[1] అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నీవు ఫరోదగ్గరకు వెళ్ళి ఈ విధంగా చెప్పు – హీబ్రూవారి దేవుడైన యెహోవా చెప్పేదేమిటంటే, నా ప్రజ నన్ను ఆరాధించి సేవించడానికి వారిని వెళ్ళనియ్యి.
[2] నీవు వారిని వెళ్ళనియ్యడానికి ఒప్పుకోకుండా ఇంకా వారిని ఆపుతూ ఉంటే,
[3] యెహోవా తన చెయ్యి చాపి చాలా బాధకరమైన తెగులును పంపుతాడు. ఆ తెగులు పొలాల్లో ఉన్న నీ పశువులకూ గుర్రాలకూ గాడిదలకూ ఒంటెలకూ ఎడ్లకూ గొర్రెలకూ తగులుతుంది.
[4] అయితే యెహోవా ఇస్రాయేల్‌ప్రజల పశువులకూ ఈజిప్ట్‌వాళ్ళ పశువులకూ మధ్య భేదం కనపరుస్తాడు. ఇస్రాయేల్ వారికి ఉన్నవాటన్నిట్లో ఏదీ చావదు.”
[5] యెహోవా సమయాన్ని నిర్ణయించి “రేపు యెహోవా ఈ దేశంలో ఇలా జరిగిస్తాడు.” అన్నాడు.
[6] మరుసటి రోజు యెహోవా అలాగే జరిగించాడు కూడా. ఈజిప్ట్‌వాళ్ళ పశువులన్నీ చచ్చాయి గాని ఇస్రాయేల్‌ప్రజల పశువులలో ఒక్కటైనా చావలేదు.
[7] ఇస్రాయేల్‌వారి పశువుల్లో ఒక్కటి కూడా చావలేదని ఫరో విచారించి తెలుసుకొన్నాడు. అంతేగాని ఫరో గుండె ఇంకా బండబారిపోయేవుంది.
[8] అప్పుడు యెహోవా మోషే అహరోనులతో “మీరు కొలిమిలోనుంచి పిడికిళ్ళ బూడిద తీసుకొని ఫరో చూస్తుండగానే మోషే దాన్ని ఆకాశంవైపు విసిరివెయ్యాలి.
[9] బూడిద ఈజిప్ట్ దేశమంతటిమీద సన్నని దుమ్ము అవుతుంది: అది ఈజిప్ట్‌దేశంలో అంతటా మనుషులమీదా జంతువులమీదా చీము పట్టే కురుపులవుతుంది” అన్నాడు.
[10] గనుక వారు కొలిమిలోనుంచి బూడిద తీసుకొని ఫరో ఎదుట నిలబడ్డారు. మోషే దాన్ని ఆకాశంవైపు విసరివేసినప్పుడు అది మనుషులమీదా జంతువులమీదా చీము పట్టే కురుపులయింది.
[11] ఆ కురుపులు ఈజిప్ట్‌వాళ్ళందరికి వచ్చినట్టే మాంత్రికులకు కూడా వచ్చాయి. గనుక వారు మోషే ఎదుట నిలబడలేకపొయ్యారు.
[12] అయితే ఫరో గుండె బండబారిపోయేలా యెహోవా చేశాడు. యెహోవా మోషేతో చెప్పిన ప్రకారమే అతడు వారి మాటను నిర్లక్ష్యం చేశాడు.
[13] తరువాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “తెల్లవారగానే నీవు లేచి వెళ్ళి ఫరో ఎదుట నిలబడి అతడితో ఈ విధంగా చెప్పు – హీబ్రూవారి దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, నా ప్రజ నన్ను ఆరాధించి సేవించడానికి వారిని వెళ్ళనియ్యి.
[14] లేకపోతే, లోకమంతట్లో నావంటివాడెవడూ లేడని నీవు తెలుసుకొనేలా ఈసారి నేను నా విపత్తులన్నీ నీమీదికీ నీ పరివారం మీదికీ నీ ప్రజలమీదికీ రప్పిస్తాను.
[15] ఇంతకుముందు నేను నా చెయ్యి చాపి నిన్నూ నీ ప్రజనూ విపత్తుతో కొట్టి ఉంటే మీరు భూమిమీద లేకుండా నాశనమై ఉండేవారే.
[16] అయితే నేను నీకు నా బలాన్ని ప్రదర్శించాలి, నా పేరు విశాలలోకంలో ప్రచురం కావాలి. ఈ కారణంచేతనే నిన్ను బ్రతకనిచ్చాను.
[17] నీవింకా నా ప్రజను వెళ్ళనియ్యకుండా వారికి విరోధంగా మిడిసి పడుతున్నావు.
