[1] యోసేపు వెళ్ళి ఫరోతో “నా తండ్రి, నా అన్నదమ్ములు వారి మందలతోను, పశువులతోను, వారికున్న దానంతటితోనూ కనానుదేశంనుంచి వచ్చారు. ఇప్పుడు వారు గోషెన్ ప్రదేశంలో ఉన్నారు” అన్నాడు.
[2] అంతకుముందు యోసేపు తన అన్నదమ్ముల్లో అయిదుగురిని తీసుకువచ్చాడు; ఇప్పుడు వారిని ఫరో ఎదుట పెట్టాడు.
[3] చక్రవర్తి అతని అన్నదమ్ములను “మీదే వృత్తి?” అని అడిగాడు. వారు ఫరోతో, “మీ దాసులైన మేము గొర్రెల కాపరులం. మా పూర్వీకులు కూడా కాపరులు” అన్నారు.
[4] వారు ఫరోతో ఇంకా అన్నారు, “మేము ఈ దేశంలో కొంత కాలం ఉండడానికి వచ్చాం. కనానుదేశంలో కరవు తీవ్రంగా ఉంది గనుక అక్కడ మీ దాసులైన మా మందలకు మేత లేదు. దయ చేసి మీ దాసులైన మమ్మల్ని గోషెన్ ప్రదేశంలో కాపురముండడానికి సెలవు ఇప్పించండి.”
[5] యోసేపుతో ఫరో “నీ తండ్రీ, అన్నదమ్ములూ నీ దగ్గరికి వచ్చారు.
[6] ఈజిప్ట్‌దేశం నీ ఎదుట ఉంది. ఈజిప్ట్‌లోని అన్ని ప్రదేశాల్లో మంచిదానిలో నీ తండ్రినీ అన్నదమ్ములనూ నివసించేలా చెయ్యి. వారు గోషెన్‌లో కాపురం చేయవచ్చు. వారిలో ఎవరైనా సమర్ధులని నీకు తోస్తే వారిని నా మందలకు ముఖ్యమైన కాపరులుగా చెయ్యి.”
[7] తరువాత యోసేపు తన తండ్రి యాకోబును లోపలికి తీసుకువచ్చి ఫరో ఎదుట పెట్టాడు. యాకోబు ఫరోను దీవించాడు.
[8] చక్రవర్తి “మీ వయసెంత?” అని యాకోబు నడిగితే, యాకోబు ఫరోతో,
[9] “నా జీవితయాత్ర నూట ముప్ఫయి సంవత్సరాలు. నేను బ్రతికిన రోజులు కొద్దే; అవి దౌర్భాగ్యమైనవి. అవి నా పూర్వీకుల జీవితయాత్రల్లోని సంవత్సరాలన్ని కాలేదు” అన్నాడు.
[10] యాకోబు ఫరోను దీవించి అతడి సముఖంనుంచి బయటికి వెళ్ళాడు.
[11] ఫరో ఆజ్ఞ ఇచ్చినట్టే యోసేపు తన తండ్రికీ, అన్నదమ్ములకూ ఈజిప్ట్ దేశం అంతటా మంచి ప్రదేశంలో, అంటే రామెసేసు ప్రదేశంలో, భూమి ఇచ్చి నివాసస్థలం ఏర్పరచాడు.
[12] పైగా, యోసేపు తన తండ్రినీ తన అన్నదమ్ములనూ తన తండ్రి కుటుంబంవారందరినీ పోషిస్తూ, వారి వారి పిల్లల లెక్క ప్రకారం వారికి భోజన పదార్థాలిస్తూ వచ్చాడు.
[13] ఆ కరవు చాలా తీవ్రంగా ఉండడంచేత ఆ దేశంలో ఆహారం ఎక్కడా లేకపోయింది. కరవువల్ల ఈజిప్ట్‌దేశమూ కనానుదేశమూ దుర్భలమైన స్థితికి వచ్చాయి.
[14] ధాన్యం కోసం ప్రజలు డబ్బు తెస్తూ వచ్చారు. ఇలా యోసేపు ఈజిప్ట్ దేశంలోనూ కనానుదేశంలోనూ దొరికే డబ్బంతా పోగుచేసి, దాన్ని చక్రవర్తి భవనంలోకి తెప్పించాడు.
[15] ఈజిప్ట్ దేశంలోనూ కనానుదేశంలోనూ ఉన్న డబ్బంతా ఖర్చు చేశాక ఈజిప్ట్‌వాళ్ళంతా యోసేపు వద్దకు వచ్చి “మాకు ఆహారం ఇప్పించండి. మీ ఎదుట మేమెందుకు చనిపోవాలి. మా డబ్బంతా అయిపోయింది” అన్నారు.
[16] “సరే, మీ డబ్బంతా అయిపోయిందంటే మీ పశువుల్ని ఇవ్వండి. మీ పశువులకు బదులుగా ధాన్యమిస్తాను” అన్నాడు యోసేపు.
