[1] యాకోబుకు లేయా కనిన కూతురు దీనా ఆ ప్రాంతం అమ్మాయిలను చూడడానికి వెళ్ళింది.
[2] ఆ ప్రాంతంలోని నాయకుడు హివ్వి జాతివాడైన హమోరు. అతడి కొడుకు షెకెం దీనాను చూచి ఆమెను ఎత్తుకుపోయి చెరిచి అవమానపరిచాడు.
[3] యాకోబు కూతురు దీనా మీదే అతడి మనస్సు ఉంది. ఆ అమ్మాయి అంటే అతనికి ప్రేమ, గనుక ఆమెతో ఆదరంగా మాట్లాడాడు.
[4] అంతేగాక షెకెం తన తండ్రి హమోరుతో మాట్లాడి “ఈ అమ్మాయిని నాకు పెళ్ళి చెయ్యి” అన్నాడు.
[5] షెకెం తన కూతురును అశుద్ధం చేశాడని యాకోబుకు వినవచ్చింది. తన కొడుకులు తన పశువుల దగ్గర మైదానాల్లో ఉండడం చేత వారు వచ్చేవరకు యాకోబు ఊరుకొన్నాడు.
[6] షెకెం తండ్రి హమోరు యాకోబుతో మాట్లాడదామని అతనిదగ్గరికి వచ్చాడు.
[7] ఈ సంగతి విని యాకోబు కొడుకులు మైదానాల నుంచి వచ్చారు. షెకెం యాకోబు కూతురును చెరిచి, ఇస్రాయేల్ ప్రజల మధ్యలో నీచమైన పని చేసినందుకు, చేయరానిది చేసినందుకు వారికి సంతాపమూ, చాలా కోపమూ ముంచుకు వచ్చాయి.
[8] హమోరు వారితో ఇలా చెప్పాడు: “మీ కూతురంటే నా కొడుకు షెకెంకు ప్రాణం. దయచేసి మీరు ఆమెను అతడికిచ్చి పెళ్ళి చెయ్యండి.
[9] అంతేగాక, మీ పిల్లల్ని మాకిచ్చి, మా పిల్లల్ని మీరు పుచ్చుకొని వియ్యమందుదాం.
[10] మీరు మా దగ్గర కాపురమేర్పరచుకోండి. ఈ ప్రదేశం మీ ఎదుట ఉంది. ఇందులో మీరు నివసించి, వ్యాపారం చేసి, ఆస్తి సంపాదించుకోండి.”
[11] పైగా, దీనాయొక్క తండ్రితోనూ, ఆమె అన్నదమ్ములతోనూ షెకెం “మీరు నన్ను దయతో చూస్తే మీరేం అడిగినా అది ఇస్తాను.
[12] కట్నమూ కానుకా ఎంతైనా అడగండి. మీరు అడిగేదంతా ఇస్తాను. మీరు ఆ అమ్మాయిని మాత్రం నాకివ్వండి” అన్నాడు.
[13] అయితే షెకెం తమ చెల్లెలు దీనాను అశుద్ధం చేసినందుకు యాకోబు కొడుకులు షెకెంకూ అతడి తండ్రికీ కపటంగా ఇలా జవాబిచ్చారు:
[14] “ఇలాంటిదాన్ని మేము చెయ్యలేము. సున్నతి సంస్కారం పొందనివాడికి మా చెల్లెల్ని ఇవ్వలేము. అది మాకు అప్రతిష్ఠ.
[15] మేము మీ మాటకు ఒప్పుకోవాలంటే ఒక షరతు ఉంది. మాలాగే మీలో ప్రతి మగవాడూ సున్నతి పొందితేనే,
[16] మా పిల్లల్ని మీకిస్తాం, మీ పిల్లల్ని చేసుకుంటాం. మీ మధ్యలో కాపురముంటాం. మనమంతా ఒకటి అవుతాం.
[17] కానీ, మీరు మా మాట వినకుండా సున్నతి పొందకుండా ఉంటే మా పిల్లను తీసుకువెళ్తాం.”
[18] ఈ మాటలు హమోరుకూ, హమోరు కొడుకుకూ నచ్చాయి.