[18] ఇదిగో విను. రేపు ఈ వేళకు నేను చాలా బాధకరమైన వడగండ్లను కురిపిస్తాను. ఈజిప్ట్‌లో దాని ఆరంభంనుంచి ఇదివరకు అలాంటి వడగండ్లు పడలేదు.
[19] అందుచేత ఇప్పుడు నీవు నీ పశువులనూ పొలాల్లో ఉన్న నీ ఆస్తినంతా భద్రమైన స్థలానికి రప్పించాలి. లోపలికి రాకుండా వెలుపల ఉండే ప్రతి మనిషిమీదా ప్రతి జంతువుమీదా వడగండ్లు పడి చంపివేస్తాయి.”
[20] ఫరో సేవకులలో ఎవరైతే యెహోవా మాటకు భయపడ్డారో వాళ్ళు తమ దాసులనూ పశువులనూ ఇండ్లలోకి త్వరగా తెచ్చారు.
[21] యెహోవా మాటను లక్ష్యపెట్టనివారైతే తమ దాసులనూ పశువులనూ వెలుపల ఉండనిచ్చారు.
[22] యెహోవా మోషేతో అన్నాడు, “నీ చెయ్యి ఆకాశంవైపు చాపు. ఈజిప్ట్‌దేశంలో అంతటా మనుషులమీదా జంతువులమీదా పొలాల్లో ఉన్న మొక్కలన్నిటిమీదా వడగండ్లు పడతాయి.”
[23] మోషే తన కర్రను ఆకాశంవైపు చాపగానే యెహోవా ఉరుములనూ వడగండ్లనూ పుట్టించాడు. పిడుగులు భూమిమీద పడ్డాయి. యెహోవా ఈజిప్ట్‌దేశంపైన వడగండ్లను కురిపించాడు.
[24] ఆ వడగండ్ల వర్షం, దానితో వచ్చిన పిడుగులు చాలా బాధకరమైనవి. ఈజిప్ట్ రాజ్యంగా ఏర్పడ్డనాటినుండి అలాంటిది ఎన్నడూ కలగలేదు.
[25] ఆ వడగండ్లు ఈజిప్ట్ అంతటా వెలుపల ఉండేదాన్నంతా జంతువులనూ మనుషులనూ పొలాల్లో మొక్కలనూ పడగొట్టాయి. ప్రతి చెట్టూ కూడా విరిగిపోయింది.
[26] ఇస్రాయేల్‌ప్రజ కాపురమున్న గోషెన్‌లో మాత్రమే వడగండ్లు పడలేదు.
[27] అప్పుడు ఫరో మోషేనూ అహరోన్నూ పిలిపించి వారితో “ఈ సారి నేను తప్పిదం చేశాను. యెహోవా న్యాయవంతుడు, నేనూ నాప్రజా దోషులం.
[28] దేవుడు పంపిన ఈ ఉరుములూ వడగండ్లూ ఇక చాలు. వాటిని ఆపమని యెహోవాను ప్రాధేయపడండి. నేను మిమ్మల్ని వెళ్ళనిస్తాను. ఇకనుంచి మిమ్మల్ని నిలుపను” అన్నాడు.
[29] అందుకు మోషే అన్నాడు, “నేను నగరంనుంచి బయటికి వెళ్ళగానే నా చేతులు యెహోవావైపు చాపుతాను. ప్రపంచం యెహోవాదే అని మీరు తెలుసుకొనేలా అప్పుడే ఉరుములు ఆగుతాయి, వడగండ్లు ఇక పడవు.
[30] అయినా యెహోవాదేవుడంటే నీకూ నీ సేవకులకూ భయభక్తులు ఇంకా కలగలేదని నాకు తెలుసు.”
[31] ఆ రోజుల్లో జనపనార మొగ్గలు వేసింది. యవల చేలు వెన్నులు వేశాయి గనుక ఈ రెండూ పాడైపొయ్యాయి.
[32] గాని వారి రెండు రకాల గోధుమలు ఇంకా ఎదగలేదు. గనుక అవి పాడు కాలేదు.
[33] మోషే ఫరో దగ్గరనుంచి నగరం బయటికి వెళ్ళి యెహోవావైపు తన చేతులు చాపగానే ఉరుములూ వడగండ్లూ ఆగిపొయ్యాయి, వర్షం అప్పటినుంచి కురియలేదు.
[34] వర్షం, వడగండ్లు, ఉరుములు ఆగిపోవడం ఫరో చూచినప్పుడు అతడూ అతడి పరివారమూ ఇంకా అక్రమం కొనసాగించారు. తమ గుండెలు బండబారిపోయేలా చేసుకొన్నారు.
[35] ఫరో గుండె ఇంకా బండబారిపోయివుంది గనుక యెహోవా మోషేచేత పలికించినట్టే ఫరో ఇస్రాయేల్‌ప్రజను వెళ్ళనివ్వలేదు.