[1] తరువాత యాకోబు తన కొడుకులను పిలిపించి ఇలా పలికాడు: “సమకూడండి. చివరి రోజుల్లో మీకు ఏమేమి సంభవిస్తాయో అవి మీకు తెలియజేస్తాను.
[2] యాకోబు కొడుకులారా, రండి. ఆలకించండి. మీ తండ్రి ఇస్రాయేల్ చెప్పేది వినండి.
[3] “రూబేనూ, నీవు నా పెద్ద కొడుకువు, నా బలానివి, నా శక్తి ప్రథమ ఫలానివి. ఘనతలోనూ బలంలోనూ ఆధిక్యంగలవాడివి.
[4] కాని, నీళ్లలాగా అస్థిరుడివి. నీది ఉన్నత స్థాయి కాదు. ఎందుకంటే, నీ తండ్రి యొక్క మంచం మీదికి ఎక్కావు. దాన్ని అపవిత్రం చేశావు. నిజంగా అతడు నా మంచం మీదికెక్కాడు.
[5] షిమ్యోను, లేవీ అన్నదమ్ములే. వారి ఖడ్గాలు దౌర్జన్యం చేసే ఆయుధాలు.
[6] నా ప్రాణమా, వారి కుట్రలో చేరకు. నా హృదయమా, వారి సభలో చేరకు. ఎందుకంటే వారు కోపపడి మనుషులను చంపారు. వినోదంగా ఎడ్ల గుదికాళ్ళ నరం తెగగొట్టారు.
[7] వారి కోపం తీవ్రంగా ఉంది. వారి ఆగ్రహం క్రూరంగా ఉంది. అవి శాపగ్రస్తమైనవి. నేను వారిని యాకోబుప్రజలలో చెదరగొడతాను. ఇస్రాయేల్‌లో పటాపంచలయ్యేలా చేస్తాను.
[8] యూదా, నీ అన్నదమ్ములు నిన్ను స్తుతిస్తారు. నీ చెయ్యి నీ శత్రువుల మెడమీద ఉంటుంది. నీ తండ్రి కొడుకులు నీ ఎదుట సాగిలపడతారు.
[9] యూదా సింహం పిల్లలాంటివాడు. నీవు చీల్చినదాని దగ్గరనుంచి వచ్చావు. సింహంలాగా, ఆడ సింహంలాగా పొంచివుంటాడు. పడుకొని, తల ఎత్తుతాడు; అతణ్ణి రేపడానికి తెగించేవాడెవడు?
[10] ‘షిలోహు’ వచ్చేవరకు యూదా దగ్గరనుంచి రాజదండం పోదు. ఆయన పాదాల మధ్యనుంచి అధికార దండం పోదు. ఆయనకు ప్రజలు విధేయులవుతారు.
[11] ద్రాక్ష చెట్టుకు తన గాడిదను కడతాడు, మేలిరకమైన ద్రాక్షచెట్టుకు తన గాడిద పిల్లను కడతాడు. ద్రాక్షరసంలో తన బట్టలనూ, ద్రాక్షల రసంతో తన దుస్తులనూ ఉతుకుతాడు.
[12] ద్రాక్షరసంకంటే అతని కళ్ళు గాఢమైన రంగు గలవి. పాలకంటే అతని పళ్ళు తెల్లనివి.
[13] జెబూలూను సముద్రతీరం వైపు కాపురముంటాడు. అతని ప్రాంతం ఓడలకు రేవుగా ఉంటుంది. అతని సరిహద్దు సీదోను వైపుకు ఉంటుంది.
[14] ఇశ్శాకారు రెండు పశువుల దొడ్లమధ్య పడుకొని ఉండే బలమైన గార్దభంవంటివాడు,
[15] విశ్రాంతి స్థలం మంచిదనీ, తన ప్రదేశం రమ్యమైనదనీ అతనికి తోస్తుంది, గనుక అతడు బరువులు మోయడానికి తన భుజం వంచుతాడు, చాకిరి చేసే దాసుడవుతాడు.
[16] దాను ఇస్రాయేల్ గోత్రాల్లో ఒక గోత్రంగా ఉండి, తన ప్రజలకు తీర్పు చెప్తాడు.
[17] దాను త్రోవలో పాములాగా, దారిలో గుర్రం గుదికాలును కరచి రౌతు పడేలా చేసే కట్లపాములాగా ఉంటాడు.
