Skip to content
Opens in a new window

[1] అతడు తుమ్మకర్రతో బలిపీఠాన్ని చేశాడు. దాని పొడవు అయిదు మూరలు, దాని వెడల్పు అయిదు మూరలు. అది చదరంగా ఉంది. దాని ఎత్తు మూడు మూరలు.

[2] దాని నాలుగు మూలలో దానితో ఏకాండంగా దాని నాలుగు కొమ్ములను చేశాడు. దానికి కంచు తొడుగు చేశాడు.

[3] ఆ బలిపీఠం సామాను – దాని బిందెలనూ దాని పారలనూ పళ్ళేలనూ ముళ్ళనూ అగ్నిపాత్రలనూ – కంచుతో చేశాడు.

[4] బలిపీఠానికి కంచు జల్లెడను దాని అంచు క్రింద నడిమికి చుట్టు చేశాడు.

[5] ఆ కంచు జల్లెడ నాలుగు మూలలకోసం మోతకర్రలను పట్టే నాలుగు ఉంగరాలను పోత పోశాడు.

[6] ఆ కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి కంచు తొడుగు చేశాడు.

[7] బలిపీఠాన్ని మోయడానికి దాని ప్రక్కలకున్న ఆ ఉంగరాలలో ఆ కర్రలను ఉంచాడు. బలిపీఠాన్ని పలకలతో గుల్లగా చేశాడు.

[8] గంగాళాన్నీ దాని పీఠాన్నీ కంచుతో చేశాడు. వాటిని చెయ్యడంలో సన్నిధిగుడారం ద్వారానికి ఆరాధించడానికి వచ్చిన స్త్రీల అద్దాలను ఉపయోగించాడు.

[9] అప్పుడు అతడు ఆవరణం చేశాడు. దక్షిణ దిక్కున ఉన్న ప్రక్కకు పేనిన సన్నని నార తెరలు వేశాడు. ఆ ప్రక్క పొడవు నూరు మూరలు.

[10] ఆ తెరల స్తంభాలు ఇరవై, వాటి కంచు గూళ్ళు ఇరవై. స్తంభాల కొక్కేలూ, పెండెబద్దలూ వెండివి.

[11] ఉత్తర దిక్కున ఉన్న ప్రక్క పొడవు కూడా నూరు మూరలు. స్తంభాలు ఇరవై, వాటి కంచు గూళ్ళు ఇరవై. స్తంభాల కొక్కేలూ పెండెబద్దలూ వెండివి.

[12] పడమటి ప్రక్క తెరల పొడుగు యాభై మూరలు. వాటి స్తంభాలు పది. స్తంభాల కొక్కేలూ పెండెబద్దలూ వెండివి.

[13] ఉదయ దిక్కున, అంటే తూర్పువైపున యాభై మూరలు;

[14] ద్వారానికి ఒక ప్రక్క తెరల పొడవు పదిహేను మూరలు. వాటి స్తంభాలు మూడు, వాటి గూళ్ళు మూడు.

[15] ద్వారానికి రెండో ప్రక్క తెరల పొడవు కూడా అంతే; ఆవరణ ద్వారానికి ఇరుప్రక్కలా ఉన్న తెరల పొడవు పదిహేను మూరలు. వాటి స్తంభాలు మూడు; వాటి గూళ్ళు మూడు.

[16] ఆవరణం చుట్టూ ఉన్న తెరలన్నీ పేనిన సన్నని నారవి.

[17] స్తంభాల గూళ్ళు కంచువి. స్తంభాల కొక్కేలూ పెండెబద్దలూ వెండివి. వాటి పైభాగాలు వెండి తొడుగు చేసినవి. ఆవరణ స్తంభాలన్నీ వెండి పెండెబద్దలతో అతికించాడు.

