Skip to content
Opens in a new window

[1] “ధూపం వేయడానికి తుమ్మకర్రతో ఒక వేదికను చెయ్యాలి.

[2] దాని పొడుగు ఒక మూర, దాని వెడల్పు ఒక మూర. అది చదరంగా ఉండాలి. దాని ఎత్తు రెండు మూరలు. దాని కొమ్ములు దానితో ఏకాండంగా ఉండాలి.

[3] దాని పైభాగానికీ దాని నాలుగు ప్రక్కలా దాని కొమ్ములకూ మేలిమి బంగారు తొడుగు చెయ్యాలి. దాని అంచుకు చుట్టూ బంగారు అలంకారం చెయ్యాలి.

[4] ఆ అలంకారానికి క్రింద వేదికకు రెండు బంగారు ఉంగరాలు చెయ్యాలి. దాని ప్రక్కలకు ఇరువైపుల వాటిని ఉంచాలి. అవి ఆ వేదికను మోసే కర్రల కోసం.

[5] ఆ కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు తొడుగు చెయ్యాలి.

[6] వేదికను శాసనాల పెట్టెకు ముందున్న తెర వెలుపల, ఆ శాసనాలపై ప్రాయశ్చిత్తస్థానంగా ఉన్న మూత ఎదుట ఉంచాలి. ఆ మూతదగ్గర నేను నిన్ను కలుసుకొంటాను.

[7] ఆ వేదికమీద అహరోను పరిమళ ధూపద్రవ్యాలను కాల్చాలి. ప్రతి రోజూ ఉదయకాలంలో అతడు దీపాలను చక్కపరిచేటప్పుడు అలా కాల్చాలి.

[8] సాయంకాలం కూడా అహరోను దీపాలు వెలిగించేటప్పుడు అలా కాల్చాలి. యెహోవా సన్నిధానంలో మీ తరతరాలకూ నిత్యంగా ఆ ధూపం ఉండాలి.

[9] ఆ వేదికమీద నిషేధమైన ధూపాన్ని వెయ్యకూడదు, హోమాన్ని గానీ నైవేద్యాన్ని గానీ అర్పించకూడదు; దానిమీద పానార్పణనూ అర్పించకూడదు.

[10] ఆ వేదిక కొమ్ములమీద సంవత్సరానికి ఒకసారి అహరోను ప్రాయశ్చిత్తం చెయ్యాలి; ప్రాయశ్చిత్తానికి అర్పించిన పాపాలకోసమైన బలిరక్తంతో ఆ వేదిక కోసం ప్రాయశ్చిత్తం చెయ్యాలి. మీ తరతరాలకూ సంవత్సరానికి ఒకసారి ఇలా జరగాలి. ఆ వేదిక యెహోవాకు అతి పవిత్రంగా ఉంటుంది.”

[11] యెహోవా మోషేతో ఇంకా అన్నాడు:

[12] “నీవు ఇస్రాయేల్‌ప్రజలను జాబితాలో చేర్చడానికి వారిని లెక్కపెట్టినప్పుడు, ఆ సమయంలో ప్రతి ఒకడూ తన ప్రాణం కోసం యెహోవాకు విడుదల వెల చెల్లించాలి. వారిని లెక్క పెట్టినప్పుడు వారిమీదికి విపత్తు రాకుండేలా వారు అలా చెయ్యాలి.

[13] జాబితాలో చేరిన ప్రతివాడూ అర తులం వెండి ఇవ్వాలి; పవిత్రస్థానం తులం తూనిక ప్రకారం పూర్తి బరువు ఇవ్వాలి. ఆ అర తులం యెహోవాకు కానుకగా ఇవ్వాలి.

[14] ఆ జాబితాలో చేరిన ప్రతివాడూ అంటే ఇరవై ఏళ్ళవారూ అంతకంటే ఎక్కువ వయస్సువారు అందరూ యెహోవాకు ఆ కానుక ఇవ్వాలి.

[15] ధనవంతుడు అర తులంకంటే ఎక్కువ ఇవ్వకూడదు; బీదవాడు తక్కువ ఇవ్వకూడదు. మీ ప్రాణాలకోసం ప్రాయశ్చిత్తం చెయ్యడానికి యెహోవాకు కానుక ఇచ్చేటప్పుడు అర తులమే ఇవ్వాలి.

[16] ప్రాయశ్చిత్తంకోసం ఇస్రాయేల్‌ప్రజలు ఇచ్చిన ఆ వెండి నీవు తీసుకొని సన్నిధిగుడారం సేవకు ఉపయోగించాలి. అది మీ ప్రాణాల ప్రాయశ్చిత్తం కోసం, యెహోవా సన్నిధానంలో ఇస్రాయేల్ ప్రజలను గురించి స్మృతి చిహ్నంగా ఉంటుంది.”

[17] యెహోవా మోషేతో ఇంకా అన్నాడు:

[18] “కడుగు కోవడానికి నీవు కంచు గంగాళం చెయ్యాలి. దానికి కంచు పీఠం కూడా చెయ్యాలి. నీవు దాన్ని సన్నిధిగుడారానికీ బలిపీఠానికీ మధ్య ఉంచాలి. దానిలో నీళ్ళు పోయాలి.