[17] కనుక వాళ్ళు తమ పశువులను యోసేపు దగ్గరకు తెచ్చారు. యోసేపు వాళ్ళ గుర్రాలనూ గొర్రెల మందలనూ పశువుల మందలనూ గాడిదలనూ తీసుకొని వాళ్ళకు భోజన పదార్థాలిచ్చాడు. ఆ సంవత్సరం వాళ్ళ మందలన్నిటికీ బదులుగా అతడు ధాన్యమిచ్చి వాళ్ళను పోషించాడు.
[18] ఆ సంవత్సరం గడిచాక మరుసటి ఏట వాళ్ళు అతని దగ్గరికి వచ్చి ఇలా అన్నారు: “మా డబ్బంతా అయిపోయింది. ఆ సంగతి మా యజమానులైన మీ నుంచి దాచలేము. మా పశువుల మందలన్నీ కూడా మా యజమానులైన మీవి అయ్యాయి. మా యజమానులైన మీ ఎదుట మిగిలినది మా శరీరాలూ మా భూములూ మాత్రమే.
[19] మీ కళ్ళెదుట మా భూములూ మేమూ ఎందుకు నశించాలి? ఆహారమిచ్చి మమ్మల్నీ, మా భూముల్నీ కొనండి. మా భూములతోపాటు మేము చక్రవర్తికి దాసులమవుతాం. మేము బ్రతికేట్టు మాకు విత్తనాలివ్వండి. అప్పుడు మేము చావము, ఈ దేశం పాడైపోదు.”
[20] ఈ విధంగా యోసేపు ఈజిప్ట్ భూములన్నిటినీ చక్రవర్తి కోసం కొన్నాడు. ఆ కరవు ఈజిప్ట్ వాళ్ళకు తీవ్రంగా ఉండడంవల్ల ప్రతి ఒక్కడూ తన పొలం అమ్మాడు. ఇలా ఆ భూమి అంతా చక్రవర్తిది అయిపోయింది.
[21] తరువాత యోసేపు ఈజిప్ట్‌లో ఆ కొననుంచి ఈ కొనవరకు ఉన్న ప్రజలందరినీ ఊళ్ళలోకి రప్పించాడు.
[22] యాజుల భూములను మాత్రం అతడు కొనలేదు. ఎందుకంటే, యాజులకు చక్రవర్తి బత్తెం నియమించాడు. వాళ్ళు తమకు ఫరో ఇచ్చిన ఆహారం తినేవాళ్ళు గనుక తమ భూములను అమ్మలేదు.
[23] యోసేపు ప్రజలతో అన్నాడు, “చూడండి, ఈ రోజు మిమ్మల్నీ మీ భూములనూ చక్రవర్తి కోసం కొన్నాను. ఇదిగో, మీకు విత్తనాలు. పొలాల్లో విత్తండి.
[24] పంటలో అయిదో భాగం మీరు చక్రవర్తికివ్వాలి. నాలుగు భాగాలు మీవి అవుతాయి. అవి పొలాల్లో మళ్ళీ విత్తడం కోసం, మీకూ, మీ పిల్లలకూ మీ కుటుంబంవారికీ ఆహారం కోసం ఉంటాయి.”
[25] వాళ్ళు “మీవల్లే మా ప్రాణాలు దక్కాయి. మా యజమానులైన మీరు మమ్మల్ని దయ చూస్తే మేము చక్రవర్తికి దాసులమవుతాం” అన్నారు.
[26] అయిదో భాగం చక్రవర్తిది అని యోసేపు ఈజిప్ట్ దేశానికి చట్టం నియమించాడు. అది నేటివరకు నిలిచి ఉన్నది. యాజుల భూములు మాత్రమే చక్రవర్తివి కాలేదు.
[27] ఇస్రాయేల్‌ప్రజలు ఈజిప్ట్‌లో గోషెన్ ప్రదేశంలో నివసించారు. అందులో వారికి ఆస్తి లభించింది. అనేక మంది పిల్లలు పుట్టారు. వారి సంఖ్య చాలా ఎక్కువయింది.
[28] యాకోబు ఈజిప్ట్‌లో నివసించినది పదిహేడేళ్ళు. యాకోబు జీవించిన కాలం నూట నలభై ఏడు సంవత్సరాలు.
[29] ఇస్రాయేల్ అవసాన కాలం దగ్గరపడగా అతడు తన కొడుకు యోసేపును పిలిపించి, “నీవు నన్ను అభిమానంతో చూస్తుంటే నా పట్ల నిజమైన దయతో వ్యవహరిస్తావని నీ చెయ్యి నా తొడక్రింద ఉంచి శపథం చెయ్యి – నన్ను ఈజిప్ట్‌లో పాతిపెట్టకు.
[30] నా పితరుల దగ్గర నా శరీరం ఉండేలా నన్ను ఈజిప్ట్ నుంచి తీసుకువెళ్ళి, వారి శ్మశాన భూమిలో పాతిపెట్టు” అన్నాడు.
[31] యోసేపు “సరే, నీవు చెప్పినట్టే చేస్తాను” అన్నాడు. యాకోబు “నాకు శపథం చెయ్యి” అన్నాడు. అతడు శపథం చేశాడు. అప్పుడు ఇస్రాయేల్ తన పడకమీద పడుకొని దేవుణ్ణి ఆరాధించాడు.