Skip to content
Opens in a new window

[1] షీనారు దేశం రాజైన అమ్రాపేలు, ఎల్లాస రాజైన అర్యోక్, ఏలాం రాజైన కదొరులాయోమెరు, గోయీం రాజైన తిదాల్ ఏలేకాలంలో జరిగినదేమంటే,

[2] వాళ్ళు సొదొమ రాజైన బెరాతొనూ, గొమొర్రా రాజైన బిర్షాతోనూ, అద్మా రాజైన షినాబ్‌తోనూ, సెబోయీంరాజైన షెమేబెరుతోనూ, బెలరాజుతోనూ (బెలను సోయర్ కూడా అంటారు) యుద్ధం జరిగించారు.

[3] వీరంతా కలిసి సిద్దీం లోయకు వచ్చారు. “సిద్దీం” అంటే “ఉప్పు సముద్రం.”

[4] పన్నెండేళ్ళుగా వారు కదొరులాయోమెరుకు లొంగి ఉన్నారు. గానీ, పదమూడో సంవత్సరంలో వాళ్ళు తిరగబడ్డారు.

[5] పద్నాలుగో సంవత్సరంలో కదొరులాయోమెరు, అతడి పక్షాన ఉన్న రాజులు వచ్చి అష్తారోత్ కర్నాయింలో రెఫాయిం జాతివారిని, హాములో జూజీం జాతివారిని, షావేకర్యాతాయింలో ఏమీం జాతివారిని ఓడించారు.

[6] హోరి జాతివాళ్ళను కూడా శేయీరు కొండ సీమలో ఓడగొట్టి ఎడారిదగ్గర ఉన్న ఏల్‌పారాను వరకు తరిమారు.

[7] అక్కడ నుంచి వెనక్కు తిరిగి ఏన్ మిష్పాతుకు, అంటే, కాదేషుకు చేరి, అమాలేకు జాతివాళ్ళ ప్రాంతమంతటినీ, హస్సోనుతామారులో కాపురమున్న అమోరీ జాతివాళ్ళను కూడా ఓడించారు.

[8] సొదొమ రాజూ, గొమొర్రా రాజూ, అద్మా రాజూ, సెబోయీం రాజూ, బెల రాజూ (అంటే సోయర్ రాజు) బయలుదేరి వాళ్ళతో యుద్ధం చేయడానికి సిద్దీం లోయలో సైన్యవ్యూహం సిద్ధం చేశారు.

[9] ఏలాం రాజు కదొరులాయోమెరు, గొయీం రాజు తిదాల్, షీనారు రాజు అమ్రాపేలు, ఎల్లాస రాజు అర్యోకు – ఈ నలుగురు రాజులకూ ఆ అయిదుగురు రాజులకూ మధ్య యుద్ధం జరిగింది.

[10] సిద్దీం లోయ అంతా తారు గుంటల మయంగా ఉంది. సొదొమ రాజూ గొమెర్రా రాజూ పారిపోయి అక్కడ పడ్డారు. మిగతా వాళ్ళు పర్వతాలకు పరుగెత్తారు.

[11] ఆ నలుగురు రాజులు సొదొమ గొమొర్రాల సొత్తునంతా, వాళ్ళ భోజన పదార్థాలన్నీ పట్టుకుపోయారు.

[12] వాళ్ళు అబ్రాము తమ్ముని కొడుకైన లోత్‌ను కూడా, అతని సొత్తునంతా పట్టుకుపోయారు. లోత్ సొదొమలో కాపురముండేవాడు.

[13] తప్పించుకొన్న ఒక మనిషి వచ్చి హీబ్రూవాడైన అబ్రాముకు ఈ సంగతి తెలియజేశాడు. అబ్రాము అమోరీవాడైన మమ్రే సిందూర వృక్షాల దగ్గర కాపురముండేవాడు. మమ్రే, ఎష్కోల్, అనేరు అన్నదమ్ములు. వీళ్ళంతా అబ్రాముతో పరస్పర సహాయంకోసం సంధి చేసుకొన్నవారు.

[14] తన సమీప బంధువుణ్ణి బందీగా తీసుకువెళ్ళిన సంగతి అబ్రాము చెవిని పడడంతోనే అతడు తన పరివారంలో నిపుణులైన మనుషులను మూడు వందల పద్ధెనిమిది మందిని వెంటబెట్టుకొని, దాను వరకు ఆ రాజులను తరిమాడు.

[15] అక్కడ అతడు తన దాసులను గుంపులుగా చేశాక వారంతా రాత్రివేళ ఆ రాజుల సేనపైబడి, కొట్టి, హోబా వరకు తరిమారు. హోబా దమస్కు పట్టణానికి పడమటగా ఉంది.

[16] అబ్రాము ఆ సొత్తునంతా, తన సమీప బంధువుడైన లోత్‌నూ అతడి సొత్తునూ, స్త్రీలనూ, జనాన్నీ తీసుకువచ్చాడు.

[17] కదొరులాయోమెరునూ అతడితో ఉన్న రాజులనూ హతమార్చి, తిరిగి వస్తూ ఉన్నప్పుడు సొదొమ రాజు అతణ్ణి కలుసుకోవడానికి షావే లోయ వరకు వెళ్ళాడు. (షావేలోయ అంటే “రాజులోయ.”)

[18] అంతేగాక, షాలేం నగరం రాజైన మెల్కీసెదెకు రొట్టెలనూ ద్రాక్షరసాన్నీ తీసుకువచ్చాడు. అతడు సర్వాతీతుడైన దేవుని యాజి.

[19] ఆయన అబ్రామును దీవిస్తూ ఇలా అన్నాడు: “ఆకాశాలనూ, భూమినీ సృజించిన సర్వాతీతుడైన దేవుడు అబ్రామును దీవిస్తాడు గాక.

[20] నీ శత్రువులను నీ చేతికప్పగించిన సర్వాతీతుడైన దేవునికి స్తుతులు కలుగుతాయి గాక.” అబ్రాము ఆయనకు అన్నిట్లో పదో భాగమిచ్చాడు.

[21] సొదొమ రాజు అబ్రాముతో “ఆ వ్యక్తుల్ని నాకిచ్చి, సొత్తును మీరే తీసుకోండి” అన్నాడు.

[22] అబ్రాము సొదొమ రాజుకు ఇలా జవాబు చెప్పాడు: “‘నేను అబ్రామును ధనికుడుగా చేశాన’ని మీరు చెప్పకుండేలా నేను ఒక్క దారం పోగు గానీ, పాదరక్ష తాడు గానీ, మీదాంట్లో దేన్నీ గానీ తీసుకోను.

[23] తీసుకోనని నా చెయ్యి ఎత్తి ఆకాశాలనూ, భూమినీ సృజించిన సర్వాతీతుడైన యెహోవాదేవునితో ప్రమాణం చేశాను.

[24] ఈ యువకులు తిన్నది గాక, నాతో వెళ్ళిన అనేరు, ఎష్కోల్, మమ్రేలకు రావలసిన భాగాలను వారిని తీసుకోనివ్వండి.”

ఆదికాండం (ఆరంభాలు) — Chapters