[19] అహరోనూ అతని కొడుకులూ తమ చేతులూ కాళ్ళూ ఆ నీళ్ళతో కడుగుకోవాలి.

[20] వారు సన్నిధిగుడారంలోకి వచ్చేటప్పుడు చావకుండేలా నీళ్ళతో కడుగుకోవాలి. సేవ చెయ్యడానికి వారు బలిపీఠం సమీపించి యెహోవాకు హోమం అర్పించేముందు,

[21] చావకుండేలా చేతులూ కాళ్ళూ కడుగుకోవాలి. ఇది వారికి, అంటే అహరోనుకూ అతని సంతానానికీ, తరతరాలకూ ఎప్పటికి నిలిచి ఉండే చట్టం.”

[22] యెహోవా మోషేతో ఇంకా అన్నాడు:

[23] “నీవు అన్నిట్లో శ్రేష్ఠమైన సుగంధ ద్రవ్యాలను తీసుకొని పవిత్ర అభిషేక తైలం చెయ్యాలి. అయిదు వందల తులాల పలుచని బోళం, సుగంధంగల దాల్చిన చెక్క సగం అంటే, రెండు వందల యాభై తులాలు,

[24] రెండు వందల యాభై తులాల నిమ్మగడ్డి, అయిదు వందల తులాల లవంగిపట్ట ఉపయోగించాలి. ఆ తులాలు పవిత్ర స్థానం తులం తూనిక ప్రకారం ఉండాలి. అయిదు లీటర్ల ఆలీవ్ నూనె కూడా ఉపయోగించాలి.

[25] పరిమళ ద్రవ్యాన్ని చేసేవాడి నేర్పు ప్రకారం ఆ పరిమళ ద్రవ్యాన్ని చెయ్యాలి. అది పవిత్ర అభిషేక తైలంగా ఉంటుంది.

[26] ఆ నూనెతో నీవు సన్నిధిగుడారాన్ని అభిషేకించాలి. దానితోపాటు శాసనాల పెట్టెనూ

[27] బల్లనూ దాని సామానంతా సప్తదీపస్తంభాన్నీ దాని సామానంతా ధూపవేదికనూ

[28] హోమ బలిపీఠాన్నీ దాని సామాన్నంతా, గంగాళాన్నీ దాని పీఠాన్నీ కూడా అభిషేకించాలి.

[29] అవన్నీ అతి పవిత్రంగా ఉండేలా నీవు వాటిని పవిత్రపరచాలి. వాటికి తగిలే ప్రతిదీ పవిత్రమవుతుంది.

[30] అహరోనూ అతని కొడుకులూ నాకు యాజులుగా సేవ చేసేలా నీవు వారిని కూడా అభిషేకించి ప్రతిష్ఠించాలి.

[31] నీవు ఇస్రాయేల్‌ప్రజలతో ఇలా చెప్పాలి: “మీ తరతరాలకు ఇది నాకు పవిత్ర అభిషేక తైలం.

[32] యాజులు కాని వారి శరీరంమీద దాన్ని పోయకూడదు; దాని పాళ్ళ ప్రకారం అలాంటిదాన్ని చెయ్యకూడదు. అది పవిత్రమైనది; దాన్ని పవిత్రమైనదిగా మీరు భావించాలి.

[33] దానివంటి దాన్ని కలిపేవాణ్ణి గానీ దాన్ని యాజి కానివాడిమీద పోసేవాణ్ణి గాని తన ప్రజలలో లేకుండా చేయాలి.”

[34] యెహోవా మోషేతో ఇంకా అన్నాడు: “నీవు పరిమళ ద్రవ్యాలను తీసుకొని ధూపద్రవ్యం చెయ్యాలి, జటామాంసినీ, గోపిచందనాన్నీ, గంధపుచెక్కనూ – ఈ పరిమళ ద్రవ్యాలనూ స్వచ్ఛమైన సాంబ్రాణినీ సమభాగాలుగా ఉపయోగించాలి.

[35] పరిమళ ద్రవ్యాన్ని చేసేవాడి నేర్పు ప్రకారం వాటితో ధూపద్రవ్యాన్ని చెయ్యాలి. దానిలో ఉప్పు కూడా వెయ్యాలి. ఆ ధూప సంబారం స్వచ్ఛంగా పవిత్రంగా ఉంటుంది.

[36] దానిలో కొంత పొడి చేసి నేను నిన్ను కలుసుకొనే సన్నిధిగుడారంలో శాసనాల పెట్టె ఎదుట ఉంచాలి. దాన్ని అతి పవిత్రమైనదిగా మీరు భావించాలి.

[37] నీవు చెయ్యవలసిన ఆ ధూపంలాంటి దాన్ని, దాని పాళ్ళ ప్రకారం, మీకోసం చేసుకోకూడదు. దాన్ని యెహోవాకు పవిత్రమైనదిగా భావించాలి.

[38] దాని వాసన చూద్దామని దానివంటిది చేసేవాణ్ణి ప్రజలలో లేకుండా చేయాలి.”

నిర్గమకాండం (దాస్యవిముక్తి) — Chapters