Skip to content
Opens in a new window

[1] యెహోవా మోషేతో ఇలా అన్నాడు:

[2] “మొదటి నెల మొదటి రోజున నీవు సన్నిధిగుడారం అనే దైవనివాసం నిలబెట్టించాలి.

[3] అందులో శాసనాల పెట్టెను ఉంచి దాన్ని తెరతో మరుగు చెయ్యాలి.

[4] బల్లను లోపలికి తెచ్చి దానిమీద ఉండవలసిన వాటిని వరుసగా ఉంచాలి. సప్తదీపస్తంభాన్ని లోపలికి తెచ్చి దాని దీపాలను వెలిగించాలి.

[5] బంగారు ధూప వేదికను ఆ శాసనాల మందసం ఎదుట ఉంచాలి. దైవనివాసానికి ద్వారం తెరను తగిలించాలి.

[6] సన్నిధిగుడారం అనే దైవనివాసం ద్వారం ఎదుట హోమ పీఠాన్ని ఉంచాలి.

[7] ఆ బలిపీఠానికీ సన్నిధిగుడారానికీ మధ్య గంగాళాన్ని ఉంచాలి. దానిలో నీళ్ళు నింపాలి.

[8] వాటి చుట్టూ ఆవరణాన్ని నిలబెట్టాలి. ఆవరణ ద్వారాన తెరను వ్రేలాడదీయాలి.

[9] అభిషేక తైలాన్ని చేతపట్టుకొని దైవనివాసాన్ని, అందులో ఉన్న ప్రతిదానినీ అభిషేకించాలి. దాన్ని, దాని సామానంతా ప్రతిష్ఠించాలి. అప్పుడు అది పవిత్రం అవుతుంది.

[10] హోమ పీఠాన్నీ దాని సామానంతా అభిషేకించి పీఠాన్ని ప్రతిష్ఠించాలి. పీఠం అతి పవిత్రమవుతుంది.

[11] గంగాళాన్నీ దాని పీఠాన్నీ అభిషేకించి ప్రతిష్ఠించాలి.

[12] “తరువాత నీవు అహరోన్నూ అతని కొడుకులనూ సన్నిధిగుడారం ద్వారానికి తీసుకువచ్చి వారిని నీళ్ళతో స్నానం చేయించాలి.

[13] అహరోను నాకు యాజిగా సేవ చేసేలా నీవు అతనికి ఆ పవిత్ర వస్త్రాలను తొడిగించి అతణ్ణి అభిషేకించి ప్రతిష్ఠించాలి.

[14] అతని కొడుకులను తీసుకువచ్చి వారికి చొక్కాలను తొడిగించాలి.

[15] వారు కూడా నాకు యాజులుగా సేవ చేసేలా వారి తండ్రిని అభిషేకించినట్టు వారినీ అభిషేకించాలి. వారి అభిషేకం తరతరాలకు వారికి నిత్యమైన యాజి ధర్మసూచనగా ఉంటుంది.”

[16] మోషే అలా చేశాడు; యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లెల్లా చేశాడు.

[17] రెండో ఏట మొదటి నెల మొదటి రోజున దైవనివాసం నిలబెట్టారు.

[18] యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే అతడు దైవనివాసాన్ని నిలబెట్టాడు. దాని గూళ్ళను వేసి దాని పలకలను నిలబెట్టి దాని అడ్డకర్రలను పెట్టి దాని స్తంభాలను నిలిపాడు.

[19] దైవనివాసం మీద గుడారాన్ని పరిచాడు. గుడారం మీద దాని పైకప్పును ఉంచాడు.

[20] అతడు శాసనాలను మందసంలో ఉంచి మందసానికి మోతకర్రలను పెట్టి దానిమీద ప్రాయశ్చిత్తస్థానంగా ఉన్న మూతను ఉంచాడు.

[21] మందసాన్ని దైవనివాసంలోకి తెచ్చి అడ్డతెర వ్రేలాడదీసి శాసనాల పెట్టెను మరుగు చేశాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే మోషే చేశాడు.

[22] సన్నిధిగుడారంలో, దైవనివాసం ఉత్తరదిక్కున, అడ్డతెరకు వెలుపల, బల్లను ఉంచి

[23] యెహోవా సన్నిధానం ఎదుట దానిమీద రొట్టెలను వరుసగా పెట్టాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే మోషే చేశాడు.

[24] సన్నిధిగుడారంలో దైవనివాసం దక్షిణ దిక్కున బల్ల ఎదుట సప్తదీపస్తంభాన్ని ఉంచాడు.

[25] యెహోవా సన్నిధానం ఎదుట దీపాలను వెలిగించాడు. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టే మోషే అలా చేశాడు.

[26] సన్నిధిగుడారంలో అడ్డతెర ఎదుట బంగారు వేదికను ఉంచాడు.

[27] దానిమీద పరిమళ ధూప ద్రవ్యాన్ని కాల్చాడు. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టే మోషే చేశాడు.

[28] దైవనివాసం ద్వారానికి తెరను వేశాడు.

[29] సన్నిధిగుడారం అనే దైవనివాసంయొక్క ద్వారం దగ్గర హోమ పీఠాన్ని ఉంచి దానిమీద హోమాన్నీ నైవేద్యాన్నీ సమర్పించాడు. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టే మోషే చేశాడు.

[30] సన్నిధిగుడారానికీ బలిపీఠానికీ మధ్య గంగాళాన్ని ఉంచి కడగడానికి దానిలో నీళ్ళు పోశాడు.

[31] దాని దగ్గర మోషే, అహరోను, అహరోను కొడుకులు చేతులూ కాళ్ళూ కడుగుకొన్నారు.

[32] సన్నిధిగుడారంలోకి వెళ్ళేముందు, బలిపీఠాన్ని సమీపించేముందు, కడుగుకొన్నారు. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టే మోషే చేశాడు.

[33] దైవనివాసం చుట్టూ, బలిపీఠం చుట్టూ ఆవరణాన్ని చేసి ఆవరణ ద్వారం తెరను వేశాడు. ఈ విధంగా మోషే ఆ పని సంపూర్తి చేశాడు.

[34] అప్పుడు ఆ మేఘం సన్నిధిగుడారాన్ని కమ్మింది; దైవనివాసం యెహోవా మహిమాప్రకాశంతో నిండిపోయింది.

[35] ఆ మేఘం దైవనివాసం మీద నిలవడంచేత, సన్నిధిగుడారం యెహోవా మహిమాప్రకాశంతో నిండిపోవడంచేత మోషే సన్నిధిగుడారంలోకి వెళ్ళలేకపోయాడు.

[36] ఇస్రాయేల్ ప్రజల ప్రయాణాలన్నిటిలోనూ మేఘం దైవనివాసం మీదనుంచి పైకి పోయేటప్పుడెల్లా వారు తరలి వెళ్ళేవారు.

[37] మేఘం పైకి పోకుండా ఉంటే, అది పైకి పోయే రోజువరకు వారు ప్రయాణం చేసేవారు కారు.

[38] ఇస్రాయేల్ ప్రజల కళ్ళెదుటే, పగటివేళ యెహోవా మేఘం దైవనివాసం మీద ఉండేది, రాత్రివేళ మేఘంలో మంటలు ఉండేవి. వారి ప్రయాణాలన్నిటిలో ఈ విధంగా జరిగేది.

నిర్గమకాండం (దాస్యవిముక్తి) — Chapters