[1] బసెలేల్ తుమ్మకర్రతో ఆ మందసాన్ని చేశాడు. దాని పొడవు రెండున్నర మూరలు, దాని వెడల్పు మూరెడున్నర, దాని ఎత్తు మూరెడున్నర.
[2] దానికి లోపల వెలుపల మేలిమి బంగారు తొడుగు చేశాడు. దానిపై అంచుకు చుట్టూ బంగారు అలంకారం చేశాడు.
[3] ఆ మందసానికి నాలుగు బంగారు ఉంగరాలను పోత పోసి, దాని నాలుగు కాళ్ళకు వాటిని అంటించాడు; ఆ ప్రక్కకు రెండూ, ఈ ప్రక్కకు రెండూ అంటించాడు.
[4] తుమ్మకర్రతో మోతకర్రలు చేసి వాటికి బంగారు తొడుగు చేశాడు.
[5] మందసాన్ని మోయడానికి దాని ప్రక్కలకున్న ఉంగరాలలో ఆ కర్రలు ఉంచాడు.
[6] మందసం కోసం మేలిమి బంగారంతో ప్రాయశ్చిత్తస్థానంగా ఉన్న మూతను చేశాడు. దాని పొడవు రెండున్నర మూరలు, దాని వెడల్పు మూరెడున్నర.
[7] రెండు కెరూబు ఆకారాలు బంగారంతో చేశాడు. రేకుగా కొట్టిన బంగారంతో ఆ మూత రెండు కొనలకు చేశాడు.
[8] ఈ కొనకు ఒక కెరూబు రూపం ఆ కొనకు ఒక కెరూబు రూపం చేశాడు. ఆ రెండు కొనలకు ఉండే కెరూబు రూపాలు ఆ మూతతో ఏకాండంగా చేశాడు.
[9] ఆ కెరూబుల రెక్కలు పైకి విప్పి ఉన్నాయి. అవి ఆ మూతను మరుగు చేశాయి. కెరూబుల ముఖాలు మూతవైపుగా, ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి.
[10] అతడు తుమ్మకర్రతో బల్లను చేశాడు. దాని పొడుగు రెండు మూరలు, దాని వెడల్పు ఒక మూర, దాని ఎత్తు మూరెడున్నర.
[11] దానికి మేలిమి బంగారు తొడుగు చేశాడు. దానిపై అంచుకు చుట్టూ బంగారు అలంకారం చేశాడు.
[12] దాని చుట్టూ బెత్తెడు ఓరను చేసి ఆ ఓరకు చుట్టూ బంగారు అలంకారం చేశాడు.
[13] బల్లకోసం నాలుగు బంగారు ఉంగరాలను పోత పోసి దాని నాలుగు కాళ్ళకుండే నాలుగు మూలలకు ఆ ఉంగరాలు వేశాడు.
[14] బల్లను మోయడానికి మోతకర్రలను పట్టే ఆ ఉంగరాలు దాని ఓరదగ్గరే ఉన్నాయి.
[15] బల్లను మోషే కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు తొడుగు చేశాడు.
[16] బల్లమీద ఉండవలసిన సామాను – దాని పళ్ళేలనూ ధూపార్తులనూ గిన్నెలనూ పానీయార్పణకు పాత్రలనూ – మేలిమి బంగారంతో చేశాడు.
[17] అతడు సప్తదీపస్తంభాన్ని మేలిమి బంగారంతో చేశాడు. దాన్నీ దాని అడుగుభాగాన్నీ నిలువుభాగాన్నీ రేకుగా కొట్టిన బంగారంతో చేశాడు. దాని కలశాలూ పుష్పకోశాలూ పుష్పదళాలూ దానితో ఏకాండంగా చేశాడు.
[18] ఆ దీపస్తంభం ప్రక్కలనుంచి ఆరు కొమ్మలు నిగిడాయి – ఆ ప్రక్కనుంచి మూడు ఈ ప్రక్కనుంచి మూడు.
[19] ఒక కొమ్మమీద మూడు కలశాలు, రెండో కొమ్మమీద మూడు కలశాలు – అలా సప్తదీపస్తంభంనుంచి నిగిడిన ఆరు కొమ్మలమీద ఉన్నాయి. ఆ కలశాలకు పుష్పకోశాలూ, పుష్పదళాలూ గల బాదం పువ్వుల రూపం ఉంది.
[20] సప్తదీపస్తంభం నిలువుభాగానికి బాదం పువ్వుల్లాంటి నాలుగు కలశాలు, దాని పుష్పకోశాలతో, పుష్పదళాలతో ఉన్నాయి.
[21] సప్తదీపస్తంభం నిలువు భాగంనుంచి నిగిడే ఆరు కొమ్మలకు రెండేసి కొమ్మలక్రింద ఒక్కొక్క పుష్పకోశం ఉంది. అవి ఆ కొమ్మలతో ఏకాండంగా ఉన్నాయి.
[22] ఆ పుష్పకోశాలూ ఆ కొమ్మలూ సప్తదీపస్తంభంతో ఏకాండంగా ఉన్నాయి. అదంతా రేకుగా కొట్టిన మేలిమి బంగారంతో చేసిన ఏకాండమైన పని.
[23] దానికి ఏడు దీపాలనూ దాని కత్తెరనూ కత్తెర చిప్పనూ మేలిమి బంగారంతో చేశాడు.
[24] సప్తదీపస్తంభాన్ని, దాని సామాను చెయ్యడంలో ముప్ఫయి నాలుగు కిలోగ్రాముల మేలిమి బంగారం ఉపయోగించాడు.
[25] అతడు ధూపవేదికను తుమ్మకర్రతో చేశాడు. దాని పొడవు ఒక మూర, దాని వెడల్పు ఒక మూర. అది చదరంగా ఉంది. దాని ఎత్తు రెండు మూరలు. దాని కొమ్ముల్లాంటి అలంకారం దానితో ఏకాండంగా ఉన్నాయి.
[26] దాని పైభాగానికీ నాలుగు ప్రక్కలకూ, కొమ్ములకూ మేలిమి బంగారు తొడుగు చేశాడు. దాని పై అంచు చుట్టూ బంగారు అలంకారం చేశాడు.
[27] ఆ అలంకారం క్రింద వేదికకు రెండు బంగారు ఉంగరాలను చేసి దాని ప్రక్కలకు ఇరువైపులా వాటిని ఉంచాడు. అవి ఆ వేదికను మోసే కర్రలకోసం.
[28] ఆ కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు తొడుగు చేశాడు.
[29] పవిత్ర అభిషేక తైలాన్నీ స్వచ్ఛమైన పరిమళ ధూప ద్రవ్యాన్నీ చేసేవారి నేర్పుతో చేశాడు.