[18] ఆవరణ ద్వారం తెర నీలి ఊదా ఎర్ర రంగు దారాలతోను పేనిన సన్నని నార దారాలతోను చేసిన బుట్టా పని. దాని పొడవు ఇరవై మూరలు; దాని వెడల్పు ఆవరణ తెరలతో సరిగా అయిదు మూరలు ఎత్తుగా ఉండేది.

[19] ద్వారం తెర స్తంభాలు నాలుగు, వాటి గూళ్ళూ నాలుగు. అవి కంచువి. వాటి కొక్కేలు వెండివి. వాటి పైభాగాలకు వెండి తొడుగు చేసి ఉంది; వాటి పెండెబద్దలు వెండివి.

[20] దైవనివాసంకోసం దాని చుట్టూ ఉన్న ఆవరణంకోసం ఉపయోగించిన మేకులన్నీ కంచువి.

[21] దైవనివాసం సామాను మొత్తం, ఆ శాసనాల గుడారం సామాను మొత్తం ఇదే. అహరోనుయాజి కొడుకైన ఈతామారు, లేవీ గోత్రికులచేత, మోషే ఆజ్ఞ ప్రకారం, ఆ వస్తువులను లెక్క పెట్టించాడు.

[22] యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టెల్లా ఊరీ కొడుకు బసెలేల్ చేశాడు. అతడు హూర్ మనుమడూ యూదా గోత్రంవాడు.

[23] అహీసామాక్ కొడుకు అహోలీయాబు అతనితో కలిసి పని చేసేవాడు. అతడు దానుగోత్రంవాడు. అతడు చెక్కేవాడు, నేర్పుగల పనివాడు, నీలి ఊదా ఎర్ర రంగు దారాలతోను సన్నని నార దారాలతోను నేసేవాడు.

[24] ఆ పని అంతటిలో – పవిత్ర స్థానం పూర్తిగా నిర్మించడంలో – ఉపయోగించిన అర్పణ బంగారమంతా పవిత్రస్థానం తులం తూనిక ప్రకారం వెయ్యి కిలోగ్రాములు.

[25] జాబితాలో చేరిన ఇస్రాయేల్ సమాజంవారు ఇచ్చిన వెండి, పవిత్ర స్థానం తులం తూనిక ప్రకారం, మూడు వేల నాలుగు వందల ఇరవై అయిదు కిలోగ్రాములు.

[26] ప్రజను లెక్కపెట్టినప్పుడు జాబితాలో చేరినవారిలో ఒక్కొక్కరూ, అంటే ఇరవై ఏళ్ళవారూ అంతకంటే ఎక్కువ వయస్సు గలవారూ, అర తులం వెండి ఇచ్చారు. వారి సంఖ్య ఆరు లక్షల మూడు వేల అయిదు వందల యాభై.

[27] తెరలకోసం, ఆరాధన గుడారంకోసం గూళ్ళు పోత పోయడంలో మూడు వేల నాలుగు వందల కిలోగ్రాముల వెండి ఉపయోగించారు – ఒక్కొక్క గూడు కోసం ముప్ఫయి నాలుగు కిలోగ్రాముల వెండి.

[28] ఇరవై అయిదు కిలోగ్రాముల వెండితో అతడు స్తంభాలకు కొక్కేలను చేసి స్తంభాల పైభాగాలకు తొడుగు చేసి వాటి పెండెబద్దలను చేశాడు.

[29] అర్పణ కంచు దాదాపు రెండు వేల నాలుగు వందల పది కిలోగ్రాములు.

[30] దానితో అతడు చేసినవి – సన్నిధి గుడారం ద్వారం కోసం గూళ్ళు, కంచు బలిపీఠం, దాని కంచు జల్లెడ, బలిపీఠం సామానంతా,

[31] చుట్టు ఉన్న ఆవరణంకోసం ఉన్న గూళ్ళు, ఆవరణద్వారం కోసం గూళ్ళు, దైవనివాసం మేకులన్నీ, చుట్టూ ఉన్న ఆవరణ మేకులన్నీ.

నిర్గమకాండం (దాస్యవిముక్తి) — Chapters