Skip to content
Opens in a new window

[1] యాకోబు తన తండ్రి పరదేశిగా కాపురమున్న కనానుదేశంలో నివసించాడు.

[2] యాకోబు సంతానాన్ని గురించిన విషయాలివి: యోసేపు తన అన్నలతో – తన తండ్రి భార్యలైన బిల్హా, జిల్పా కొడుకులతో – మందలను మేపేవాడు. అప్పుడతడు పదిహేడేళ్ళవాడు. వాళ్ళ చెడుతనాన్ని గురించి వాళ్ళ తండ్రి దగ్గరికి వచ్చి చెప్పాడు యోసేపు.

[3] యోసేపు ఇస్రాయేల్ వృద్ధాప్యంలో జన్మించిన కొడుకు గనుక తన కొడుకులందరిమీదకంటే యోసేపు మీద ఎక్కువ ప్రేమ ఉంది. అతడు యోసేపు కోసం రంగుచారల నిలువుటంగీ కుట్టించాడు.

[4] యోసేపు అన్నలు తమ తండ్రికి తమ అందరి మీద కంటే అతనిమీద ఎక్కువ ప్రేమ ఉండడం చూచి యోసేపును ద్వేషిస్తూ, అతనితో ఎప్పుడూ కసురుకుంటూ మాట్లాడేవారు.

[5] తరువాత వారికి యోసేపు మీద ద్వేషం ఎక్కువైంది. ఎందుకంటే అతడు ఒక కల కని అది వారికి ఇలా తెలియజేశాడు:

[6] “నాకు వచ్చిన ఈ కలను మీరు వినండి.

[7] అందులో మనం పొలంలో పనలు కడుతూ ఉంటే నా పన లేచి నిలువుగా నిలబడింది. అప్పుడు మీ పనలు నా పన చుట్టూ చేరి దానికి సాగిలపడ్డాయి.”

[8] అతని అన్నలు అతనితో “నువ్వు మమ్మల్ని నిజంగా ఏలుతావా? మామీద అధికారం చేస్తానంటావా!” అన్నారు. అతని కలలనుబట్టీ మాటలను బట్టీ అతని అన్నలు అతణ్ణి మరీ ఎక్కువగా ద్వేషించారు.

[9] యోసేపు మరో కల కని అది కూడా తన అన్నలకు వివరిస్తూ “వినండి, మరో కల నాకు వచ్చింది. అందులో సూర్యమండలమూ, చంద్రగోళమూ పదకొండు నక్షత్రాలూ నాకు సాగిలపడడం జరిగింది” అన్నాడు.

[10] అతడు దాన్ని తన తండ్రితోనూ అన్నలతోనూ చెప్పాడు. అతని తండ్రి అతణ్ణి చీవాట్లు పెట్టి, “నీవు కన్న ఈ కల ఏమిటీ అంట? నేనూ మీ తల్లీ నీ అన్నలూ వచ్చి నీకు సాగిలపడడం నిజంగా జరుగుతుందంటావా!” అన్నాడు.

[11] అతని అన్నలకు అతడంటే అసూయ. అతని తండ్రి అయితే ఆ సంగతి మనసులో ఉంచుకొన్నాడు.

[12] యోసేపు అన్నలు తమ తండ్రి మందను షెకెం ప్రాంతంలో మేపడానికి వెళ్ళారు.

[13] ఇస్రాయేల్ యోసేపుతో “నీ అన్నలు షెకెం ప్రాంతంలో మందను మేపుతున్నారు గదా! రా, నిన్ను వారిదగ్గరకు పంపుతాను” అన్నాడు. అతడు “సరే” అన్నాడు.

[14] అప్పుడు ఇస్రాయేల్ “నీవు వెళ్ళి నీ అన్నల క్షేమమూ మంద క్షేమమూ తెలుసుకొని తిరిగి వచ్చి నాతో చెప్పు” అని అతనితో చెప్పి అతణ్ణి హెబ్రోనులోయలో నుంచి పంపాడు.

[15] అతడు షెకెం చేరుకొని మైదానంలో ఇటూ అటూ తిరుగుతూ ఉన్నప్పుడు అతణ్ణి ఒక వ్యక్తి చూచి “నువ్వు ఏం వెదుకుతున్నావు?” అని అడిగాడు.

[16] అందుకతడు “నా అన్నల్ని వెదుకుతున్నాను. వారెక్కడ మందను మేపుతున్నారో దయచేసి నాకు చెప్పగలరా?” అన్నాడు.

[17] “వాళ్ళు ఇక్కడనుంచి వెళ్ళిపోయారు. ‘దోతానుకు వెళదాం పదండి’ అని వాళ్ళు చెప్పుకోవడం విన్నాను” అన్నాడా వ్యక్తి. యోసేపు తన అన్నల కోసం వెళ్ళి దోతానులో వారిని చూశాడు.

[18] వారతణ్ణి దూరం నుంచి చూచి అతడు దగ్గరికి వచ్చేలోగా అతణ్ణి చంపుదామని కుట్ర పన్నారు.

[19] “ఇడుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!

