Skip to content
Opens in a new window

[1] యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, “నేను, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ‘నీ సంతతివారికి ఆ దేశాన్ని ఇస్తాను’ అని వాగ్దానం చేసిన దేశానికి వెళ్ళు. నీవు ఈజిప్ట్‌దేశంనుంచి వెంటబెట్టుకువచ్చిన ప్రజలతో పాలుతేనెలు నదులైపారుతున్న ఆ దేశానికి తరలివెళ్ళు.

[2] నీకు ముందుగా దేవదూతను పంపుతాను. కనాను, అమోరీ, హిత్తి, పెరిజ్జి, హివ్వి, యోబూసి జాతులవారిని వెళ్ళగొట్టివేస్తాను.

[3] మీరు మొండి ప్రజలు, గనుక మిమ్ములను నాశనం చెయ్యకుండేలా నేను మీతోపాటు రాను.”

[4] ఆ దుర్వార్త విని ప్రజలు విచారపడ్డారు. ఎవ్వరూ ఆభరణాలు ధరించుకోలేదు.

[5] అంతకుముందు యెహోవా మోషేతో, “నీవు ఇస్రాయేల్ ప్రజలతో ఇలా అను: మీరు తలబిరుసుగా ఉన్న ప్రజలు. ఒక క్షణమాత్రం నేను మీ మధ్యలోకి వస్తే మిమ్ములను సమూల నాశనం చేస్తాను. మీ ఆభరణాలు తీసివేయాలి. అప్పుడు మిమ్ములను ఏం చెయ్యాలో చూస్తాను” అన్నాడు.

[6] అందుచేత ఇస్రాయేల్ ప్రజలు హోరేబు పర్వతం దగ్గర తమ ఆభరణాలు తీసివేశారు.

[7] మోషే శిబిరం వెలుపలికి గుడారాన్ని తీసుకువెళ్ళి శిబిరానికి దూరంగా వేసేవాడు. దాన్ని “సన్నిధిగుడారం” అన్నాడు. యెహోవాను వెదకుదామన్న ప్రతి ఒక్కరూ శిబిరానికి బయట ఉన్న ఆ సన్నిధిగుడారానికి వెళ్తూ వచ్చారు.

[8] మోషే ఆ గుడారానికి వెళ్తూ ఉన్నప్పుడెల్లా ప్రజలంతా లేచేవారు, తమ తమ డేరా ద్వారాలలో నిలబడి మోషే ఆ గుడారంలో ప్రవేశించేవరకూ అతనివైపు చూస్తూ ఉండేవారు.

[9] మోషే ఆ గుడారంలో ప్రవేశించగానే స్తంభంలాంటి మేఘం దిగివచ్చి ఆ గుడారం ద్వారాన నిలిచేది. అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడేవాడు.

[10] గుడారం ద్వారాన మేఘస్తంభం నిలవడం చూచినప్పుడెల్లా ప్రజలంతా లేచి తమ తమ డేరా ద్వారాలలో నమస్కారం చేసేవారు.

[11] ఒక వ్యక్తి తన మిత్రుడితో మాట్లాడే విధంగానే యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడే వాడు. తరువాత మోషే శిబిరానికి తిరిగి వచ్చేవాడు. అయితే అతని అనుచరుడు యెహోషువ గుడారంలోనుంచి బయటికి వచ్చేవాడు కాదు. యెహోషువ నూన్ కొడుకూ, యువకుడూ.

[12] మోషే యెహోవాతో ఈ విధంగా అన్నాడు: “ఈ ప్రజను వెంటబెట్టుకొని వెళ్ళమంటూ నీవు నాతో చెపుతున్నావు గానీ నాతో ఎవరిని పంపిస్తావో అది నాకు తెలియజేయలేదు. అంతేగాక, నీవు నాతో అన్నావు గదా – ‘నేను నిన్నూ నీ పేరునూ ఎరుగుదును; నిన్ను దయతో చూస్తున్నాను.’

[13] అందుచేత, నీవు నన్ను దయ చూస్తూ ఉంటే నేను నిన్ను తెలుసుకొనేలా నీ విధానాలు నాకు తెలియజెయ్యి. అప్పుడు నీవు నన్ను ఇంకా దయతో చూస్తావు. చూడు, ఈ జనం నీ ప్రజలే గదా.”

[14] అందుకు యెహోవా “నా సన్నిధానం నీతో వస్తుంది, నేను నీకు విశ్రాంతి ప్రసాదిస్తాను” అన్నాడు.

[15] మోషే ఆయనతో అన్నాడు, “నీ సన్నిధానం నాతో రాదంటే, ఇక్కడనుంచి మమ్ములను వెళ్ళేట్టు చెయ్యకు.

[16] నీవు నన్నూ, నీ ప్రజనూ దయతో చూస్తున్నావని దేనివల్ల తెలుస్తుంది? నీవు మాతో రావడంవల్లే గదా. ఇలాగే గదా నేను, నీ ప్రజలు భూలోకంలో ఉన్న జనాలన్నిటికంటే ప్రత్యేకమైనవారుగా ఉంటాం.”

[17] యెహోవా మోషేతో “నీవు చెప్పిన ఈ మాట ప్రకారం చేస్తాను. ఎందుకంటే నేను నిన్ను దయతో చూస్తున్నాను; నిన్నూ నీ పేరునూ ఎరుగుదును” అన్నాడు.

[18] మోషే “నీ మహిమను నాకు కనుపరచు!” అన్నాడు.

[19] అందుకు ఆయన “నా సుగుణమంతా నీ ముందు దాటేలా చేస్తాను. యెహోవా అనే పేరు నీ ఎదుట ప్రకటిస్తాను. నాకు ఎవరిమీద కరుణ చూపాలని ఉందో వారిమీద చూపుతాను; ఎవరిని కనికరించాలని ఉందో వారిని కనికరిస్తాను.”

[20] ఆయన ఇంకా అన్నాడు, “నీవు నా ముఖాన్ని చూడలేవు; ఎవ్వరూ నన్ను చూచి బ్రతకరు.”

[21] యెహోవా ఇంకా అన్నాడు, “ఇదిగో నాకు దగ్గరగా ఒక స్థలం ఉంది. నీవు ఆ బండమీద నిలబడాలి.

[22] నా మహిమాప్రకాశం నీ దగ్గరనుంచి దాటి పోతూవున్నప్పుడు నేను నిన్ను ఆ బండ సందులో ఉంచి, నేను నీ దగ్గరనుంచి దాటి వెళ్ళేవరకూ నా చేతితో నిన్ను కప్పుతాను.

[23] అప్పుడు నా చెయ్యి తీసివేస్తాను; నీవు నా వీపును చూస్తావు గానీ నా ముఖం కనిపించదు.”

నిర్గమకాండం (దాస్యవిముక్తి) — Chapters