[1] అందుకు మోషే జవాబిస్తూ, “కానీ వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. ‘యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు’ అంటారు” అన్నాడు.
[2] “నీ చేతిలో ఉన్నది ఏమిటి?” అని యెహోవా అడిగాడు. “కర్ర” అన్నాడు మోషే.
[3] “దాన్ని నేలమీద పడవెయ్యి” అని ఆయన అన్నాడు. మోషే దాన్ని నేలమీద పడవేసినప్పుడు అది పాము అయింది. మోషే దానిదగ్గరనుంచి పారిపొయ్యాడు గాని యెహోవా మోషేతో ఇలా అన్నాడు:
[4] “నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకో (అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకోగానే అది అతని చేతిలో కర్ర అయింది).
[5] యెహోవా, వారి పూర్వీకుల దేవుడు, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడని వారు నమ్మేలా నీవు ఈ విధంగా చెయ్యాలి.”
[6] యెహోవా అతనితో ఇంకా అన్నాడు, “నీ చెయ్యి నీ రొమ్మున నీ చొక్కాలోపల పెట్టుకో”. అతడు అలా చేసి, తరువాత బయటికి తీసినప్పుడు చెయ్యి అంతా కుష్ఠే! హిమమంత తెల్లగా అయిపోయింది.
[7] “నీ చెయ్యి మళ్ళీ రొమ్మున పెట్టుకో” అన్నాడాయన. మోషే అలా చేసి, తరువాత తన చెయ్యి బయటికి తీసినప్పుడు అది మళ్ళీ అతని మిగతా శరీరంలాగా అయింది.
[8] “ఒకవేళ వారు నిన్ను నమ్మకుండా, ఆ మొదటి సూచనవల్ల నీ మాట వినకపోతే ఈ రెండో దానివల్ల వింటారు.
[9] వారు ఈ సూచనలు రెండూ నమ్మకుండా నీ మాట వినకుండా ఉంటే, నీవు అక్కడి నదిలోనుంచి కొంచెం నీళ్ళు తీసుకొని పొడి నేలమీద పోయాలి. నీవు నదిలో నుంచి తీసి పోసిన ఆ నీళ్ళు పొడి నేలమీద రక్తం అవుతాయి” అని యెహోవా అన్నాడు.
[10] మోషే యెహోవాతో “ప్రభూ, ఇంతకుముందు నాకు వాగ్దాటి లేదు. నీవు నీ దాసుడైన నాతో మాట్లాడినా, ఇప్పటికీ నా సంగతి అంతే. నా మాట మాంద్యం, నాలుక మందం” అన్నాడు.
[11] అందుకు యెహోవా ఇలా అన్నాడు: “మనిషికి నోరిచ్చినదెవరు? మనిషిని మూగవాడుగా, చెవిటివాడుగా, చూపుగలవాడుగా, గుడ్డివాడుగా చేసేదెవరు? యెహోవా అనే నేనే గదా.
[12] అయితే ఇప్పుడు వెళ్ళు. నేను నీ నోటికి తోడుగా ఉంటాను. నీవేమి అనాలో నీకు చెపుతాను.”
[13] మోషే “ప్రభూ! దయచేసి ఇంకా ఎవరినైనా ఎన్నుకొని పంపించు” అని బదులు చెప్పాడు.
[14] యెహోవా కోపం మోషేమీద రగులుకొంది. “లేవీ గోత్రికుడైన నీ అన్న అహరోను ఉన్నాడు గదా. అతడు బాగా మాట్లాడగలడని నాకు తెలుసు. ఇప్పుడు అతడు నిన్ను కలుసుకోవడానికి వస్తున్నాడు కూడా. నిన్ను చూచి అతనికి హృదయంలో సంతోషం కలుగుతుంది.
[15] నీవు అతనితో మాట్లాడుతూ అతని నోటికి మాటలు అందించాలి. నేను నీ నోటికీ అతని నోటికీ తోడుగా ఉండి మీరు ఏమి చెయ్యాలో మీకు ఉపదేశిస్తాను.
[16] అతడు నీకు బదులు ప్రజలతో మాట్లాడుతాడు. అతడే నీకు నోరు అన్నమాట. నీవు అతనికి దేవుని స్థానంలో ఉన్నట్టే!
