[1] దేవుడు నోవహునూ అతనితో ఓడలోని సమస్త జీవులనూ పశువులన్నిటినీ జ్ఞాపకం ఉంచుకొన్నాడు. ఆయన భూమిమీద గాలి వీచేలా చేయగా నీళ్ళు తగ్గిపోసాగాయి.
[2] జలాగాధం ఊటలూ, ఆకాశద్వారాలూ మూసుకున్నాయి. ఆకాశం నుంచి ఆ ప్రచండ వర్షం ఆగిపోయింది.
[3] నీళ్ళు భూమిమీదనుంచి క్రమంగా తగ్గిపోతూ ఉన్నాయి. నూట యాభై రోజుల తరువాత ఆ నీళ్ళు తక్కువ అయ్యాయి.
[4] ఏడో నెల పదిహేడో రోజున ఆ ఓడ అరారాత్ పర్వతపంక్తి మీద నిలిచింది.
[5] పదో నెలవరకు నీళ్ళు కొంచెం కొంచెంగా తగ్గిపోతూ ఉన్నాయి. పదో నెల మొదటి రోజున పర్వత శిఖరాలు కనిపించాయి.
[6] నలభై రోజుల తరువాత నోవహు తాను ఓడకు చేసిన కిటికీ తెరచి ఒక బొంతకాకిని బయటకు వదలి పెట్టాడు.
[7] భూమిమీద నీళ్ళు ఆరిపొయ్యేవరకూ ఆ బొంతకాకి అటూ ఇటూ తిరుగుతూ ఉంది.
[8] అప్పుడు భూమిమీది నీరు తగ్గిందో లేదో తెలుసుకోవడానికి నోవహు ఒక పావురాన్ని బయటకు వదలిపెట్టాడు.
[9] అయితే భూతలం అంతటా నీళ్ళుండడంవల్ల దానికి వాలే చోటు దొరకలేదు, గనుక అది ఓడలోకి నోవహు దగ్గరికి తిరిగి వచ్చింది. అతడు చెయ్యి చాచి దాన్ని పట్టుకొని ఓడలోకి తీసుకున్నాడు.
[10] ఇంకో ఏడు రోజులు కనిపెట్టి ఆ పావురాన్ని ఓడలోనుంచి మళ్ళీ బయటకు వదలిపెట్టాడు.
[11] సాయంకాలానికి అది అతనిదగ్గరకి వచ్చింది. అప్పుడే తెంపిన ఆలీవ్ చెట్టు ఆకు దాని నోట ఉంది, గనుక భూమిమీది నీళ్ళు పూర్తిగా తగ్గిపొయ్యాయని నోవహుకు తెలిసింది.
[12] మరో ఏడు రోజులు కనిపెట్టి ఆ పావురాన్ని బయటకు మళ్ళీ వదలిపెట్టాడు. అది అతనిదగ్గరకు తిరిగి రాలేదు.
[13] నోవహు వయసులో ఆరు వందల ఒకటో ఏట మొదటి నెల మొదటి రోజున భూమిమీద నీరు ఆరిపోయింది. నోవహు ఓడ కప్పు తీసివేసి బయటికి చూస్తే భూమి ఆరిపోయి ఉంది.
[14] రెండో నెల ఇరవయ్యేడో రోజున భూమి పూర్తిగా ఆరిపోయింది.
[15] అప్పుడు దేవుడు నోవహుతో ఇలా అన్నాడు:
[16] “నీవు, నీ భార్య, నీ కొడుకులు, కోడళ్ళు ఓడలో నుంచి దిగండి.
[17] నీ దగ్గర ఉన్న సమస్త జీవులనూ – పక్షులనూ పశువులనూ భూమిమీద తిరిగే ప్రతి దాన్నీ – బయటికి తీసుకురా. అవి భూమి అంతటా విస్తరించి, ఫలిస్తూ, సంఖ్యలో అధికం కావాలి.”
[18] నోవహు అతనితో కూడా అతని కొడుకులూ, భార్యా, కోడళ్ళూ బయటికి వచ్చారు.
[19] ప్రతి జంతువూ, భూమిమీద తిరిగే ప్రతిదీ, ప్రతి పక్షి (వాటి వాటి జాతుల ప్రకారం) ఓడ బయటికి వచ్చాయి.
[20] అప్పుడు నోవహు యెహోవాకు ఒక బలిపీఠం కట్టి, అన్ని శుద్ధ జంతువుల్లోనూ పక్షుల్లోనూ కొన్ని తీసుకొని ఆ వేదికపై హోమ బలులు అర్పించాడు.
[21] యెహోవా ఇంపైన సువాసన చూచి మనసులో అనుకున్నాడు: “మనిషి అంతరంగంలో ఉద్దేశాలన్నీ బాల్యం నుంచి చెడ్డవి, గనుక ఇక నేను మనిషి కారణంగా భూమిని మళ్ళీ శపించను. నేనిప్పుడు చేసినట్టు ఇకనుంచి సజీవమైన ప్రతిదానినీ మళ్ళీ నాశనం చేయను.
[22] భూలోకం నిలిచేంతవరకు విత్తనాలు వేసేకాలం, కోతకాలం, చలి, వేడిమి, ఎండకాలం, శీతకాలం, పగలు, రాత్రి ఉంటాయి.”