Skip to content
Opens in a new window

[1] ఆ తరువాత అబ్రాహాము అక్కడనుంచి దక్షిణ ప్రదేశానికి ప్రయాణాలు చేస్తూ, కాదేషుకూ షూరుకూ మధ్య కాపురమేర్పరచుకొని, కొంతకాలం గెరారులో గడిపాడు.

[2] అక్కడ అబ్రాహాము తన భార్య శారాను గురించి “ఈమె నా చెల్లెల”ని చెప్పినందుచేత గెరారు రాజైన అబీమెలెకు తన ఇంటికి శారాను రప్పించుకొన్నాడు.

[3] అయితే రాత్రివేళ దేవుడు కలలో అబీమెలెకుకు దర్శనమై అతడితో “నీవు రప్పించుకొన్న ఆ స్త్రీ కారణంగా నీవు చావాలి. ఎందుకంటే ఆమె ఒక మనిషి భార్య” అన్నాడు.

[4] అబీమెలెకు ఆమె దగ్గరకు వెళ్ళలేదు గనుక ఇలా అన్నాడు: “స్వామీ, నేరం చేయని ప్రజను చంపుతావా?

[5] ‘ఈమె నా చెల్లెల’ని అతడే నాతో చెప్పలేదా? ‘ఈయన నా అన్న’ అని ఆమే చెప్పింది గదా! నేను చేసినదాన్ని యథార్థమైన మనసుతో అమాయకంగా చేశాను.”

[6] అందుకు ఆ కలలో దేవుడు అతనితో, “అవును, నీవు యథార్థమైన మనసుతో అలా చేశావని నాకు తెలుసు. ఈ విషయంలో నీవు నాకు విరోధంగా పాపం చేయకుండా నిన్ను అడ్డగించాను కూడా. అందుచేత నీవు ఆమెను తాకకుండా చేశాను.

[7] ఇప్పుడు ఆ మనిషి భార్యను అతనిదగ్గరకు పంపించు. అతడు ప్రవక్త. నీవు బ్రతికేలా నీకోసం అతడు ప్రార్థన చేస్తాడు. కానీ నీవు ఆమెను పంపించకపోతే నీవూ నీవారంతా తప్పక చస్తారని తెలుసుకో” అన్నాడు.

[8] ఉదయం కాగానే అబీమెలెకు లేచి, తన పరివారాన్నంతా పిలిపించి, వాళ్ళకు ఈ సంగతులన్నీ తెలిపాడు. వాళ్ళకు చాలా భయం వేసింది.

[9] తరువాత అబీమెలెకు అబ్రాహామును పిలువనంపించి “మీరు మాకు చేసినదేమిటి? నామీదికి నా రాజ్యంమీదికి గొప్ప కీడు రప్పించడానికి నేను మీకు విరోధంగా చేసిన దోషమేమిటి? చేయరానివి నా పట్ల జరిగించారు” అన్నాడు.

[10] ఇంకా అబీమెలెకు అబ్రాహామును “ఇలా చేయడానికి ఇక్కడ మీకేం కనిపించింది?” అని అడిగాడు.

[11] అబ్రాహాము ఇలా జవాబిచ్చాడు: “ఈ స్థలంలో దైవభయమేమీ లేదనీ, నా భార్యకోసం నన్ను చంపుతారనీ అనుకొని అలా చేశాను.

[12] అంతేకాక, ఆమె నిజంగా నా చెల్లెలే. నా తల్లి కూతురు కాదు, నా తండ్రి కూతురు. ఆమె నాకు భార్య అయింది.

[13] నేను నా తండ్రి ఇల్లు విడిచి సంచరించేలా దేవుడు చేసినప్పుడు నేను ఆమెతో ఇలా చెప్పాను: మనం ఎక్కడికి చేరుకొన్నా అక్కడ ‘ఈయన నా అన్న’ అని దయచేసి నా గురించి చెప్పు.”

[14] అప్పుడు అబీమెలెకు అబ్రాహాముకు అతని భార్య శారాను అప్పగించి గొర్రెలనూ గొడ్లనూ దాసదాసీలను కూడా అతనికిచ్చాడు.

[15] “ఇదుగో, నా దేశం మీ ఎదుట ఉంది. మీకిష్టమైన చోట కాపురం ఉండండి” అన్నాడు అబీమెలెకు.

[16] అతడు శారాతో, “ఇదిగో, నీ అన్నకు వేయి వెండి నాణేలు ఇచ్చాను. నీవు నిర్దోషివని నీ దగ్గర ఉన్న వారందరి ఎదుట ఈ డబ్బు రుజువుగా ఉంటుంది. ఈ విషయంలో నీకు న్యాయం పూర్తిగా తీరిపోయింది” అన్నాడు.

[17] అబ్రాహాము భార్య శారా కారణంగా దేవుడు అబీమెలెకు భవనంలో ఉన్న స్త్రీలందరినీ గొడ్రాళ్ళుగా చేశాడు.

[18] అయితే అబ్రాహాము అబీమెలెకు పక్షాన దేవునికి విన్నపం చేయడంతో దేవుడు అతణ్ణి బాగు చేశాడు. అతని భార్యకూ దాసీలకూ పిల్లలు పుట్టేలా వారిని కూడా బాగుచేశాడు.

ఆదికాండం (ఆరంభాలు) — Chapters