన్నాడు.

[3] ఆయన అన్నాడు “నేను నీ దేవుణ్ణి. నీ తండ్రి యొక్క దేవుణ్ణి. నేను నిన్ను ఈజిప్ట్‌లో గొప్ప జనంగా చేస్తాను, గనుక అక్కడికి వెళ్ళడానికి భయపడకు.

[4] నీతోకూడా నేను ఈజిప్ట్‌కు వస్తాను. నిన్ను ఇక్కడికి తప్పకుండా తిరిగి తీసుకువస్తాను. యోసేపు సమక్షంలో నీవు చనిపోతావు.”

[5] యాకోబు బేర్‌షెబా నుంచి తరలివెళ్ళాడు. ఇస్రాయేల్ కొడుకులు తమ తండ్రి యాకోబునూ తమ చిన్నవాళ్ళనూ తమ భార్యలనూ, వారిని తీసుకురావడానికి చక్రవర్తి పంపించిన పెద్ద బండ్ల మీద ఎక్కించారు.

[6] వారు కనానుదేశంలో తాము సంపాదించిన పశువులనూ సర్వసంపదలనూ తీసుకొని ఈజిప్ట్‌కు వచ్చారు. యాకోబు, తనతోపాటు అతని సంతతివారంతా వచ్చారు.

[7] అతడు తన కొడుకులనూ తన మనుమలనూ తన కూతుళ్ళనూ తన మనుమరాండ్రనూ – తన సంతానాన్నంతా – ఈజిప్ట్‌కు తీసుకువచ్చాడు.

[8] ఈజిప్ట్‌కు వచ్చిన ఇస్రాయేల్‌వారి పేర్లు – యాకోబు, అతడి కొడుకుల పేర్లు ఇవే:

[9] మొదట పుట్టినవాడు రూబేను. రూబేను కొడుకుల పేర్లు హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ.

[10] షిమ్యోను కొడుకులు యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, షావూలు (షావూలు ఒక కనాను స్త్రీ కన్న కొడుకు).

[11] లేవీ కొడుకులు గెర్షోను, కహాతు, మెరారి.

[12] యూదా కొడుకులు ఏర్, ఓనాను, షేలా, పెరెసు, జెరహు. ఏర్, ఓనాను కనానుదేశంలో చనిపోయారు. పెరెసు కొడుకులు హెస్రోను, హామూల్.

[13] ఇశ్శాకారు కొడుకులు తోలా, పువ్యా, యొబు, షిమ్యోను.

[14] జెబూలూను కొడుకులుసెరెదు, ఏలోను, యాహలేలు.

[15] వీరు పద్దన్ అరాంలో యాకోబుకు లేయా కన్నకొడుకులు. ఆమె అతని కూతురు దీనాను కూడా కన్నది. అతని కొడుకులూ కూతుళ్ళూ అందరూ ముప్ఫయి ముగ్గురు.

[16] గాదు కొడుకులు సిప్యోను, హగ్గి, షూని, ఎస్బోను, ఏరీ, ఆరోదీ, అరేలీ.

[17] ఆషేరు కొడుకులు ఇన్నూ, ఇష్వా, ఇష్వి, బెరీయా. వారి సోదరి శెరహు. బెరీయా కొడుకులు హెబెరు, మల్కీయేల్.

[18] వీరు యాకోబుకు జిల్ఫా కన్నవారు. జిల్పా లాబాను తన కూతురు లేయాకు దాసిగా ఇచ్చిన ఆమె. ఆమెవల్ల ఈ పదహారుమంది యాకోబుకు కలిగిన సంతానం.

[19] యాకోబు భార్య రాహేలు కొడుకులు యోసేపు, బెన్యామీను.

[20] ఈజిప్ట్‌దేశంలో యోసేపుకు మనష్షే, ఎఫ్రాయిం జన్మించారు. ఓను అనే పట్టణానికి యాజిగా ఉన్న పోతీఫెర కూతురు ఆసెనతు వారిని యోసేపుకు కన్నది.

[21] బెన్యామీను కొడుకులు బెల, బేకెరు, అష్బేల్, గెరా, నయమాను, ఏహీ, రోషు, ముప్పీం, హుప్పీం, ఆర్దు.

[22] యాకోబుకు రాహేలు కన్న సంతతివారైన వీరంతా పద్నాలుగుమంది.

[23] దాను కొడుకు హుషీం.

[24] నఫ్తాలి కొడుకులు యహసేల్, గూనీ, యేసెరు, షిల్లేం.

[25] వీరు బిల్హా యాకోబుకు కన్న సంతానం. వారు ఏడుగురు. బిల్హా, లాబాను తన కూతురు రాహేలుకు దాసిగా ఇచ్చిన ఆమె.

[26] యాకోబు కోడళ్ళుగాక, యాకోబు సంతతివారై అతనితోపాటు ఈజిప్ట్‌కు వచ్చినవారంతా అరవై ఆరుగురు.

[27] ఈజిప్ట్‌లో యోసేపుకు జన్మించిన కొడుకులు ఇద్దరు. ఈజిప్ట్‌కు వచ్చిన యాకోబు కుటుంబం వారంతా డెబ్భైమంది.

[28] యాకోబు తనకు గోషెన్‌కు త్రోవ చూపడానికి యూదాను తనకు ముందుగా యోసేపు దగ్గరికి పంపాడు. ఈ విధంగా వారు గోషెన్ ప్రదేశం చేరుకొన్నారు.

[29] యోసేపు తన రథం సిద్ధం చేయించుకొని తన తండ్రి ఇస్రాయేల్‌ను కలుసుకోవడానికి గోషెన్‌కు వచ్చాడు. అతణ్ణి చూడడంతోనే అతణ్ణి కావలించుకొని అలాగే చాలా సేపు ఏడ్చాడు.

[30] అప్పుడు ఇస్రాయేల్ యోసేపుతో “నీవు ఇంకా బ్రతికి ఉన్నావు. నీ ముఖం చూశాను. గనుక ఇప్పుడు చనిపోగలను” అన్నాడు.

[31] వారు పశువులు గలవారు, గొర్రెల కాపరులు. వారు తమ మందలనూ పశువులనూ తమకున్నదంతా తీసుకువచ్చారు గనుక యోసేపు తన అన్నదమ్ములనూ తన తండ్రి కుటుంబం వారినీ చూచి ఇలా అన్నాడు: “నేను ఫరో దగ్గరికి వెళ్ళి మీరు వచ్చిన సంగతి అతనికి తెలియజేసి,

[32] ‘కనాను దేశంలో ఉండిన నా అన్నదమ్ములూ, నా తండ్రి కుటుంబాలవారూ నా దగ్గరికి వచ్చారు’ అంటాను.

[33] తరువాత ఫరో మిమ్ములను పిలిపించి ‘మీదే వృత్తి?’ అని అడిగినప్పుడు

[34] మీరిలా అనాలి: ‘మా పూర్వీకులు పశువుల కాపరులు. చిన్నప్పటినుంచి మీ దాసులమైన మేమూ కాపరులం.’ గొర్రెల కాపరులంటే ఈజిప్ట్‌వాళ్ళకు అసహ్యం గనుక మీరు గోషెన్‌లో కాపురం చేసేలా అలా చెప్పాలి.”

ఆదికాండం (ఆరంభాలు) — Chapters