[19] యాకోబు కూతురంటే ఆ అబ్బాయికి చాలా ప్రేమ, గనుక వారి మాటల ప్రకారం చేయడానికి ఆలస్యం చెయ్యలేదు. తన తండ్రి ఇంటివారందరిలో అతడే ఘనుడు కూడా.
[20] హమోరు, అతడి కొడుకు షెకెం తమ ఊరి ద్వారానికి వెళ్ళి, ఆ ఊరివారితో ఇలా చెప్పారు:
[21] “ఆ మనుషులు మనతో స్నేహంగా ఉన్నారు. గనుక వాళ్ళను ఈ ప్రదేశంలో ఉండనిచ్చి వ్యాపారం చెయ్యనియ్యండి. ఈ ప్రదేశం వాళ్ళకు కూడా చాలినంత విశాలంగా ఉంది. వాళ్ళ పిల్లల్ని పెళ్ళాడి, మన పిల్లల్ని వాళ్ళకిద్దాం.
[22] అయితే మన మధ్యలో నివసించి మనతోపాటు ఒకే ప్రజ కావడానికి ఆ మనుషులు ఒకే షరతుమీద ఒప్పుకుంటారట. ఆ షరతేమిటంటే, వాళ్ళలాగే మనలో ప్రతి మగవాడూ సున్నతి పొందితీరాలి.
[23] వాళ్ళ పశువులూ, ఆస్తీ, మందలన్నీ మనవే అవుతాయి గదా! అంచేత మనం వాళ్ళ మాటకు ఒప్పుకుందాం. అప్పుడు వాళ్ళు మన మధ్యలో కాపురముంటారు.”
[24] కనుక అతడి ఊరిద్వారం గుండా వెళ్ళేవారంతా హమోరు, అతడి కొడుకు షెకెం చెప్పిన మాటకు ఒప్పుకొన్నారు. అప్పుడు ఆ ఊరిద్వారం గుండా వెళ్ళేవారిలో మగవాళ్ళంతా సున్నతి పొందారు.
[25] మూడో రోజున వాళ్ళు బాధ పడుతూ ఉంటే, యాకోబు కొడుకుల్లో ఇద్దరు, అంటే దీనా సొంత అన్నలు షిమ్యోను, లేవీ తమ ఖడ్గాలు చేతపట్టుకొని దొంగచాటుగా ఆ ఊరిపైబడి మగవాళ్ళందరినీ హతమార్చారు.
[26] వారు హమోరునూ అతడి కొడుకు షెకెంనూ కూడా కత్తితో చంపి షెకెం ఇంట్లోనుంచి దీనాను తీసుకుపొయ్యారు.
[27] అక్కడివాళ్ళు తమ చెల్లెలును అశుద్ధం చేసినందుచేత యాకోబు మిగతా కొడుకులు హతమైన వాళ్ళదగ్గరికి వెళ్ళి ఆ ఊరు దోచుకొన్నారు.
[28] వారి గాడిదలనూ, పశువులనూ, మందలనూ, ఊళ్ళో ఉన్నదీ, పొలాల్లో ఉన్నదీ పట్టుకొన్నారు.
[29] వారి ద్రవ్యమంతా పట్టుకొని వారి పిల్లలందరినీ వారి స్త్రీలనూ చెరపట్టి వారి ఇండ్లలో ఉన్నదంతా కూడా కొల్లగొట్టారు.
[30] యాకోబు షిమ్యోనునూ లేవీనీ చూచి “మీరు నా నెత్తిమీదికి కీడు తెచ్చిపెట్టి, ఈ దేశంలో నివసిస్తున్న కనాను జాతివాళ్ళలో, పెరిజ్జి జాతివాళ్ళలో నా పేరును చెడగొట్టారు. నావారు కొద్దిమందే, గనుక వాళ్ళు గుమికూడి నాపైబడి నన్ను చంపుతారు. నేనూ నా ఇంటివారూ నాశనం అవుతాం” అన్నాడు.
[31] అందుకు వారు “మా చెల్లెల్ని అతడు పడుపు స్త్రీగా ఎంచి వ్యవహరించడం న్యాయమా?” అని బదులు చెప్పారు.