Skip to content
Opens in a new window

[1] అప్పుడు ఇస్సాకు యాకోబును పిలిపించి ఇలా ఆజ్ఞాపించి దీవించాడు: “నీవు ఈ కనానుదేశంలో ఉన్న స్త్రీలలో ఎవతెనూ పెళ్ళి చేసుకోకూడదు.

[2] లేచి, పద్దన్ అరాంకు, మీ తల్లి యొక్క తండ్రి బెతూయేలు ఇంటికి వెళ్ళి, మీ తల్లి అన్న లాబాను కూతుళ్ళలో ఒకామెను పెళ్ళి చేసుకో.

[3] నీవు అనేక జనాలయ్యేలా అమిత శక్తి గల దేవుడు నిన్ను దీవించి, ఫలవంతంగా చేసి, అనేక సంతతివారిని ప్రసాదిస్తాడు గాక!

[4] దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన దేశాన్ని, అంటే నీవు పరదేశిగా నివసించే ఈ దేశాన్ని నీవు స్వాధీనం చేసుకొనేలా దేవుడు నీకూ నీ సంతానానికీ అబ్రాహాము యొక్క దీవెనను దయచేస్తాడు గాక.”

[5] అప్పుడు ఇస్సాకు పంపివేసిన యాకోబు పద్దన్అరాంలో ఉన్న లాబాను దగ్గరికి వెళ్ళిపోయాడు. లాబాను సిరియావాడైన బెతూయేలు కొడుకు; యాకోబు, ఏశావుల తల్లి రిబ్కాకు అన్న.

[6] యాకోబు పద్దన్ అరాంలో పెళ్ళి చేసుకొనేలా ఇస్సాకు అతణ్ణి దీవించి, అక్కడికి పంపివేశాడనీ, దీవిస్తూ ఉన్నప్పుడు ‘కనాను దేశంలో వున్న స్త్రీలలో ఎవతెనూ పెళ్ళి చేసుకోకూడద’ని ఆజ్ఞాపించాడనీ ఏశావుకు తెలిసిపోయింది.

[7] యాకోబు తన తల్లిదండ్రుల మాట విని, పద్దన్ అరాంకు వెళ్ళిపోయాడనీ,

[8] కనాను దేశం స్త్రీలంటే తన తండ్రి ఇస్సాకుకు ఇష్టం లేదనీ కూడా ఏశావు తెలుసుకున్నాడు.

[9] గనుక అతడు ఇష్మాయేలు దగ్గరికి వెళ్ళి తనకున్న భార్యలు గాక మాహలతు అనే ఇంకో ఆమెను పెండ్లాడాడు. ఆమె అబ్రాహాము కొడుకైన ఇష్మాయేలు కూతురు, నెబాయోతు సోదరి.

[10] యాకోబు బేర్‌షెబానుంచి హారానుకు ప్రయాణమై వెళుతూ ఉన్నాడు.

[11] ఒక చోట చేరి ప్రొద్దు క్రుంకినందుచేత అక్కడ ఆ రాత్రి ఉండిపోయి, అక్కడి రాళ్ళలో ఒకదాన్ని తలక్రింద దిండుగా పెట్టుకొని నిద్రపోయాడు.

[12] అప్పుడు అతనికి ఒక కల వచ్చింది. అందులో ఒక నిచ్చెన భూమిమీద నిటారుగా ఉంది. దాని కొన ఆకాశంవరకూ ఉంది. దానిమీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు.

[13] అంతేగాక, యెహోవా తానే దానికి పైగా నిలబడి ఉండి ఇలా అన్నాడు: “నేను యెహోవాను, నీ తండ్రి అబ్రాహాముకూ, ఇస్సాకుకూ దేవుడను. నీవు పడుకొన్న ఈ భూమిని నీకూ నీ సంతానానికీ ఇస్తాను.

[14] నీ సంతానం లెక్కకు ఇసుక రేణువులలాగా అవుతుంది. నీ సంతానం పడమటగా, తూర్పుగా, ఉత్తరంగా, దక్షిణంగా అన్ని దిక్కులకూ వ్యాపిస్తుంది. నీ మూలంగానూ నీ సంతానం మూలంగానూ లోకంలో ఉన్న వంశాలన్నీ ధన్యం అవుతాయి.

[15] ఇదిగో, నేను నీకు తోడుగా ఉంటాను. నీవు వెళ్ళే ప్రతి స్థలంలో నిన్ను కాపాడుతూ, నిన్ను ఈ దేశానికి తిరిగి వచ్చేలా చేస్తాను. నేను నీ చెయ్యి విడవకుండా నీతో చెప్పిన మాట నిలబెట్టుకొంటాను.”

[16] యాకోబు మేల్కొని, “యెహోవా ఈ స్థలంలో ఉన్నాడు – సందేహం లేదు, గానీ అది నాకు తెలియలేదు” అనుకొన్నప్పుడు అతనికి భయం వేసింది.

[17] “ఈ స్థలం ఎంత భయం కలిగించేది! ఇది దేవుని ఆలయమే గాని వేరొకటి కాదు. ఇది పరలోక ద్వారమే!” అనుకొన్నాడు.

[18] ఉదయం కాగానే యాకోబు లేచి తన తలక్రింద దిండుగా పెట్టుకొన్న ఆ రాయి తీసుకొని జ్ఞాపకార్థ స్తంభంగా నిలిపి దానిపై నూనె పోశాడు.

[19] అతడు ఆ స్థలానికి “బేతేల్” అనే పేరు పెట్టాడు. పూర్వం ఆ ఊరి పేరు లూజు.

[20] అప్పుడు యాకోబు ఒక మొక్కుబడి చేసుకొని ఇలా అన్నాడు:

[21] “నేను క్షేమంగా నా తండ్రి ఇంటికి తిరిగి వచ్చేలా దేవుడు నాకు తోడుగా ఉంటే, నేను వెళ్తున్న తోవలో నన్ను కాపాడుతూ, తినడానికి ఆహారమూ, తొడుక్కోవడానికి బట్టలూ నాకు ప్రసాదిస్తూ వుంటే యెహోవానే నా దేవుడుగా భావించుకొంటాను.

[22] “అలాంటప్పుడు స్తంభంగా నేను నిలిపిన ఈ రాయి ఉన్న స్థలం దేవుణ్ణి ఆరాధించే స్థలం అవుతుంది. నీవు నాకు ప్రసాదించేవాటన్నిట్లో పదో భాగం నీకిచ్చితీరుతాను.”

ఆదికాండం (ఆరంభాలు) — Chapters