[1] తరువాత యెహోవా తాను చెప్పినట్టే శారాను జ్ఞాపకముంచుకొని తన మాటప్రకారమే ఆమె విషయంలో జరిగించాడు.
[2] అంటే, దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణీత కాలంలో, అబ్రాహాము వృద్ధాప్యంలో, శారా గర్భవతి అయి అతనికి కొడుకును కన్నది.
[3] శారా అబ్రాహాముకు కనిన కొడుకుకు అతడు ఇస్సాకు అనే పేరు పెట్టాడు.
[4] తనకు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం తన కొడుకు ఇస్సాకుకు ఎనిమిదో రోజున అబ్రాహాము సున్నతి చేశాడు.
[5] తనకు ఇస్సాకు జన్మించినప్పుడు అబ్రాహాము వయస్సు నూరేళ్ళు.
[6] అప్పుడు శారా “దేవుడు నాకు నవ్వు కలిగించాడు. దీన్ని వినేవారంతా నాతోపాటు నవ్వుతారు” అంది.
[7] ఆమె ఇంకా అంది, “శారా పిల్లలకు పాలిస్తుందని ఇంతకుముందు అబ్రాహాముతో ఎవరు చెప్పగలిగి ఉండేవాళ్ళు? అయినా, ఆయనకు వృద్ధాప్యంలో కొడుకును కన్నాను.”
[8] ఆ చిన్నవాడు పెరిగి పాలు విడిచాడు. ఇస్సాకు పాలు విడిచిన రోజున అబ్రాహాము గొప్ప విందు చేశాడు.
[9] అప్పుడు, అబ్రాహాముకు ఈజిప్ట్ స్త్రీ హాగరు కన్న కొడుకు ఇస్సాకును ఎగతాళి చేయడం శారా చూచింది.
[10] “ఈ బానిసనూ, దాని కొడుకునూ వెళ్ళగొట్టు. ఈ బానిస కొడుకు నా కొడుకు ఇస్సాకుతోపాటు వారసుడు కాబోడు” అంది.
[11] తన కొడుకు కారణంగా ఈ మాట అబ్రాహామును చాలా బాధించింది.
[12] అయితే దేవుడు అబ్రాహాముతో, “ఆ కుర్రవాడి విషయంలో, బానిస విషయంలో నీకు బాధ ఉండకూడదు. శారా నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేయి. ఎందుకంటే ఇస్సాకు మూలంగా కలిగే సంతానమే నీ సంతానం అనిపించుకుంటారు.
[13] ఆ దాసి కొడుకు కూడా నీ సంతానమే గనుక, అతణ్ణి ఒక జనంగా చేస్తాను” అన్నాడు.
[14] తెల్లవారగానే అబ్రాహాము లేచి రొట్టెనూ, నీళ్ళతో నిండిన తిత్తినీ హాగరుకు ఇచ్చి, ఆమె భుజంమీద పెట్టి, ఆ కుర్రవాణ్ణి కూడా ఆమెకు అప్పగించి ఆమెను పంపివేశాడు. ఆమె వెళ్ళిపోయి, బేర్‌షెబా ఎడారిలో తిరుగుతూ ఉంది.
[15] తిత్తిలో నీళ్ళు అయిపోయినప్పుడు ఆమె ఆ కుర్రవాణ్ణి ఒక పొదక్రింద విడిచిపెట్టింది.
[16] “ఆ కుర్రవాడి చావు నేను చూడలేను” అనుకొని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుంది. అలా కూర్చుండి వెక్కి వెక్కి ఏడ్చింది.
[17] దేవుడు ఆ కుర్రవాడి మొర విన్నప్పుడు దేవుని దూత పరలోకంనుంచి హాగరును పిలిచి ఆమెతో “హాగరూ, నీకేం వచ్చింది? ఆ కుర్రవాడు ఉన్నచోట దేవుడు అతడి మొర విన్నాడు. గనుక భయం పెట్టుకోకు.
[18] లేచి ఆ కుర్రవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకో. అతణ్ణి గొప్ప జనంగా చేస్తాను” అన్నాడు.
[19] అప్పుడామెకు ఒక ఊట కనపడేలా దేవుడు చేశాడు. ఆమె వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి కుర్రవాడికి త్రాగించింది.
[20] దేవుడు ఆ కుర్రవాడికి తోడుగా ఉన్నాడు. అతడు పెరిగి పెద్దవాడై ఎడారిలోనే ఉంటూ విలుకాడయ్యాడు.
[21] అతడు పారాన్ ఎడారిలో ఉంటూ ఉన్నప్పుడు అతని తల్లి ఈజిప్ట్‌దేశం నుంచి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్ళి చేసింది.
[22] ఆ కాలంలోనే అబ్రాహాముతో అబీమెలెకు, అతని సేనాధిపతి ఫీకోలు ఇలా అన్నారు: “నీవు చేసే దానంతట్లో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు.
[23] కనుక మీరు దేవుని పేర నాతో శపథం చెయ్యండి. అంటే, నన్నూ, నా కుమారుణ్ణీ, నా మనుమణ్ణీ మోసం చెయ్యకుండా నేను మీకు చూపిన దయప్రకారమే మీరు పరాయివాడుగా ఉంటున్న ఈ దేశానికీ మాకూ దయ చూపుతూ ఉండండి.”
[24] అబ్రాహాము “శపథం చేస్తాను” అన్నాడు.
[25] అంతకుముందు అబీమెలెకు దాసులు ఒక బావిని బలాత్కారంగా ఆక్రమించుకొన్నారు. దీన్ని గురించి అబ్రాహాము అబీమెలెకును చీవాట్లు పెడితే,
[26] అబీమెలెకు, “ఇలా చేసినదెవరో నాకు తెలీదు. మీరు నాకు చెప్పలేదు. ఈనాటి వరకు ఈ సంగతి వినలేదు” అన్నాడు.
[27] అప్పుడు అబ్రాహాము గొర్రెలనూ, గొడ్లనూ తెప్పించి అబీమెలెకుకు ఇచ్చాడు. వారిద్దరూ ఒక ఒడంబడిక చేసుకొన్నారు.
[28] అబ్రాహాము తన మందనుంచి ఏడు ఆడ గొర్రె పిల్లలను వేరుగా ఉంచినప్పుడు, అబీమెలెకు అతణ్ణి
[29] “మీరు వేరుగా ఉంచిన ఈ ఏడు ఆడ గొర్రె పిల్లల సంగతి ఏమిటి?” అని అడిగాడు.
[30] “నేను ఈ బావిని త్రవ్వించుకున్నానని గుర్తుగా మీరీ ఏడు ఆడ గొర్రెపిల్లలను నానుంచి పుచ్చుకోవాలి” అని జవాబిచ్చాడు అబ్రాహాము.
[31] అక్కడ వారిద్దరూ శపథం చేసుకొన్నందుచేత ఆ స్థలానికి బేర్‌షెబా అనే పేరు వచ్చింది.
[32] అలా వారు బేర్‌షెబాలో ఒడంబడిక చేసుకొన్నాక అబీమెలెకు, అతని సేనాధిపతి ఫీకోల్ అక్కడనుంచి బయలుదేరి ఫిలిష్తీయవారి దేశానికి తిరిగి వెళ్ళారు.
[33] అబ్రాహాము బేర్‌షెబాలో ఒక పిచుల వృక్షాన్ని నాటి, శాశ్వత దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాడు.
[34] తరువాత అబ్రాహాము ఫిలిష్తీయవాళ్ళ దేశంలో అనేక రోజులు గడిపాడు.