[1] ఇస్రాయేల్‌ప్రజల సమాజమంతా యెహోవా మాట ప్రకారం, తమ ప్రయాణాల్లో సీన్ ఎడారినుంచి పయనిస్తూ రెఫిదీంలో మకాం చేశారు. అక్కడ తమకు తాగే నీళ్ళు లేకపోవడంవల్ల ప్రజలే మోషేతో జగడమాడుతూ,
[2] “తాగే నీళ్ళు మాకియ్యి” అన్నారు. అందుకు మోషే “మీరు నాతో జగడమాడి, ఎందుకు యెహోవాను పరీక్షిస్తున్నారు?” అని అడిగాడు.
[3] కాని అక్కడ చాలా దాహం వేసి ప్రజలు మోషేమీద సణుగుతూ “ఏమయ్యా, మమ్మల్ని ఈజిప్ట్‌నుంచి తీసుకురావడం దేనికీ అంట? మమ్మల్నీ మా పిల్లల్నీ మా పశువుల్నీ దప్పికచేత చంపడానికా?” అన్నారు.
[4] మోషే యెహోవాకు ఆక్రందన చేసి “ఈ ప్రజలకు నేనేం చెయ్యాలి? కాసేపటికి నన్ను రాళ్ళు రువ్వి చంపేలా ఉన్నారు” అన్నాడు.
[5] యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నీవు ఇస్రాయేల్ పెద్దల్లో కొంతమందిని వెంటబెట్టుకొని, నదిని కొట్టిన నీ కర్రను చేతపట్టుకొని ప్రజలకు ముందుగా వెళ్ళు.
[6] ఇదిగో అక్కడ హోరేబు పర్వతం దగ్గర ఉన్న ఆ బండమీద నేను నీకు ఎదురుగా నిలబడతాను. నీవు ఆ బండను కొట్టాలి. అప్పుడు ప్రజలు త్రాగడానికి దానిలోనుంచి నీళ్ళు పారుతాయి.” ఇస్రాయేల్ పెద్దలు చూస్తుండగానే మోషే అలా చేశాడు.
[7] ఇస్రాయేల్‌ప్రజలు పెట్టుకొన్న జగడాన్ని బట్టీ, వారు “యెహోవా మనమధ్య ఉన్నాడా, లేడా?” అంటూ యెహోవాను పరీక్షించినందువల్లా, మోషే ఆ స్థలానికి “మస్సా” “మెరీబా” అనే పేర్లు పెట్టాడు.
[8] అనంతరం అమాలేకు జాతివాళ్ళు వచ్చి రెఫిదీంలో ఇస్రాయేల్‌ప్రజతో యుద్ధం జరిగించారు.
[9] గనుక మోషే యెహోషువతో “మనకోసం మనుషులను ఎన్నుకొని వారిని తీసుకువెళ్ళి అమాలేకువాళ్ళతో యుద్ధం చెయ్యి. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరంపై నిలబడతాను” అన్నాడు.
[10] మోషే తనకు చెప్పినట్టే యెహోషువ చేసి అమాలేకువాళ్ళతో యుద్ధం జరిగించాడు. మోషే, అహరోను, హూరు ఆ కొండ శిఖరమెక్కారు.
[11] అప్పుడు జరిగినదేమిటంటే, మోషే తన చెయ్యి ఎత్తినప్పుడు ఇస్రాయేల్‌ప్రజ గెలవసాగారు; చెయ్యి దించినప్పుడు అమాలేకువాళ్ళు గెలవసాగారు.
[12] అయితే మోషే చేతులు బరువెక్కాయి. అందుచేత వారు ఒక రాయి తీసుకువచ్చి దానిమీద మోషేను కూర్చోబెట్టారు. అహరోను ఈ ప్రక్క, హూరు ఆ ప్రక్క ఉండి, అతని చేతులు పడిపోకుండా ఎత్తి పట్టుకొన్నారు. అలా అతని చేతులు ప్రొద్దు క్రుంకేవరకూ కదలకుండా ఉన్నాయి.
[13] ఆలోగా యెహోషువ ఖడ్గంతో అమాలేకు రాజునూ అతడి వాళ్ళనూ ఓడించాడు.
[14] అప్పుడు యెహోవా మోషేతో “జ్ఞాపకార్థంగా పుస్తకంలో ఈ సంగతి వ్రాసి యెహోషువకు వినిపించు. నేను అమాలేకువాళ్ళ నామరూపాలు ఆకాశంక్రింద లేకుండా పూర్తిగా నిర్మూలం చేస్తాను” అన్నాడు.
[15] అనంతరం మోషే ఒక బలిపీఠం కట్టి, దానికి ‘యెహోవా నిస్సీ’ అనే పేరు పెట్టాడు.
[16] “అమాలేకువాళ్ళు తమ చెయ్యి యెహోవా సింహాసనానికి విరోధంగా ఎత్తారు గనుక యెహోవాకు వాళ్ళతో తరతరాలకు యుద్ధం” అన్నాడు.