Skip to content
Opens in a new window

[1] ఇది ఆదాము వంశవృక్షం. దేవుడు మానవుణ్ణి సృజించి నప్పుడు తన పోలికలో అతణ్ణి చేశాడు.

[2] పురుషుడుగా, స్త్రీగా వారిని సృజించాడు. వారిని సృజించిన రోజున దేవుడు వారిని దీవించి వారి పేరు “మానవులు” అన్నాడు.

[3] ఆదాము నూట ముప్ఫై ఏళ్ళు బ్రతికిన తరువాత తన పోలికలో, తన స్వరూపంలో అతనికి ఒక కొడుకు జన్మించాడు. ఆదాము అతని పేరు “షేతు” అన్నాడు.

[4] షేతు పుట్టిన తరువాత ఆదాము ఎనిమిది వందల ఏళ్ళు బ్రతికాడు. అతనికింకా కొడుకులూ, కూతుళ్ళూ జన్మించారు.

[5] ఆదాము జీవించినకాలం తొమ్మిది వందల ముప్ఫయి ఏళ్ళు. అప్పుడు చనిపోయాడు.

[6] షేతుకు అతని నూట అయిదో ఏట ఎనోషు జన్మించాడు.

[7] ఎనోషు జన్మించిన తరువాత షేతు ఎనిమిది వందల ఏడేళ్ళు బ్రతికాడు. అతనికింకా కొడుకులూ, కూతుళ్ళూ జన్మించారు.

[8] షేతు జీవించినకాలం తొమ్మిది వందల పన్నెండేళ్ళు. అప్పుడు చనిపోయాడు.

[9] ఎనోషుకు అతని తొంభైయో ఏట కేయీనాను జన్మించాడు.

[10] కేయీనాను జన్మించిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదిహేడేళ్ళు బ్రతికాడు. అతనికింకా కొడుకులూ, కూతుళ్ళూ జన్మించారు.

[11] ఎనోషు జీవించినకాలం తొమ్మిది వందల అయిదేళ్ళు. అప్పుడతడు చనిపోయాడు.

[12] కేయీనానుకు అతని డెభ్బైయో ఏట మహలలేలు జన్మించాడు.

[13] మహలలేలు జన్మించిన తరువాత కేయినాను ఎనిమిది వందల నలభై ఏళ్ళు బ్రతికాడు. అతనికి ఇంకా కొడుకులూ కూతుళ్ళూ జన్మించారు.

[14] కేయినాను జీవించినకాలం తొమ్మిదివందల పదేళ్ళు. అప్పుడతడు చనిపోయాడు.

[15] మహలలేలుకు అతని అరవై అయిదో ఏట యెరెదు జన్మించాడు.

[16] యెరెదు జన్మించిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్ఫయి ఏళ్ళు బ్రతికాడు. అతనికింకా కొడుకులూ, కూతుళ్ళూ జన్మించారు.

[17] మహలలేలు జీవించినకాలం ఎనిమిది వందల తొంభై అయిదేళ్ళు, అప్పుడతడు చనిపోయాడు.

[18] యెరెదుకు అతని నూట అయిదో ఏట హనోకు జన్మించాడు.

[19] హనోకు జన్మించిన తరువాత యెరెదు ఎనిమిది వందల ఏళ్ళు బ్రతికాడు. అతనికింకా కొడుకులూ కూతుళ్ళూ జన్మించారు.

[20] యెరెదు జీవించిన కాలం తొమ్మిది వందల అరవై రెండేళ్ళు. అప్పుడు చనిపోయాడు.

[21] హనోకుకు అతని అరవై అయిదో ఏట మెతూషెల జన్మించాడు.

[22] మెతూషెల జన్మించిన తరువాత హనోకు మూడు వందల ఏళ్ళు దేవుని సహవాసంలో నడిచాడు. అతనికింకా కొడుకులూ కూతుళ్ళూ జన్మించారు.

[23] హనోకు జీవించిన కాలం మూడు వందల అరవై అయిదేళ్ళు.

[24] హనోకు దేవుని సహవాసంలో నడిచిన తరువాత దేవుడు అతణ్ణి తీసుకుపోయాడు, గనుక అతడు లేకుండా పోయాడు.

[25] మెతూషెలకు అతని నూట ఎనభైయో ఏట లెమెకు జన్మించాడు.

[26] లెమెకు జన్మించిన తరువాత మెతూషెల ఏడు వందల ఎనభై ఏళ్ళు బ్రతికాడు. అతనికింకా కొడుకులూ కూతుళ్ళూ జన్మించారు.

[27] మెతూషెల జీవించిన కాలం తొమ్మిది వందల అరవై తొమ్మిదేళ్ళు. అప్పుడు చనిపోయాడు.

[28] లెమెకుకు అతని నూట ఎనభై రెండో ఏట ఒక కొడుకు జన్మించాడు.

[29] అతడు ఆ కొడుకుకు నోవహు అనే పేరు పెట్టాడు. ఎందుకంటే, అతడు ఇలా అనుకొన్నాడు: “యెహోవా శపించిన భూమివల్ల కలిగే మా ప్రయాసం, మా కాయకష్టం విషయంలో ఇతడు మమ్ముల్ని ఆదరిస్తాడు.”

[30] నోవహు జన్మించిన తరువాత లెమెకు అయిదు వందల తొంభై అయిదేళ్ళు బ్రతికాడు. అతనికింకా కొడుకులూ కూతుళ్ళూ జన్మించారు.

[31] లెమెకు జీవించిన కాలం ఏడు వందల డెబ్భై ఏడేళ్ళు. అప్పుడు చనిపోయాడు.

[32] నోవహు అయిదు వందల ఏళ్ళు బ్రతికిన తరువాత అతనికి షేము, హాము, యాపెతు జన్మించారు.

ఆదికాండం (ఆరంభాలు) — Chapters