Skip to content
Opens in a new window

[1] “తుమ్మకర్రతో ఒక బలిపీఠాన్నీ కూడా నీవు చెయ్యాలి. దాని పొడుగు అయిదు మూరలు, దాని వెడల్పు అయిదు మూరలు. ఆ బలిపీఠం చదరంగా ఉండాలి; దాని ఎత్తు మూడు మూరలు.

[2] దాని నాలుగు మూలలకు కొమ్ములను చెయ్యాలి. దాని కొమ్ములు దానితో ఏకాండంగా ఉండాలి. దానికి కంచు తొడుగు చెయ్యాలి.

[3] దాని బూడిద ఎత్తడానికి బిందెలనూ, దాని పారలనూ పళ్ళేలనూ ముళ్ళనూ నిప్పు తెచ్చే పాత్రలనూ కూడా చెయ్యాలి. ఈ సామానంతా కంచుతో చెయ్యాలి.

[4] ఈ బలిపీఠానికి పెద్ద కంచు జల్లెడ చెయ్యాలి. దానిమీద దాని నాలుగు మూలలకు నాలుగు కంచు ఉంగరాలను చెయ్యాలి.

[5] దాన్ని బలిపీఠం అంచుక్రింద, బలిపీఠం నడిమికి చుట్టు ఉంచాలి.

[6] బలిపీఠం కోసం కర్రలను కూడా చెయ్యాలి. వాటిని తుమ్మకర్రతో చేసి వాటికి కంచుతొడుగు చెయ్యాలి.

[7] బలిపీఠాన్ని మోయడానికి దాని రెండు పక్కల ఉండే ఉంగరాలలో ఈ కర్రలను ఉంచాలి.

[8] బలిపీఠాన్ని పలకలతో గుల్లగా చెయ్యాలి. పర్వతంమీద నీకు కనుపరచిన విధంగానే వారు దాన్ని చెయ్యాలి.

[9] “దైవనివాసం ఆవరణాన్ని ఏర్పరచాలి. అంటే, దక్షిణ దిక్కున ఉన్న వైపున ఆవరణంకోసం పేనిన సన్ననార తెరలుండాలి. వాటికి ఒక పక్కన నూరు మూరలు ఉండాలి.

[10] వాటికి ఇరవై స్తంభాలూ, స్తంభాలకు ఇరవై కంచు గూళ్ళూ ఉండాలి. ఆ స్తంభాల కొక్కేలూ పెండెబద్దలూ వెండివి.

[11] అలాగే ఉత్తర దిక్కున ఈ కొననుంచి ఆ కొనకు నూరు మూరల పొడుగు గల తెరలుండాలి. వాటికి ఇరవై స్తంభాలూ, స్తంభాలకు ఇరవై కంచు గూళ్ళూ ఉండాలి. ఆ స్తంభాల కొక్కేలూ పెండెబద్దలూ వెండివి.

[12] పశ్చిమ దిక్కున ఆవరణం వెడల్పుకోసం యాభై మూరల తెరలుండాలి. వాటి స్తంభాలు పది. వాటి గూళ్ళు పది.

[13] తూర్పువైపున, ఉదయ దిక్కున, ఆవరణం వెడల్పు యాభై మూరలు.

[14] ద్వారానికి ఒక పక్కన పదిహేను మూరల తెరలుండాలి. వాటి స్తంభాలు మూడు, వాటి గూళ్ళు మూడు.

[15] రెండో పక్కన కూడా పదిహేను మూరల తెరలుండాలి. వాటి స్తంభాలు మూడు, వాటి గూళ్ళు మూడు.

[16] ఆవరణ ద్వారానికి ఇరవై మూరల తెర ఒకటి ఉండాలి. నీలి ఊదా ఎర్ర రంగుల దారాలతోను పేనిన సన్ననార బట్టతోను నేతపని చేసేవాడు దాన్ని చెయ్యాలి. దాని స్తంభాలు నాలుగు, దాని గూళ్ళు నాలుగు.

[17] ఆ ఆవరణం చుట్టున్న అన్ని స్తంభాలనూ వెండి పెండెబద్దలతో అతికించాలి. వాటి కొక్కేలు వెండివి, వాటి గూళ్ళు కంచువి.

[18] ఆవరణానికి పొడుగు నూరు మూరలు, వెడల్పు యాభై మూరలు, ఎత్తు అయిదు మూరలు, తెరలు పేనిన సన్న నారవి, వాటి గూళ్ళు కంచువి.

[19] ఆ నివాసంలో జరిగే సేవకోసం ఉపయోగించే మిగతా సామానంతా మేకులన్నీ ఆవరణం మేకులన్నీ కంచువి.

[20] “దీపాలు నిత్యం వెలిగించేలా వాటికోసం ఇస్రాయేల్ ప్రజలు దంచి తీసిన స్వచ్ఛమైన ఆలీవ్ నూనె తేవాలని వారికి ఆజ్ఞ జారీ చెయ్యి.

[21] ఆ దీపాలు సన్నిధిగుడారంలో శాసనాల పెట్టె ఎదుట ఉన్న తెరకు వెలుపల ఉండాలి. సాయంకాలంనుంచి ఉదయంవరకు యెహోవా సన్నిధానానికి ముందు ఆ దీపాలు ప్రజ్వలించేలా అహరోనూ అతని కొడుకులూ దాన్ని సవరిస్తూ ఉండాలి. ఇది ఇస్రాయేల్‌ప్రజలకు వారి తరతరాలకు ఎప్పటికి నిలిచి ఉండే చట్టం.

నిర్గమకాండం (దాస్యవిముక్తి) — Chapters