[18] యెహోవా, నీవు ప్రసాదించే రక్షణకోసం ఎదురు చూస్తున్నాను.
[19] గాదు విషయమేమంటే, దోపిడిగాళ్ళు అతని పైబడతారు. అతడు వెనుకనుంచి వాళ్ళ పైబడతాడు.
[20] ఆషేరు సంగతంటారా? అతని భోజన పదార్థాలూ శ్రేష్ఠమైనవి. రాజులకు తగ్గ భక్ష్యాలు అతని దగ్గర దొరుకుతాయి.
[21] నఫ్తాలి విడుదల పొందిన లేడిలాగా ఉన్నాడు. మధుర వాక్కులు పలుకుతాడు.
[22] యోసేపు ఫలవంతమైన కొమ్మలాంటివాడు. ఊటదగ్గర ఉండి, దాని రెమ్మలు గోడమీద నుంచి వ్యాపించే ఫలవంతమైన కొమ్మవంటివాడు.
[23] విలుకాళ్ళు అతణ్ణి హింసించారు. బాణాలు వేశారు. అతణ్ణి ద్వేషించారు.
[24] అయితే అతని విల్లు స్థిరంగా ఉంది. అతని చేతులు బలంగా ఉన్నాయి. ఇది యాకోబుయొక్క పరాక్రమశాలి అయిన దేవుని హస్తాలవల్ల అయింది. ఇస్రాయేల్ యొక్క ‘ఆధారశిల’, ‘కాపరి’ అనే వాని పేరట అది అయింది.
[25] నీకు సహాయం చేసే నీ తండ్రి యొక్క దేవునివల్ల, నిన్ను దీవించే అమిత శక్తిగల దేవుని వల్ల అది అయింది. ఆయన నీకు పరంనుంచి వచ్చే ఆశీస్సులను, కింద దాగివున్న జలగాధ ఆశీస్సులను స్తనాల, గర్భాల ఆశీస్సులనూ అనుగ్రహిస్తాడు.
[26] నీ తండ్రి పొందిన ఆశీస్సులు నిత్యమైన పర్వతాలంత ఎత్తుగా ఉన్నాయి. అవి నా పూర్వీకుల ఆశీస్సులకంటే గొప్పవి. ఈ ఆశీస్సులు యోసేపు తలమీద, అతని అన్నదమ్ముల్లో ప్రత్యేకమైన అతని నడినెత్తిమీద ఉంటాయి.
[27] బెన్యామీను చీల్చే తోడేలులాంటివాడు. ఉదయం చంపినదాన్ని తింటాడు. సాయంకాలం దోపిడీ పంచి ఇస్తాడు.”
[28] ఇవన్నీ ఇస్రాయేల్ పన్నెండు గోత్రాలు. వారి తండ్రి వారిని దీవిస్తూ వారితో చెప్పినది ఇదే. ఎవరి దీవెన వారికి తగినదే.
[29] తరువాత అతడు వారికి ఇలా ఆజ్ఞాపించాడు: “నేను నా పూర్వీకుల దగ్గరికి పోతున్నాను. నన్ను నా పూర్వీకులదగ్గర పాతిపెట్టాలి. హిత్తివాడైన ఎఫ్రోను భూమిలోని గుహలో నన్ను పాతిపెట్టాలి.
[30] ఆ గుహ కనానుదేశంలోని మమ్రే ఎదుట ఉన్న మక్పేలా మైదానంలో ఉంది. అబ్రాహాము దాన్నీ, ఆ మైదానాన్నీ హిత్తివాడైన ఎఫ్రోను దగ్గర శ్మశాన భూమికోసం కొనుకొన్నాడు.
[31] అక్కడే అబ్రాహామునూ అతని భార్య శారానూ పాతిపెట్టారు. అక్కడే ఇస్సాకునూ అతని భార్య రిబ్కానూ పాతిపెట్టారు. అక్కడే నేను లేయాను పాతిపెట్టాను.
[32] హేతుజాతివాళ్ళ దగ్గర కొనుక్కొన్న ఆ మైదానాన్నీ అందులోని గుహనూ నేను ఉద్దేశించి మాట్లాడుతున్నాను.”
[33] యాకోబు తన కొడుకులకు ఇలా ఆజ్ఞాపించడం చాలించి, మంచంమీదికి తన కాళ్ళు ముడుచుకొని, ప్రాణం విడిచి, తనవారి దగ్గరికి చేరాడు.