Skip to content
Opens in a new window

[1] అబ్రాము భార్య శారై అతనికి సంతానాన్ని కనలేదు. ఆమెకు దాసి ఉంది. పేరు హాగరు. ఆమెది ఈజిప్ట్ దేశం.

[2] శారై అబ్రాముతో “చూశారా, నేను పిల్లల్ని కనకుండా యెహోవా చేశాడు. మీరు నా దాసి దగ్గరికి వెళ్ళండి. ఒకవేళ ఆమెమూలంగా నాకు పిల్లలు కలుగుతారు” అంది. అబ్రాము శారై మాట విన్నాడు.

[3] ఇది అబ్రాము కనానుదేశంలో పదేళ్ళు కాపురమున్న తరువాత జరిగిన సంగతి. అతని భార్య శారై ఈజిప్ట్‌దేశానికి చెందిన తన దాసి హాగరును తన భర్త అబ్రాముకు భార్యగా ఇచ్చింది.

[4] అతడు హాగరుతో పోయినప్పుడు ఆమె గర్భవతి అయింది. తాను గర్భవతి అయిన సంగతి తెలుసుకొన్నప్పుడు ఆమె యజమానురాలిని చిన్న చూపు చూచింది.

[5] అప్పుడు శారై అబ్రాముతో అంది, “మీకు నా ఉసురు కొడుతుంది! నేను నా దాసిదాన్ని మీ కౌగిట చేర్చాను. తను గర్భం ధరించిన సంగతి తెలుసుకున్నాక నన్ను చిన్న చూపు చూచింది. నాకూ మీకూ మధ్య యెహోవా న్యాయం చేకూరుస్తాడు గాక!”

[6] అబ్రాము శారైతో “ఇదిగో, నీ దాసి నీ చేతిలో మనిషే, ఆమెను ఏమైనా చేసుకోవచ్చు. నీ ఇష్టం” అన్నాడు. శారై ఆమెను బాధపెట్టింది. గనుక ఆమె శారై దగ్గరనుంచి పారిపోయింది.

[7] ఆమె ఎడారిలో, షూరు ప్రదేశానికి పోయే దారిలోని నీటిబుగ్గదగ్గర ఉన్నప్పుడు యెహోవా దూత ఒకడు ఆమెదగ్గరికి వచ్చాడు.

[8] “హాగరూ, శారై దాసీ, నీవు వచ్చినది ఎక్కడనుంచి? వెళుతున్నది ఎక్కడికి?” అని అడిగాడు. ఆమె “నా యజమానురాలు శారై దగ్గర్నుంచి పారిపోయి వచ్చానండి” అంది.

[9] ఆ దూత ఆమెతో అన్నాడు, “నీ యజమానురాలి దగ్గరికి తిరిగి వెళ్ళి ఆమెకు లోబడి ఉండు.”

[10] ఆ దేవదూత ఇంకా అన్నాడు, “నీ సంతానాన్ని ఇంకా అధికం చేసితీరుతాను. లెక్క పెట్టలేనంతమంది అవుతారు వారు.”

[11] ఆ దేవదూత ఇంకా అన్నాడు, “ఇప్పుడు నీవు గర్భవతివి. నీవు మగబిడ్డను కంటావు. అతనికి ఇష్మాయేల్ అనే పేరు పెట్టు. ఎందుకంటే యెహోవా నీ బాధ చూశాడు.

[12] నీ కొడుకు అడవిగాడిదలాంటివాడుగా తయారవుతాడు. అతడికి తక్కినవారందరికీ మధ్య పరస్పర విరోధం ఉంటుంది. అయితే అతడు తన సమీప బంధువులదగ్గర కాపురముంటాడు.”

[13] ఆమె తనతో మాట్లాడిన యెహోవాకు “నీవు చూస్తున్న దేవుడివి” అనే పేరు పెట్టింది. ఎందుకంటే ఆమె “ఇక్కడ సహా నన్ను చూచిన దేవుడు నాకు కనిపించాడా!” అంది.

[14] అందుచేత అక్కడి బావిని “బెయెర్ లహాయి రోయి” అంటారు. అది కాదేషుకూ బెరెదుకూ మధ్య ఉంది.

[15] తరువాత హాగరు అబ్రాముకు ఒక కొడుకును కన్నది. అబ్రాము హాగరు కన్న తన కొడుకుకు ఇష్మాయేల్ అనే పేరు పెట్టాడు.

[16] అబ్రాముకు హాగరు ఇష్మాయేల్‌ను కన్నప్పుడు అతని వయస్సు ఎనభై ఆరేళ్ళు.

ఆదికాండం (ఆరంభాలు) — Chapters