[1] యెహోవా నదిని కొట్టి ఏడు రోజులయ్యాక మోషేతో ఇలా అన్నాడు: “నీవు ఫరోదగ్గరకు వెళ్ళి ఇలా చెప్పు – యెహోవా చెప్పేదేమిటంటే, నా ప్రజ నన్ను ఆరాధించి సేవించడానికి వారిని వెళ్ళనియ్యి.
[2] నీవు వారిని వెళ్ళనియ్యడానికి ఒప్పుకోకుండా ఉన్నావా, విను, నేను నీ దేశాన్నంతా సరిహద్దులవరకు కప్పలచేత బాధిస్తాను.
[3] నది కప్పలమయంగా ఉంటుంది. అవి నదిలోనుంచి వచ్చి నీ ఇంట్లోకీ నీ పడకగదిలోకీ నీ మంచంమీదికీ నీ సేవకుల ఇండ్లలోకీ నీ ప్రజమీదికీ నీ పొయ్యిలలోకీ నీ పిండి పిసికే తొట్లలోకీ దూరుతాయి.
[4] ఆ కప్పలు నీ మీదికీ నీ జనంమీదికీ నీ సేవకులందరిమీదికీ దూకుతాయి.”
[5] యెహోవా మోషేతో అన్నాడు, “నీవు అహరోనుతో ‘నీ కర్ర చేతపట్టుకొని నది పాయలమీదా కాలువలమీదా చెరువులమీదా నీ చెయ్యి చాపి కప్పలు ఈజిప్ట్‌దేశంమీదికి వచ్చేలా చెయ్యి’ అని చెప్పు.”
[6] అహరోను ఈజిప్ట్ జలాలమీద తన చెయ్యి చాపినప్పుడు కప్పలు పైకి వచ్చి ఈజిప్ట్‌దేశాన్ని కమ్మాయి.
[7] అయితే మాంత్రికులు తమ మంత్రవిద్య ద్వారా అలా చేశారు. వాళ్ళు కూడా ఈజిప్ట్‌దేశంమీదికి కప్పలు వచ్చేలా చేశారు.
[8] అప్పుడు ఫరో మోషేనూ అహరోన్నూ పిలిపించి “నాదగ్గర్నుంచీ నా జనం దగ్గర్నుంచీ ఈ కప్పల్ని తొలగించమని యెహోవాను ప్రాధేయపడండి. అప్పుడు యెహోవాకు బలులు అర్పించడానికి ఈ ప్రజను వెళ్ళనిస్తాను” అన్నాడు.
[9] అందుకు మోషే అన్నాడు, “ఈ కప్పలు నదిలోనే మిగిలి, మీ దగ్గర, మీ ఇండ్లలో ఉండకుండా నాశనమయ్యేలా మీకోసం మీ పరివారంకోసం, మీ జనంకోసం నేనెప్పుడు ప్రాధేయపడాలి? వేళ నియమించే ఘనత మీదే.” ఫరో “రేపు” అన్నాడు.
[10] మోషే అన్నాడు, “మా దేవుడైన యెహోవా వంటి వాడెవ్వడూ లేడని మీరు తెలుసుకోవాలి, గనుక మీ మాట ప్రకారమే జరుగుతుంది.
[11] కప్పలు మిమ్మల్నీ మీ ఇళ్ళనూ మీ సేవకులనూ మీ జనాన్నీ విడిచిపోతాయి. అవి నదిలోనే మిగులుతాయి.”
[12] మోషే అహరోనులు ఫరో దగ్గరనుంచి బయటికి వచ్చిన తరువాత యెహోవా ఫరోమీదికి రప్పించిన కప్పలను గురించి మోషే ఆయనను ప్రాధేయపడ్డాడు.
[13] మోషే మనవి ప్రకారం యెహోవా చేశాడు. ఇళ్ళలోనూ ఆవరణాల్లోనూ పొలాల్లోనూ కప్పలు చచ్చాయి.
[14] ప్రజలు వాటిని కుప్పలుగా వేశారు. దేశం కంపు కొట్టింది.
[15] అయినా, బాధనివారణ అయిందని ఫరో తన గుండె బండబారిపోయేలా చేసుకొన్నాడు. యెహోవా చెప్పినట్లే అతడు వారి మాటను నిర్లక్ష్యం చేశాడు.
[16] యెహోవా మోషేతో అన్నాడు, “నీవు అహరోనుతో ఇలా చెప్పు: ‘నీ కర్ర చాపి నేలమీది దుమ్మును కొట్టు’. దుమ్ము ఈజిప్ట్‌దేశంలో అంతటా దోమలు అవుతాయి.”
[17] వారు అలా చేశారు. అహరోను తన కర్ర చేతపట్టుకొని దాన్ని చాపి నేలమీది దుమ్మును కొట్టినప్పుడు ఈజిప్ట్‌దేశంలో అంతటా నేల దుమ్మంతా దోమలు అయింది. అవి మనుషులమీదా జంతువులమీదా వచ్చి పడ్డాయి.