[20] వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం పట్టండి. తరువాత వాణ్ణి దుష్టమృగం మింగేసిందని చెపుదాం. అప్పుడు వాడి కలలు ఏమవుతాయో చూద్దాం” అని ఒకడితో ఒకడు మాట్లాడుకొన్నారు.

[21] అయితే రూబేను ఆ సంగతి విని, “మనం వాణ్ణి చంపకూడదు” అని చెప్పి వాళ్ళవల్ల యోసేపుకు ప్రాణాపాయం కలగకుండా చేశాడు.

[22] అతడింకా వారితో “హత్య వద్దు. వాడికి హాని ఏమీ చేయకుండా ఈ అరణ్యంలో, ఈ గుంటలో అతణ్ణి పడద్రోయండి” అన్నాడు. వాళ్ళవల్ల ప్రాణాపాయం కలగకుండా యోసేపును విడిపించి తండ్రి దగ్గరికి తీసుకు పోవచ్చనుకొన్నాడు.

[23] యోసేపు తన అన్నల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళతణ్ణి పట్టుకొని, అతని అంగీ, అంటే అతడు తొడుగుకొన్న ఆ రంగు చారల నిలువుటంగీ ఊడదీసి,

[24] అతణ్ణి ఆ గుంటలో పడద్రోశారు. అది ఖాళీ గుంట. అందులో నీళ్ళేమీ లేవు.

[25] అప్పుడు వాళ్ళు భోజనానికి కూర్చున్నారు. తలెత్తి చూశారు. గిలాదునుంచి వస్తూ ఉన్న వర్తకులైన బాటసారుల గుంపు కనిపించింది. వాళ్ళు సుగంధ ద్రవ్యం, సువాసన తైలం, బోళం ఒంటెలమీద వేసుకొని ఈజిప్ట్‌కు వెళ్తున్న ఇష్మాయేల్ జాతివాళ్ళు.

[26] యూదా తన అన్నదమ్ములతో “మనం మన తమ్ముణ్ణి చంపి వాడి హత్యను కప్పిపుచ్చడం వల్ల ఏమి లాభం?

[27] ఈ ఇష్మాయేలువాళ్ళకు వాణ్ణి అమ్మేద్దాం పదండి. వాడు మన తమ్ముడు, మన రక్తసంబంధి గదా! వాడికేమీ హాని చేయకూడదు” అన్నాడు. అందుకు అతడి అన్నదమ్ములు ఒప్పుకొన్నారు.

[28] ఇంతలో మిద్యాను దేశ వర్తకులు అటు వైపు వచ్చారు. అతడి అన్నలు యోసేపును ఆ గుంటలో నుంచి తీసి ఆ ఇష్మాయేలువాళ్ళకు ఇరవై తులాల వెండికి అమ్మివేశారు. వాళ్ళు యోసేపును ఈజిప్ట్‌కు తీసుకువెళ్ళారు.

[29] తరువాత రూబేను ఆ గుంటదగ్గరికి తిరిగి వచ్చి చూస్తే అందులో యోసేపు లేడు. కనుక అతడు తన బట్టలు చింపుకొని,

[30] తన తమ్ముళ్ళ దగ్గరికి తిరిగి వచ్చి, “చిన్నవాడు లేడే! అయ్యో! నాకేమిటి దారి!” అన్నాడు.

[31] అప్పుడు వాళ్ళు ఒక మేకపోతును చంపి దాని నెత్తురులో యోసేపు అంగీని ముంచి,

[32] ఆ చారల నిలువుటంగీ తమ తండ్రి దగ్గరికి పంపారు. దాన్ని తెచ్చినవాళ్ళు “ఇది మాకు దొరికింది. ఇది మీ కొడుకుదో కాదో చూడండి” అన్నారు.

[33] యాకోబు దాన్ని గుర్తుపట్టి “ఈ అంగీ నా కొడుకుదే! దుష్టమృగం వాణ్ణి మింగేసిందే! యోసేపు చీల్చబడ్డాడు. సందేహం లేదు” అన్నాడు.

[34] అతడు తన బట్టలు చింపుకొని నడుముకు గోనెపట్ట కట్టుకొని చాలా రోజులు తన కొడుకు విషయం శోకించాడు.

[35] అతని సంతానమంతా అతణ్ణి ఓదార్చడానికి ప్రయత్నించారు. గానీ అతడు ఓదార్పును నిరాకరించి, “నేను శోకిస్తూనే మృత్యులోకానికి నా కొడుకు దగ్గరికి వెళ్తాను” అన్నాడు. యోసేపు తండ్రి అతడికోసం అలా ఏడ్చాడు.

[36] మిద్యానువాళ్ళు యోసేపును ఈజిప్ట్‌కు తీసుకువెళ్ళి పోతీఫరు అనే వ్యక్తికి అతణ్ణి అమ్మివేశారు. ఈ పోతీఫరు ఫరో దగ్గర ఉద్యోగస్తుడు, ఫరో సంరక్షక సేనాధిపతి.

ఆదికాండం (ఆరంభాలు) — Chapters