[17] ఆ చేతికర్రను పట్టుకుపో. దానితో ఆ సూచనలు చూపాలి.”
[18] అప్పుడు మోషే తన మామ యిత్రో దగ్గరకు తిరిగి వెళ్ళాడు. “ఈజిప్ట్‌లో నా బంధువులు ఇంకా బ్రతికి ఉన్నారో లేదో చూడడానికి నన్ను వెళ్ళనివ్వండి” అని అతడితో అన్నాడు. యిత్రో “క్షేమంగా వెళ్ళిరా” అన్నాడు.
[19] మిద్యానులో యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: “నిన్ను చంపాలని చూచినవాళ్ళంతా చనిపోయారు, గనుక ఈజిప్ట్‌కు తిరిగి వెళ్ళు.”
[20] మోషే తన భార్యనూ తన కొడుకులనూ గాడిదమీద ఎక్కించుకొని ఈజిప్ట్‌కు తిరిగి వెళ్ళడానికి ప్రయాణం సమకట్టాడు. “దేవుని కర్ర”ను కూడా చేతపట్టుకొని వెళ్ళాడు.
[21] ఆ సమయంలో యెహోవా మోషేతో చెప్పినదేమంటే, “నీవు ఈజిప్ట్‌కు తిరిగి చేరిన తరువాత, నేను నీ అధికారంలో ఉంచిన అద్భుతాలన్నీ ఫరో ఎదుట చెయ్యాలి సుమా. నేను అతడి గుండె బండబారిపోయేలా చేస్తాను. అతడు ఇస్రాయేల్ ప్రజను వెళ్ళనియ్యడు.
[22] అప్పుడు నీవు ఫరోతో ఇలా అనాలి: యెహోవా చెప్పేదేమంటే, ఇస్రాయేల్ ప్రజ నా సంతానం! నా జ్యేష్ఠ కుమారుడు!
[23] నన్ను ఆరాధించి సేవించడానికి నా కుమారుణ్ణి వెళ్ళనిమ్మని నీకు చెప్పాను. నీవు నామాట తిరస్కరించావా నీ పెద్దకొడుకును చంపుతాను.”
[24] ప్రయాణంలో వారు మజిలీ చేసిన చోట యెహోవా మోషేను సమీపించి అతణ్ణి చంపదలచాడు.
[25] అయితే మోషే భార్య సిప్పోరా పదునుగల రాయి చేతపట్టుకొని తన కొడుకుకు సున్నతి చేసి వాడి మర్మాంగ చర్మం కొన మోషే పాదాల దగ్గర పడవేసింది. “నిజంగా నువ్వు నా పాలిటి రక్తసంబంధమైన భర్తవు” అంది.
[26] అందుచేత యెహోవా మోషేను బ్రతకనిచ్చాడు. అప్పుడు ఆమె “సున్నతి విషయంలో రక్తసంబంధమైన భర్తవే” అంది.
[27] ఇంతలో యెహోవా అహరోనుతో “మోషేను కలుసు కోవడానికి ఎడారికి వెళ్ళు” అన్నాడు, గనుక అతడు వచ్చి దేవుని పర్వతం దగ్గర అతణ్ణి కలుసుకొన్నాడు, ముద్దుపెట్టుకొన్నాడు.
[28] యెహోవా తనను పంపిన సంగతినీ ఆయన చెప్పమన్న మాటలన్నీ చేయమని ఆజ్ఞాపించిన అద్భుతాలన్నీ మోషే అహరోనుకు తెలిపాడు.
[29] మోషే అహరోనులు వెళ్ళి ఇస్రాయేల్‌ప్రజల పెద్దలందరినీ సమకూర్చారు.
[30] యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను తెలియజేశాడు. ప్రజల ఎదుట ఆ అద్భుతమైన సూచనలు చేశాడు.
[31] ప్రజలకు నమ్మకం కుదిరింది. యెహోవా ఇస్రాయేల్‌ప్రజను సందర్శించి వారి బాధలు చూశాడని విని వారు తలలు వంచుకొని దేవుణ్ణి ఆరాధించారు.