[18] మాంత్రికులు కూడా దోమలు పుట్టించడానికి తమ మంత్రవిద్యద్వారా ప్రయత్నం చేశారు గాని అది వాళ్ళచేత కాలేదు. మనుషులమీదా జంతువులమీదా దోమలు ఉన్నాయి.
[19] మాంత్రికులు ఫరోతో “ఇది దైవశక్తి” అని ఒప్పుకొన్నారు. అయితే ఫరో గుండె బండబారిపోయి ఉంది, గనుక యెహోవా చెప్పినట్టే అతడు వాళ్ళ మాటను అలక్ష్యం చేశాడు.
[20] యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “తెల్లవారగానే నీవు లేవాలి. అప్పుడు ఫరో నది దగ్గరికి వెళ్తాడు. నీవక్కడ అతని ఎదుట నిలబడివుండి ఇలా చెప్పాలి: నా ప్రజ నన్ను ఆరాధించి సేవించడానికి వారిని వెళ్ళనియ్యి,
[21] నీవు నా ప్రజను వెళ్ళనియ్యక పొయ్యావా నేను నీమీదికీ నీ సేవకులమీదికీ నీ ప్రజలమీదికీ నీ ఇళ్ళలోకీ ఈగల గుంపులను పంపిస్తాను. ఈజిప్ట్‌వాళ్ళ ఇళ్ళూ భూములూ ఈగల గుంపులతో నిండి ఉంటాయి.
[22] అయితే నా ప్రజ కాపురమున్న గోషెను ప్రదేశంలో ఈగల గుంపులుండవు. ఆ రోజు ఆ ప్రదేశాన్ని ప్రత్యేకపరుస్తాను. ఈ విధంగా యెహోవా అనే నేనే ఈ దేశంలో ఉన్నానని నీవు తెలుసుకొనేలా చేస్తాను.
[23] నా ప్రజలపట్ల, నీ ప్రజలపట్ల వేరువేరు విధాలుగా వ్యవహరిస్తాను. ఈ అద్భుతమైన సూచన రేపు జరుగుతుంది.”
[24] యెహోవా అలాగే చేశాడు. బాధకరమైన ఈగల గుంపులు ఫరో ఇంట్లోకీ అతడి సేవకుల ఇళ్ళలోకీ ఈజిప్ట్‌దేశంలో అంతటా వచ్చాయి. ఆ దేశం ఈగల గుంపులవల్ల పాడయింది.
[25] ఫరో మోషేనూ అహరోన్నూ పిలిపించి, “మీరు వెళ్ళి మీ దేవుడికి బలులు అర్పించండి గానీ ఈ దేశంలోనే అలా చెయ్యాలి” అన్నాడు.
[26] అందుకు మోషే ఇలా జవాబిచ్చాడు: “అలా చేయతగదు. మేము మా దేవుడైన యెహోవాకు అర్పించే బలులు ఈజిప్ట్‌వాళ్ళకు అసహ్యమైనవి. ఇదిగో ఈజిప్ట్‌వాళ్ళ కళ్ళెదుట వాళ్ళకు అసహ్యమైన బలులు మేము అర్పిస్తే వాళ్ళు మామీద రాళ్ళు రువ్వి చంపరా?
[27] మేము ఎడారిలోకి మూడు రోజుల ప్రయాణం చేసి మా దేవుడు యెహోవా మాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అక్కడే ఆయనకు బలులు అర్పిస్తాం.”
[28] ఫరో ఒప్పుకొన్నాడు. “మీరు మీ దేవుడు యెహోవాకు బలులు అర్పించడానికి మిమ్ముల్ని ఎడారిలోకి వెళ్ళనిస్తాను. అయితే దూరం వెళ్ళకండి. ఇప్పుడు నాకోసం దేవుణ్ణి ప్రాధేయపడండి” అన్నాడు.
[29] మోషే “ఇదిగో విను. నేను మీదగ్గరనుంచి వెళ్ళి యెహోవాను ప్రాధేయపడతాను. రేపు ఈ ఈగల గుంపులు ఫరోనూ అతని సేవకులనూ అతని ప్రజలనూ విడిచిపోతాయి. అయితే ఈ ప్రజ యెహోవాకు బలులు అర్పించడానికి ఫరో వారిని వెళ్ళనియ్యకుండా ఇంకా మోసంతో వ్యవహరించకూడదు” అన్నాడు.
[30] మోషే ఫరోదగ్గరనుంచి వెళ్ళి యెహోవాను ప్రార్థించాడు.
[31] యెహోవా మోషే మనవి ప్రకారం చేశాడు, ఈగల గుంపులను ఫరోదగ్గరనుంచీ, అతడి సేవకుల, అతడి ప్రజల దగ్గరనుంచి తొలగించాడు. ఒక్కటైనా మిగలలేదు.
[32] అయితే ఈ సారి కూడా ఫరో తన గుండె బండబారిపోయేలా చేసుకొని ప్రజను వెళ్ళనివ్వలేదు.