Skip to content
Opens in a new window

[1] యాకోబు తలెత్తి చూస్తూ ఉంటే ఏశావూ అతనితోపాటు నాలుగు వందలమంది వస్తూ కనిపించారు.

[2] అప్పుడతడు తన పిల్లలను లేయాకూ రాహేలుకూ ఇద్దరు దాసీలకూ అప్పగించాడు. ముందర దాసీలనూ వాళ్ళ పిల్లలనూ, వాళ్ళ వెనుక లేయానూ ఆమె పిల్లలనూ, ఆ వెనుక రాహేలునూ యోసేపునూ ఉంచాడు.

[3] తానేమో వారికి ముందుగా వెళ్తూ తన అన్న దగ్గరికి చేరే వరకు ఏడుసార్లు నేలకు వంగాడు.

[4] ఏశావు అతణ్ణి కలుసుకోవడానికి పరుగెత్తి ఆలింగనం చేసుకొన్నాడు. కావలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఇద్దరూ ఏడ్చారు.

[5] ఏశావు తలెత్తి ఆ స్త్రీలనూ పిల్లలనూ చూచి “నీతో ఉన్న వీళ్ళెవరు?” అని అడిగాడు. “మీ సేవకుడైన నాకు దేవుడు ప్రసాదించిన పిల్లల”ని అతడు జవాబిచ్చాడు.

[6] అప్పుడు ఆ దాసీలూ వారి పిల్లలూ దగ్గరగా వచ్చి సాగిలపడ్డారు.

[7] లేయా, ఆమె పిల్లలు కూడా దగ్గరగా వచ్చి సాగిలపడ్డారు. చిట్టచివర యోసేపూ, రాహేలూ దగ్గరగా వచ్చి సాగిలపడ్డారు.

[8] ఏశావు అన్నాడు “నాకు ఎదురుగా ఆ గుంపంతా ఎందుకు వచ్చినట్టు?” యాకోబు “నా యజమానులు మీరు. మమ్మల్ని దయ చూచేందుకు అది మా కానుక” అన్నాడు.

[9] ఏశావు “తమ్ముడా, నాకు చాలినంత ఉంది. నీది నీవే ఉంచుకో” అన్నాడు.

[10] “అలా కాదండి, మీకే గనుక నామీద దయ ఉంటే నేనిచ్చే కానుక పుచ్చుకోండి. దేవుని ముఖం చూచినట్టు మీ ముఖం చూశాను. మీరు నన్ను కటాక్షించి స్వీకరించారు కూడా.

[11] నేను మీ దగ్గరికి తెచ్చిన కానుకను దయచేసి పుచ్చుకోండి. దేవుడు నా మీద అనుగ్రహం చూపాడు, గనుక నాకు కావలసినంతా ఉంది” అన్నాడు యాకోబు. బలవంతం మీద ఏశావు దాన్ని పుచ్చుకొన్నాడు.

[12] అప్పుడు ఏశావు “ప్రయాణం సాగిద్దాం పద. నేను నీకు ముందుగా సాగుతాను” అన్నాడు.

[13] అందుకు యాకోబు “ఈ పిల్లలు ఏమంత బలంగా లేరనీ, ఈ మందలు పిల్లలకు పాలిస్తున్నవి గనుక వాటి విషయం నేను శ్రద్ధ తీసుకోవాలనీ నా యజమానులైన మీకు తెలుసు గదా. ఒక్క రోజైనా ఎక్కువగా వాటిని తోలామంటే మందంతా చస్తుంది.

[14] దయచేసి నా యజమానులైన మీరు మీ సేవకుడైన నాకు ముందుగా వెళ్ళండి. నేను నా యజమానులైన మీ దగ్గరకు శేయీరు ప్రాంతానికి వచ్చేదాకా మెల్లగా ప్రయాణిస్తాను. నా ముందర ఉన్న ఈ మందలూ, పిల్లలూ నడవగలిగిన కొద్దీ ప్రయాణం సాగిస్తాను” అన్నాడు.

[15] ఏశావు “అలాగైతే నా దగ్గర ఉన్నవాళ్ళలో కొంతమందిని నీ దగ్గర ఉండనియ్యి” అన్నాడు. అందుకతడు “అదంతా ఎందుకు? మీరు నన్ను దయ చూస్తే నాకు అదే చాలు” అన్నాడు.

[16] ఆ రోజే ఏశావు తన దారి పట్టి శేయీరుకు తిరిగి వెళ్ళాడు.

[17] యాకోబైతే సుక్కోతు అనే స్థలానికి ప్రయాణమైపోయి అక్కడ తనకొక ఇల్లు కట్టుకొని తన పశువులకు పాకలు వేశాడు. అందుచేత ఆ చోటికి సుక్కోతు అనే పేరు వచ్చింది.

[18] యాకోబు పద్దన్అరాం నుంచి వచ్చాక కనానుదేశంలో ఉన్న షెకెం అనే ఊరి చివరికి సురక్షితంగా చేరి ఆ ఊరి ముందు తన డేరా వేసుకొన్నాడు.

[19] అంతేగాక, తన డేరా వేసిన మైదానం హమోరు కొడుకుల దగ్గర నూరు వెండి నాణేలకు కొనుక్కొన్నాడు. హమోరు షెకెం అనే అతడికి తండ్రి.

[20] యాకోబు అక్కడ బలివేదిక కట్టి దానికి ‘ఎల్ ఎలోహేయి ఇస్రాయేల్’ అనే పేరు పెట్టాడు.

ఆదికాండం (ఆరంభాలు) — Chapters